
Tim Southee Appointed As New Zealand Test Captain: న్యూజిలాండ్ టెస్ట్ కెప్టెన్సీకి కేన్ విలియమ్సన్ గుడ్‌బై చెప్పడంతో అతని స్థానంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (ఎన్‌జెడ్‌సీబీ) కొత్త సారధిని నియమించింది. విలియమ్సన్ స్థానంలో టిమ్ సౌథీ టెస్ట్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని ఎన్‌జెడ్‌సీబీ ప్రకటించింది. ఈ నెల 26 నుంచి పాకిస్తాన్‌తో ప్రారంభమయ్యే 2 టెస్ట్‌ల సిరీస్‌కు సౌథీ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని పేర్కొంది.
సౌథీకి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) వికెట్ కీపర్ టామ్ లాథమ్‌ను ఎంపిక చేసినట్లు ప్రకటించింది. ఓ స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ న్యూజిలాండ్ టెస్ట్ కెప్టెన్‌గా ఎంపిక కావడం ఇది రెండోసారి. గతంలో డియాన్ నాష్ కివీస్ టెస్ట్ సారధిగా వ్యవహరించాడు. మరోవైపు టెస్ట్ జట్టుకు సారధిగా ఎంపికైన సౌథీ.. 22 టీ20ల్లో కివీస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే అతను టెస్ట్ సారధ్య బాధ్యతలు చేపట్టడం ఇదే మొదటిసారి.
కాగా, వర్క్ లోడ్ కారణంగా టెస్ట్ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేసిన విలియమ్సన్.. వన్డే, టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా కొనసాగుతానని ప్రకటించాడు. అలాగే టెస్ట్ జట్టులో సభ్యుడిగానూ కొనసాగుతానని పేర్కొన్నాడు. పాకిస్తాన్ పర్యటనకు అతను జట్టుతో పాటే వెళ్లనున్నాడు. ఈ పర్యటనలో తొలుత టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్న న్యూజిలాండ్.. జనవరి 10, 12, 14 తేదీల్లో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతుంది.
ఇదిలా ఉంటే, 6 ఏళ్ల పాటు కివీస్ సారథ్య బాధ్యతలు మోసిన విలియమ్సన్.. అనూహ్యంగా టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదొలగడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. అతని హయాంలో కివీస్ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్‌తో పాటు మరెన్నో అద్భుత విజయాలు సాధించింది. 2016లో బ్రెండన్ మెకల్లమ్ తర్వాత కేన్ మామ న్యూజిలాండ్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. అతని సారథ్యంలో న్యూజిలాండ్ 38 టెస్టు మ్యాచ్‌లు ఆడి 22 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 8 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.