Ind Vs Aus 1st ODI: ఆసీస్‌తో వన్డే సమరానికి టీమిండియా సై.. ప్రధాన లక్ష్యం అదే!

Today first odi match between India and Australia - Sakshi

భారత్, ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌ 

కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా  

ఆత్మవిశ్వాసంతో ఆసీస్‌  

మ.గం.1.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం  

సాధారణంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఏ ఫార్మాట్‌లో పోరు అయినా ఆసక్తిని రేపుతుంది. కానీ బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీకి ఉన్న ప్రాధాన్యత కారణంగా టెస్టు మ్యాచ్‌లపై ఇటీవలి వరకు అందరి దృష్టీ నిలవగా, త్వరలో జరగబోయే ఐపీఎల్‌పై కూడా చర్చ షురూ కావడంతో ఈ వన్డే సిరీస్‌పై హడావిడి కాస్త తక్కువగా కనిపిస్తోంది. పైగా వరల్డ్‌ కప్‌ సూపర్‌ లీగ్‌లో కూడా ఈ సిరీస్‌ భాగం కాదు.

అయితే ఈ ఏడాది చివర్లో భారత్‌లోనే జరిగే వరల్డ్‌ కప్‌ కోసం రిహార్సల్‌గా ఆసీస్‌ ఈ సిరీస్‌ను చూస్తుండగా... భారత్‌ కూడా మెగా టోర్నీకి తమ అత్యుత్తమ వన్డే జట్టును ఎంచుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో మూడు వన్డేల్లో ఫలితంకంటే వ్యక్తిగత ప్రదర్శనలే కీలకం.

ముంబై: టెస్టు సమరం తర్వాత భారత్, ఆ్రస్టేలియా వన్డేల్లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య నేడు వాంఖెడే మైదానంలో తొలి వన్డే జరుగుతుంది. ఈ ఫార్మాట్‌లో వరుస విజయాలతో టీమిండియా నిలకడ ప్రదర్శించగా...దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత కంగారూ బృందం వన్డే బరిలోకి దిగుతోంది.

బలాబలాల దృష్ట్యా ఇరు జట్ల సమంగా కనిపిస్తుండగా, అంతిమ విజేత ఎవరో చూడాలి. మరో వైపు వ్యక్తిగత కారణాలతో రోహిత్‌ శర్మ తొలి వన్డేకు దూరం కావడంతో హార్దిక్‌ పాండ్యా తొలి సారి వన్డే కెపె్టన్‌గా బాధ్యతలు చేపడుతున్నాడు. భారత్‌కు వన్డేల్లో కెపె్టన్‌గా వ్యవహరించిన 27వ ఆటగాడిగా పాండ్యా నిలుస్తాడు.  

పటిదార్‌కు అవకాశం! 
భారత జట్టు ఇటీవలి ఫామ్‌ చూస్తే తుది జట్టు  విషయంలో ఎలాంటి సమస్య లేదు. అద్భుతమైన ఆటతో గిల్‌ తన ఓపెనింగ్‌ స్థానాన్ని ఖరారు చేసుకోగా, రోహిత్‌ గైర్హాజరులో కిషన్‌కు మళ్లీ టీమ్‌లో చోటు ఖాయం. వీరిద్దరు శుభారంభం అందిస్తే జట్టు భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది.

గత ఏడు వన్డేల్లో 3 సెంచరీలు బాదిన కోహ్లి ఆట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన 75 సెంచరీల జాబితాలో మరిన్ని చేర్చుకునేందుకు ఇది అతనికి మరో అవకాశం. మిడిలార్డర్‌లో మెరుగైన రికార్డు ఉన్న రాహుల్‌ కూడా సత్తా చాటాల్సి ఉంది. అయితే నాలుగో స్థానంలో రెగ్యులర్‌గా ఆడే శ్రేయస్‌ గాయం కారణంగా దూరం కావడంతో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరం.

సూర్యకుమార్‌ ఈ స్థానం కోసం అసలైన పోటీదారే అయినా ఆడిన 20 వన్డేల్లో అతని పేలవ రికార్డు సందేహాలు రేకెత్తిస్తోంది. కొత్త ఆటగాడు రజత్‌ పటిదార్‌నుంచి అతనికి పోటీ ఎదురవుతోంది. ఆల్‌రౌండర్లుగా హార్దిక్, జడేజా తమ స్థాయి ఆటను ప్రదర్శిస్తే తిరుగుండదు. ఇద్దరు ప్రధాన పేసర్లుగా షమీ, సిరాజ్‌ ఉంటే బ్యాటింగ్‌ బలం కోసం శార్దుల్‌ను ఎంపిక చేయవచ్చు. ఏకైక స్పిన్నర్‌ స్థానంకోసం అక్షర్, సుందర్‌ మధ్య పోటీ ఉంది.  

మ్యాక్స్‌వెల్‌పై దృష్టి... 
కమిన్స్, హాజల్‌వుడ్‌తో పాటు జాయ్‌ రిచర్డ్సన్‌లాంటి పేసర్లు దూరమైనా ఆ్రస్టేలియా జ ట్టుకు ఎలాంటి ఇబ్బంది లేదు. కావాల్సినన్ని ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. వరు సగా ఆల్‌రౌండర్లలో జట్టు నిండి ఉంది. గాయం నుంచి కోలుకొని చాలా రోజుల తర్వాత మ్యాక్స్‌వెల్‌ బరిలోకి దిగుతుండటం జట్టు బలాన్ని పెంచింది.

ఫించ్‌ రిటైర్మెంట్‌ తర్వాత ఆడుతున్న తొలి సిరీస్‌లో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు హెడ్‌ ఉవ్వి ళ్ళూరుతున్నాడు. టెస్టుల్లో చెత్త ప్రదర్శన చూపిన వార్నర్‌ ఇక్కడైనా రాణించడం కీలకం. ఎప్పటిలాగే స్మిత్, లబుషేన్‌ బ్యాటింగ్‌ జట్టుకు కీలకం కానుంది. మిచెల్‌ మార్ష్ , స్టొయినిస్, సీన్‌ అబాట్, అస్టన్‌ అగర్‌...ఈ నలుగురు ఆల్‌రౌండర్లు తుది జట్టులోని రెండు స్థానాల కోసం పోటీ పడుతున్నారు.

ఎవరికి అవకాశం దక్కినా వారు టీమ్‌ విలువ పెంచగల సమర్థులు. ప్రధాన పేసర్‌గా స్టార్క్‌ ముందుండి నడిపించనుండగా యువ ఆటగాడు ఎలిస్‌కు కూడా అవకాశం ఖా యం. లెగ్‌స్పిన్నర్‌ జంపా భారత బ్యాట ర్లను ఇబ్బంది పెట్టడంలో ప్రధాన పాత్ర పోషించగలడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top