Tokyo Olympics: 13...13...16!

Three teenage girls pick up inaugural street skateboarding medals - Sakshi

 స్కేట్‌ బోర్డింగ్‌లో విజేతలంతా టీనేజర్లే   

టోక్యో: స్కేట్‌ బోర్డింగ్‌... ఒలింపిక్స్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన క్రీడ. స్కేట్‌బోర్డ్‌ను ఉపయోగించుకుంటూ జిమ్నాస్టిక్స్‌ తరహాలో పలు విన్యాసాలు ప్రదర్శించే వేదిక. కొన్నాళ్ల క్రితం వరకు వేల కోట్ల రూపాయల వ్యాపారంతో ముడిపడి కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌గానే గుర్తింపు పొందిన ఈ ఆట ఇప్పుడు క్రీడాంశంగా ఒలింపిక్స్‌ వరకు చేరింది. స్కేట్‌ బోర్డింగ్‌లో రెండు ఈవెంట్లు ఉంటాయి. ‘స్ట్రీట్‌’ విభాగంలో పోటీ జరిగే ‘కోర్స్‌’ కాస్త సాఫీగా, తక్కువ ప్రమాదకారిగా ఉంటుంది. అదే రెండో విభాగం ‘పార్క్‌’లో మాత్రం అంతా కఠినంగా సాగుతుంది.

3ప్లేయర్లు తమ సామర్థ్యాన్ని బట్టి భిన్నమైన విన్యాసాలు ప్రదర్శిస్తారు. వేగం, టైమింగ్, నిలకడతో ఎంత కష్టంతో కూడుకున్నదనేదానిపై ఆధారపడి జడ్జీలు పాయింట్లు ఇస్తారు. 18 ఏళ్ల లోపువారు హెల్మెట్‌ ధరించడం తప్పనిసరి. ఈ పోటీల ‘మహిళల’ విభాగం (స్ట్రీట్‌ ఈవెంట్‌)లో సోమవారం ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. స్వర్ణం సాధించిన నిషియా మొమిజి (జపాన్‌) వయసు 13 ఏళ్ల 330 రోజులుకాగా... రజతం గెలుచుకున్న రెసా లియన్‌ (బ్రెజిల్‌) వయసు 13 ఏళ్ల 203 రోజలు.

కాంస్యం సాధించిన ఫునా నకయామా (జపాన్‌) వయసు 16 ఏళ్ల 39 రోజులు! కొత్త తరం ప్రతినిధులుగా ఈ ముగ్గురు స్కేట్‌ బోర్డింగ్‌లో మరికొందరు అమ్మాయిలు అడుగుపెట్టేందుకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇంత కాలం దీనిని ఆటగా పరిగణించకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలు ఆడేందుకు అంగీకరించేవారు కాదని, ఇప్పుడు ఒలింపిక్స్‌లో ఈ ముగ్గురు టీనేజర్ల ప్రదర్శనతో పరిస్థితిలో మార్పు వస్తుందన్న అమెరికా సీనియర్‌ స్కేటర్‌ మారియా డురాన్‌...తాజా ఫలితం తర్వాత ఒక్కరోజులో 500 మంది కొత్తగా అడ్మిషన్‌ తీసుకున్నా ఆశ్చర్యపోనని వ్యాఖ్యానించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top