U19 T20 WC: Gongadi Trisha Proud Father Rami Reddy Inspiring Story In Telugu - Sakshi
Sakshi News home page

T20 WC: మరో మిథాలీగా ఎదగాలని ఆ తండ్రి ఆశ.. ‘దంగల్‌’లో అమీర్‌ఖాన్‌లా రామిరెడ్డి!

Published Tue, Jan 31 2023 9:57 AM | Last Updated on Tue, Jan 31 2023 12:46 PM

U19 T20 WC: Gongadi Trisha Proud Father Rami Reddy Inspiring Journey - Sakshi

U19 Women T20 World Cup- Gongadi Trisha- సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: స్పోర్ట్స్‌ నేపథ్యంలో వెండితెర మీద విజయఢంకా మోగించిన సినిమాలు ఎన్నో. అందులో ప్రథమ స్థానం రియల్‌ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన దంగల్‌కు దక్కుతుంది. జాతీయ స్థాయిలో ఆడలేకపోయిన మల్లయోధుడు మహవీర్‌ తన ఇద్దరు కూతళ్లను మల్లయోధులుగా తీర్చిదిద్ది దేశానికి అనేక పతకాలు సాధించేలా ఎంతో శ్రమించాడు.

ఆ కష్టాన్ని అమీర్‌ఖాన్, ఫాతిమా సనా, మల్హోత్రాలు వెండితెర మీద కళ్లకు కట్టారు. అచ్చంగా అలాంటి స్ఫూర్తిదాయక జీవితాలు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తారసపడతాయి. గోదావరి తీరాన శ్రీరాముడి పాదల చెంతన త్రిష – రామిరెడ్డిలు మన దంగల్‌ కథకు ప్రతిరూపాలుగా నిలిచారు. 22 గజాల క్రికెట్‌ పిచ్‌లో రాణించేందుకు త్రిష సాగించిన, సాగిస్తోన్న గురించి ప్రయాణం ఆమె తండ్రి రామిరెడ్డి మాటల్లో....

నేను హాకీ ప్లేయర్‌ని
స్వతహాగా నేను హాకీ ప్లేయర్‌ని. ఆటల్లో నా వారసులు నన్ను మించేలా ఎదగాలని కోరుకున్నాను. ఒక క్రీడాకారుడిగా నా జీవితంలో ఎదురైన అనుభవాల ఆధారంగా నా పిల్లలకు క్రీడల్లో ఎదురయ్యే ఆటంకాలు రాకుండా చూసుకోవాలని వాళ్లు పుట్టకముందే డిసైడ్‌ అయ్యాను.

క్రికెటర్‌ను చేయాలని
అప్పటి వరకు ఉన్న ఆటలను పరిశీలిస్తే షటిల్, టెన్నిస్‌ తదితర గేమ్స్‌ హైట్‌ అడ్వాంటేజ్‌ గేమ్స్‌. ప్లేయర్‌లో ఎంత ప్రతిభ ఉన్నా హైట్‌ సరిగా లేకపోతే ఈ ఆటల్లో రాణించడం కష్టం. అయితే ఎత్తుతో సంబంధం లేని గేమ్స్‌ ఏంటా అని పరిశీలిస్తే ఫుట్‌బాల్, క్రికెట్‌లు కనిపించాయి.

భద్రాచలంలో ఫుట్‌బాల్‌ ఆడేందుకు, కోచింగ్‌ ఇచ్చేందుకు అనుకూలమైన పరిస్థితి లేదు. అదే క్రికెట్‌ అయితే గల్లీ క్రికెట్‌ మొదలు భద్రాద్రి కప్‌ వరకు పాజిటివ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఉన్నట్టు అనిపించింది.

మిథాలీలా ఎదగాలని.. రెండేళ్ల వయసు నుంచే
దీంతో నాకు అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా భవిష్యత్తులో క్రికెట్‌లో గొప్ప స్థాయికి వెళ్లేలా అండగా నిలవాలని నిర్ణయించుకున్నాను. సాధారణంగా పిల్లలకు ఏడేళ్ల నుంచి ఏదైనా ఆటలో ప్రొఫెషనల్‌ కోచింగ్‌ ఇప్పించడం మొదలవుతుంది.

కానీ నేను త్రిషాకు నేరు రెండేళ్ల వయస్సు నుంచే ప్రారంభించాను, త్రిష పుట్టిన సమయానికి విమెన్‌ క్రికెట్‌లో మిథాలిరాజ్‌ డబుల్‌ సెంచరీలతో సంచలనాలు నమోదు చేస్తోంది.

వరల్డ్‌కప్‌ ఆడుతుందని నమ్మాను 
లేడీ సచిన్‌గా పేరు తెచ్చుకుంటోంది. దీంతో మిథాలీ స్ఫూర్తితో కేవలం రెండేళ్ల వయస్సులో తనకు ఏమీ తెలియనప్పటి నుంచే క్రికెటింగ్‌ షాట్లు ఆడటం నేర్పిస్తూ వచ్చాను. తనకు తెలియకుండానే అది మజిల్‌ మెమోరీలో ఇమిడి పోయింది. ఆ మజిల్‌ మెమొరీ తనకు ఎంతగానో ఉపయోగపడింది. తను ఎదుగుతున్న కొద్దీ ఆటలో ఆ తేడాను బయటి వాళ్లు కనిపెట్టలేకపోయినా నేను పసిపగడుతూ వచ్చాను.

దీంతో తనకు ఏదో ఒక రోజు ఇండియా తరఫున విమెన్‌ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించడమే కాదు, కచ్చితంగా వరల్డ్‌ కప్‌ కూడా ఆగుతుందనే విశ్వాసం ఉండేది. ఏడేళ్ల వయస్సులో హైదరాబాద్‌కు అడ్వాన్స్, సైంటిఫిక్‌ కోచింగ్‌ కోసం త్రిషకు ఏడేళ్ల వయస్సు ఉన్నప్పుడు హైదరాబాద్‌కు షిప్ట్‌ అయ్యాం. అక్కడ సెయింట్‌ జాన్స్‌ క్రికెట్‌ అకాడమీకి వచ్చాం.

వాళ్లిద్దరి ప్రత్యేక శిక్షణలో
ఇక్కడ, జాన్‌ మనోజ్‌ సార్‌ త్రిష వీడియోను పరిశీలించారు. అప్పుడే వారు తను ఏదో ఒకరోజు ఇండియాకు ఆడుతుందని చెప్పారు. ఆర్‌ శ్రీధర్, ఇక్బాల్‌లు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. రోజకు ఎనిమిది గంటల పాటు సాధన చేసేది. వారి అంచనాలను నిజం చేస్తూ 16లో దేశానికి ఎంపికైంది. 12 ఇయర్స్‌కి ఛాలెంజర్స్‌ సిరీస్‌కు సెలక్ట్‌ అయ్యింది. దీంతో మా నమ్మకం వమ్ము కాదనే నమ్మకం కలిగింది.

హ్యపీగా ఉంది
నా అంచనాలకు మించి ఏకంగా వరల్డ్‌ కప్‌ విన్నింగ్‌ టీమ్‌లో మెంబర్‌గా ఉండటమే కాదు ఫైనల్‌లో విలువైన పరుగులు చేసింది త్రిష. మా కుటుంబం, బంధువులు, కోచ్‌లు, భద్రాచలం పట్టణం అంతా సంతోషంగా ఉన్నాం. త్రిష విజయాన్ని భద్రాచలం పట్టణం అంతా కేక్‌లు కట్‌ చేసుకుని తమ ఇంటి పండగలా చేసుకోవడం చూస్తే పట్టరాని సంతోషం కలుగుతోంది.

తదుపరి లక్ష్యం అదే
ప్రస్తుతం అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ విన్నింగ్‌ జట్టులో ఉన్న త్రిష ప్రస్తుతం భావనాస్‌ కాలేజీలో ఇంటర్మీడియ్‌ సెకండియర్‌ (సీఈసీ) చదువుతోంది. రాబోయే రోజుల్లో ఇండియన్‌ సీనియర్స్‌ జట్టుకు ఎంపిక కావాలనేది తదుపరి లక్ష్యం. అంతేకాదు విమెన్‌ వరల్డ్‌ కప్‌ జట్టులో తాను ఉండాలి, కప్‌ కొట్టాలనేది మా కుటుంబం లక్ష్యం.

చదవండి: Ind Vs Aus: సెలక్షన్‌ కమిటీ డోర్లు బాదడం మాత్రమే కాదు.. ఏకంగా! అయినా పాపం
IND vs NZ: న్యూజిలాండ్‌తో మూడో టీ20.. టీమిండియాకు గ్రాండ్‌ వెలకమ్‌! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement