Yaroslava Mahuchikh: బాంబుల మోత తప్పించుకొని పతకం గెలిచి..

Ukraine Yaroslava Mahuchikh Escaping Bombing-Won Silver Medal WAC 2022 - Sakshi

అమెరికాలోని ఒరెగాన్‌లో జరుగుతున్న వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో ఉక్రెయిర్‌ హై జంప్‌ క్రీడాకారిణి యారోస్లావా మహుచిఖ్ రజతం సాధించింది. అందరిలానే పతకం సాధించిందిగా ఇందులో ఏముందిలే అనుకోవద్దు. యారోస్లావా పతకం సాధించడం ఇప్పుడు పెద్ద విశేషమే. ఎందుకంటే యారోస్లావా ఉక్రెయిన్‌ దేశస్థురాలు కాబట్టి. దాదాపు నాలుగు నెలలుగా కంటి మీద కునుకు లేకుండా రష్యా ఉక్రెయిన్‌ మీద దాడులు చేస్తూనే ఉంది.

యుద్ధ వాతావరణంలో ఉన్న తన దేశం నుంచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని స్నేహితుల సాయంతో మూడురోజుల పాటు కారులో ప్రయాణించి ఉక్రెయిన్‌ను దాటి అమెరికాలో అడుగుపెట్టింది. ఒక పక్క ఉక్రెయిన్‌ బాంబుల మోతతో దద్దరిల్లుతున్నప్పటికి దేశానికి పతకం తేవాలన్న ఆమె సంకల్పాన్ని మెచ్చుకొని తీరాల్సిందే. అందుకే యారోస్లావా సాధించింది రజతమే అయినా ఆమె దృష్టిలో మాత్రం అది బంగారు పతకమేనని పేర్కొంది.

బుధవారం జరిగిన మహిళల హై జంప్‌ ఫైనల్‌ రసవత్తరంగా సాగింది. 2.02 మీటర్ల ఎత్తును( దాదాపు 6 అడుగుల ఏడున్నర అంగుళాలు) ఆస్ట్రేలియాకు చెందిన ఎలినర్‌ పాటర్‌సన్‌ క్లియర్‌ చేసింది. ఆ తర్వాత  వచ్చిన యారస్లావా మాత్రం తృటిలో దానిని అందుకోలేకపోయింది. దీంతో పాటర్‌సన్‌ స్వర్ణం దక్కించుకోగా.. యారోస్లావా మహుచిఖ్ రజతం గెలిచింది. పతకం సాధించిన అనంతరం యారోస్లావా ఎమెషనల్‌ అయింది.

''నేను సాధించింది రజతమే కావొచ్చు.. నా దృష్టిలో మాత్రం అది స్వర్ణ పతకం కిందే లెక్క. ఈ పతకం రష్యాతో యుద్దంలో అసువుల బాసిన నా దేశ సైనికులకు.. ప్రజలకు అంకితమిస్తున్నా. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బాంబుల మోతతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్‌ను దాటడానికి మూడు రోజులు పట్టింది. ఈ క్రమంలో నా ప్రాణాలు పోయినా దేశం కోసం ఆనందంగా ప్రాణత్యాగం చేశాననుకుంటా. దేవుడి దయవల్ల ఈరోజు వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొని పతకం సాధించా'' అంటూ చెప్పుకొచ్చింది.

అయితే రష్యాకు చెందిన స్టార్‌ హైజంపర్‌.. డిపెండింగ్‌ చాంపియన్‌ మారియా లసిట్స్కేన్ తమ దేశంపై నిషేధం ఉండడంతో వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనలేకపోయింది. మారియా వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో వరుసగా మూడుసార్లు స్వర్ణం సాధించడం విశేషం.

చదవండి: భారత్‌కు భారీ షాక్‌.. డోప్‌ టెస్టులో పట్టుబడ్డ స్టార్‌ అథ్లెట్‌లు..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top