Uber Cup 2022: సింధు సహా భారత షట్లర్లకు భంగపాటు

Uber Cup: PV Sindhu Led Indian Shuttlers Crushed By Korea - Sakshi

బ్యాంకాక్‌: ఉబెర్ కప్ 2022లో భారత మహిళా షట్లర్లకు ఘోర పరాభవం ఎదురైంది. బుధవారం జరిగిన గ్రూప్ డి చివరి క్లాష్‌లో పీవీ సింధుతో పాటు భారత షట్లర్లంతా మూకుమ్మడిగా చేతులెత్తేశారు. కొరియా టీమ్‌ చేతిలో సింధు నేతృత్వంలోని భారత జట్టు 0-5 తేడాతో ఘోర పరాజయం పాలైంది. తొలి మ్యాచ్‌లో భారత డబుల్‌ ఒలింపిక్‌ మెడలిస్ట్‌, ప్రపంచ నంబర్ 7 పీవీ సింధు.. యాన్ సే యంగ్ చేతిలో 15-21, 14-21తేడాతో ఓటమిపాలవ్వగా, రెండో మ్యాచ్‌లో డబుల్స్ జోడీ శ్రుతి మిశ్రా, సిమ్రన్ సింఘి 13-21, 12-21 తేడాతో లీ సోహీ-షిన్ సెంగ్ చాన్ జోడీ చేతిలో పరాజయం పాలైంది. 

మూడో మ్యాచ్‌లో తకాషి కశ్యప్‌ (కిమ్ గా యున్‌ చేతిలో 10-21, 10-21 తేడాతో), నాలుగో మ్యాచ్‌లో తనీషా క్రాస్టో, ట్రీసా జోలీ జోడీ (14-21, 11-21 తేడాతో కిమ్ హే జియాంగ్-కాంగ్ హీ యోంగ్ చేతిలో), ఆఖరి మ్యాచ్‌లో అష్మితా చలిహా ( సిమ్ యుజిన్‌ చేతిలో 18-21, 17-21తేడాతో) వరుసగా ఓటమిపాలయ్యారు. 

గ్రూప్‌ డి తొలి రెండు క్లాషెష్‌లో కెనడా, యూఎస్‌ఏ షట్లర్లను మట్టికరిపించిన భారత మహిళా జట్టు నామమాత్రమైన చివరి పోరులో కొరియా జట్టు చేతిలో దారుణ పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ టోర్నీలో తొలి రెండు క్లాషెష్‌లో విజయం సాధించడం ద్వారా భారత జట్టు ఇదివరకే క్వార్టర్స్‌ బెర్తును ఖరారు చేసుకుంది. రేపు (మే 12) జరుగబోరే క్వార్టర్ ఫైనల్లో (నాకౌట్‌) సింధు టీమ్‌.. థాయ్‌లాండ్‌ జట్టుతో తలపడనుంది. మరోవైపు థామస్‌ కప్‌లో భారత పురుషుల టీమ్‌ కూడా ఇదివరకే క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది.
చదవండి: సత్తా చాటిన సింధు.. ఉబెర్‌ కప్‌ క్వార్టర్స్​లో భారత్​

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top