Olympics, Paralympics: మట్టిలో మాణిక్యాలు.. హర్యానా సక్సెస్‌ సీక్రెట్‌?

Tokyo Olympics And Paralympics: What Is Haryana Success Secret - Sakshi

భారత ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈసారి మనకు స్వర్ణాల పంట పండింది. టోక్యో ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో నీరజ్‌ చోప్రా (జావెలిన్‌ త్రో) పసిడి అందించి చరిత్ర సృష్టించగా.. పారాలింపిక్స్‌లో అవని లేఖరా, సుమిత్‌ అంటిల్‌, ప్రమోద్‌ భగత్‌, కృష్ణా నగర్‌,  మనీష్‌ నర్వాల్‌ స్వర్ణాలు సాధించి గర్వకారణమయ్యారు. వీరితో పాటు మన క్రీడాకారులంతా మెరుగ్గా రాణించడంతో ఒలింపిక్స్‌లో మొత్తంగా 7 పతకాలు, పారాలింపిక్స్‌లో 19 పతకాలు మన సొంతమయ్యాయి.  అయితే, మెడల్స్‌ సాధించిన ఆటగాళ్లలో చాలా మంది హర్యానాకు చెందిన వారే కావడం విశేషం.

మొత్తంగా.. ఈ రాష్ట్రానికి చెందిన 9 మంది అథ్లెట్లు పతకాలు గెలవడం గమనార్హం. ముఖ్యంగా గత రెండు ఎడిషన్లలో పారాలింపిక్స్‌లో హర్యానా అథ్లెట్లు ఆరు మెడల్స్‌తో మెరవడం వారి ప్రతిభకు అద్దం పడుతోంది. మరి దేశ జనాభాలో కేవలం 2 శాతం గల ఈ చిన్నరాష్ట్రం భారత్‌కు క్రీడామణికాంతులను అందించే నర్సరీగా ఎలా మారింది? విశ్వ వేదికపై సత్తా చాటిన హర్యానా సక్సెస్‌ సీక్రెట్‌ ఏంటి?

భారీ ఆర్థిక సాయం, నజరానాలు
ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌లో పతకం సాధించిన క్రీడాకారులకు ఏ రాష్ట్రంలో లేనివిధంగా హర్యానా భారీ నజరానాలు అందజేస్తుంది. ఒలింపిక్‌లో స్వర్ణం సాధిస్తే ఆరు కోట్లు, రజతానికి 4, కాంస్యానికి రెండున్నర కోట్ల రూపాయలు క్రీడాకారులకు ఇచ్చేది. అంతేకాదు తృటిలో పతకం కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచిన వారికి కూడా 50 లక్షల ప్రోత్సాహకం అందించేది. 2018 వరకు ఈ సంప్రదాయాన్ని పాటించింది. 

ఇక తాజా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ప్రతీ ప్లేయర్‌కు రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షల రూపాయలు అందించింది. ఈ తరహాలో క్రీడల కోసం భారీగా ఖర్చు చేయడం హర్యానాకు మాత్రమే సాధ్యమైంది. ఈ విషయం గురించి హాకీ ఇంటర్నేషనల్‌ మాజీ ప్లేయర్‌, ప్రస్తుత క్రీడా శాఖా మంత్రి సందీప్‌ సింగ్‌ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘చాలా మంది ఆటగాళ్లు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లే.

అలాంటి సందర్భాల్లో క్రీడలను కెరీర్‌గా ఎంచుకునే ధైర్యం చేయాలంటే ఈమాత్రం ప్రోత్సాహకాలు ఉండాలి. వారి కుటుంబాలకు కూడా ఓ భరోసా ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు. నిజానికి ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ అందించే నజరానాల కంటే హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అందించే మొత్తం చాలా ఎక్కువ. విశ్వక్రీడల్లో పసిడి సాధిస్తే 75 లక్షలు, మిగతా ఒలింపియన్స్‌కు కేవలం లక్ష రూపాయల బహుమానం మాత్రమే ఉంటుంది.

మూలాలే బలంగా..
సాధారణంగా చాలా రాష్ట్రాల్లో ఒలింపిక్స్‌ లేదంటే ఇతర ప్రధాన ఈవెంట్లలో పతకం సాధించిన తర్వాత క్రీడాకారులను ప్రభుత్వ ఉద్యోగాలు వరిస్తాయి. కానీ హర్యానాలో అందుకు భిన్నం. మెరికల్లాంటి ఆటగాళ్లను గుర్తించి.. ఆర్థిక భరోసా ఉండేలా ముందుగానే ఉద్యోగ భద్రత కల్పించడం విశేషం. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో రెండు పతకాలు సాధించిన బాక్సర్‌ మనోజ్‌కుమార్‌ ఈ విషయం గురించి చెబుతూ.. ‘‘చాలా మంది చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చినవారే. ఆర్థిక తోడ్పాటు లేనివారే. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం ఉంటే భవిష్యత్తు బాగుంటుందని భావిస్తారు.

అందుకే, క్రీడల్లో ప్రతిభ కనబరిచే వారికి ప్రభుత్వం ముందుగానే ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు చేపడుతోంది. కాబట్టి ఇక వారు ఎలాంటి ఆందోళన లేకుండా ఆటలపై దృష్టి సారించే వీలు కలుగుతుంది’’ అని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో పేర్కొన్నారు. కాగా పోలీస్‌ విభాగం సహా ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆటగాళ్లకు చోటు కల్పించేలా చర్యలు తీసుకున్న తొలి రాష్ట్రాల్లో హర్యానా ఉందనడంలో అతిశయోక్తి లేదు.

మట్టిలోని మాణిక్యాలు.. ప్రతిభకు పదునుపెట్టి
2008 నాటి నుంచి ప్రతి ఒలింపిక్స్‌లో హర్యానాకు చెందిన కనీసం ఒక రెజ్లర్‌ అయినా సరే కచ్చితంగా పతకం సాధించడం పరిపాటిగా మారింది. ఈసారి టోక్యో ఒలింపిక్స్‌లో మొత్తం​ రాష్ట్రం నుంచి తొమ్మిది మంది రెజ్లర్లు ప్రాతినిథ్యం వహించారు. అదే విధంగా.. కామన్‌వెల్త్‌ క్రీడలు, వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌, ఏసియన్‌ గేమ్స్‌లోనూ ఇప్పటికే సత్తా చాటారు.

మాజీ రెజ్లర్‌, ప్రస్తుతం కోచ్‌గా సేవలు అందిస్తున్న ఈశ్వర్‌ దహియా(2016 ఒలింపిక్‌ మెడలిస్ట్‌ సాక్షి మాలిక్‌ ఈయన శిక్షణలోనే రాటు దేలారు) ఈ విషయాల గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘‘మట్టిలో మాణిక్యాలను గుర్తించి, సహజమైన ప్రతిభను వెలికితీయడం ఇక్కడ సర్వసాధారణం. ప్రభుత్వం కూడా అనేక సదుపాయాలు కల్పిస్తోంది. అయితే, ఇంకాస్త మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే పతకాల పంట పండుతుంది. అయితే, కేవలం మెడల్స్‌ వస్తేనే మేం సంతృప్తి చెందం. సాధించాల్సింది ఇంకా ఉందనే విషయాన్ని ఎల్లపుడూ గుర్తుపెట్టుకుంటాం’’ అని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో వ్యాఖ్యానించారు.  

విశ్వవేదికపై మెరిసిన హర్యానా ఆణిముత్యాలు
టోక్యోలో  హర్యానా ప్లేయర్లు అద్భుతమే చేశారు. జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా స్వర్ణం సాధించి సరికొత్త చరిత్ర లిఖించగా.. రెజ్లర్లు రవికుమార్‌ దహియా(రజతం), భజరంగ్‌ పునియా(కాంస్యం) మెడల్స్‌ సాధించారు. అంతేగాక ఒలింపిక్‌ చరిత్రలో తొలిసారిగా సెమీస్‌ చేరిన మహిళా హాకీ జట్టులోనూ కెప్టెన్‌ రాణీ రాంపాల్‌ సహా తొమ్మిది మంది ప్లేయర్లు ఉండటం విశేషం. 

పసిడి సాధించిన నీరజ్‌ చోప్రా తమ రాష్ట్రం గురించి మాట్లాడుతూ.. ‘‘హర్యానా ప్రజలు పోరాటయోధులు. క్రీడల్లో మా విజయానికి ఈ గుణమే కారణం. మేం దృఢంగా ఉంటాం. జాతీయంగా ఎప్పుడో మా ప్రతిభను నిరూపించుకున్నాం. ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జిస్తున్నాం’’ అని హర్షం వ్యక్తం చేశాడు. 

ఇక పారాలింపిక్స్‌లో పసిడి నెగ్గిన షూటర్‌ మనీష్‌ నర్వాల్‌ కోచ్‌ రాకేశ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ.. ‘‘ఫరిదాబాద్‌ వంటి పలు పట్టణాల్లో అనేక షూటింగ్‌ రేంజ్‌లు ఉన్నాయి. షూటింగ్‌ పట్ల ఉన్న క్రేజ్‌కు ఇది నిదర్శనం. బల్లాబ్‌ఘర్‌లో ఉన్న నా రేంజ్‌లోనూ దాదాపు 10 మంది అంతర్జాతీయంగా పోటీపడుతున్నారు. 30-35 మంది జాతీయంగా వివిధ ఈవెంట్లలో పాల్గొంటున్నారు. మా వ్యవస్థ క్రీడలను ప్రోత్సహించే విధంగా ఉంది. విజయాలు సాధించడానికి మూలాలు బలంగా ఉండటమే కారణం’’ అని పేర్కొన్నారు.

ఒలింపిక్స్‌లో హర్యానా
2008 బీజింగ్‌:
రెండు కాంస్యాలు- బాక్సర్‌ విజేందర్‌సింగ్‌, రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌
2012 లండన్‌:
ఒక రజతం(రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌), రెండు కాంస్యాలు(రెజ్లర్‌ యోగేశ్వర్‌ దత్‌, బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌)
2016 రియో:
ఒక కాంస్యం(రెజ్లర్‌ సాక్షి మాలిక్‌)
2020 టోక్యో:
ఒక స్వర్ణం(నీరజ్‌ చోప్రా), ఒక రజతం(రెజ్లర్‌ రవికుమార్‌ దహియా), 2 కాంస్యాలు(రెజ్లర్‌ భజరంగ్‌ పునియా), పురుషుల హాకీ జట్టు సభ్యులు

పారాలింపిక్స్‌లో పతకాలు
2016 రియో
రజతం(షాట్‌పుట్టర్‌ దీపా మాలిక్‌)
2020 టో​క్యో:
2 స్వర్ణాలు(జావెలిన్‌ త్రోయర్‌ సుమిత్‌ అంటిల్‌, షూటర్‌ మనీష్‌ నర్వాల్‌), ఒక రజతం(షూటర్‌ సింగ్‌రాజ్‌ అధానా), 2 కాంస్యాలు(అధానా, ఆర్చర్‌ హర్వీందర్‌ సింగ్‌)
- వెబ్‌డెస్క్‌

చదవండి: Virat Kohli: అరె ఏంట్రా ఇది.. ఈసారి వసీం, మైకేల్‌ ఒకేమాట!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top