
ఉన్నతి చేతిలో అనూహ్య ఓటమి
ముగిసిన ప్రణయ్ పోరాటం
క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ
చాంగ్జౌ: ఈ ఏడాది మరో టోర్నమెంట్‌లో భారత స్టార్, ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధు నిరాశ పరిచింది. చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు కథ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. అనూహ్యంగా ఈసారి భారత రైజింగ్ స్టార్, హరియాణాకు చెందిన ఉన్నతి హుడా చేతిలో సింధు ఓడిపోవడం గమనార్హం. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్ సింధు 16–21, 21–19, 13–21తో ప్రపంచ 35వ ర్యాంకర్, 17 ఏళ్ల ఉన్నతి హుడా చేతిలో ఓటమి పాలైంది. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధుకు ఆద్యంతం గట్టిపోటీ ఎదురైంది.
తొలి గేమ్‌లో పలుమార్లు ఇద్దరి స్కోర్లు సమమయ్యాయి. స్కోరు 13–13 వద్ద వరుసగా మూడు పాయింట్లు నెగ్గిన ఉన్నతి 16–13తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఉన్నతి ఒక పాయింట్ కోల్పోయి, వెంటనే వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 20–14తో ముందంజ వేసింది. సింధు రెండు పాయింట్లు నెగ్గిన తర్వాత మరో పాయింట్ చేజార్చుకొని తొలి గేమ్‌ను కోల్పోయింది. రెండో గేమ్‌లోనూ ఇద్దరూ ప్రతి పాయింట్‌కూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. గత ఏడాది సయ్యద్ మోదీ ఓపెన్ టోర్నీలో సింధు చేతిలో వరుస గేముల్లో ఓడిన ఉన్నతి ఈసారి మాత్రం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.
స్కోరు 19–19 వద్ద సింధు రెండు పాయింట్లు నెగ్గి గేమ్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో ఆరంభంలోనే ఉన్నతి 9–5తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని 15–9కు పెంచుకుంది. స్కోరు 16–13 వద్ద ఉన్నతి ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అకానె యామగుచి (జపాన్)తో ఉన్నతి ఆడుతుంది.
అంతర్జాతీయ టోర్నీల్లో భారత క్రీడాకారిణి చేతిలో సింధు ఓడిపోవడం 2018 తర్వాత ఇదే తొలిసారి. 2018 కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్లో సైనా చేతిలో సింధు ఓటమి పాలైంది. 2019 జాతీయ చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ సైనా చేతిలోనే సింధు పరాజయం పాలైంది. ఈ ఏడాది సింధు ఇండియా ఓపెన్, ఇండోనేసియా మాస్టర్స్, ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్, స్విస్ ఓపెన్, ఆసియా చాంపియన్‌షిప్, మలేసియా మాస్టర్స్, సింగపూర్ ఓపెన్, ఇండోనేసియా ఓపెన్, జపాన్ ఓపెన్ టోర్నీలలో ఆడింది. జనవరిలో స్వదేశంలో జరిగిన ఇండియా ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరడమే ఈ ఏడాది సింధు అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం.
పురుషుల సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసింది. భారత మూడో ర్యాంకర్ హెచ్‌ఎస్ ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. ఆరో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో ప్రణయ్ 21–18, 15–21, 8–21తో ఓడిపోయాడు. తొలి గేమ్‌ను నెగ్గిన ప్రణయ్ అదే జోరును కొనసాగించలేకపోయాడు. వరుసగా రెండు గేమ్‌లను కోల్పోయి ఓటమి పాలయ్యాడు. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–19, 21–19తో ఎనిమిదో సీడ్ లియో రాలీ కర్నాండో–బగాస్ మౌలానా (ఇండోనేసియా) జోడీపై విజయం సాధించింది.
సింధుపై గెలుస్తానని అస్సలు ఊహించలేదు. తుది ఫలితం గురించి ఆలోచించకుండా నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే లక్ష్యంతో బరిలోకి దిగాను. మొత్తానికి సింధుపై నెగ్గడం నాకే ఆశ్చర్యమనిపిస్తోంది. మ్యాచ్‌లో నేను రెండుసార్లు హాక్ ఐ చాలెంజ్‌లను వృథా చేసుకున్నాను. చివరకు నా వద్ద అప్పీల్ చేసుకునేందుకు మరో అవకాశం లేకపోవడంతో కాస్త అసహనం కలిగింది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో సంయమనం కోల్పోకుండా ఆడి విజయం అందుకున్నాను.– ఉన్నతి హుడా