IPL: ఫైనల్‌ చేరినా ఐపీఎల్‌ ట్రోఫీ గెలవని మూడు జట్లు.. ఈసారైనా! | Sakshi
Sakshi News home page

IPL 2024: ఫైనల్‌ చేరినా ఐపీఎల్‌ ట్రోఫీ గెలవని మూడు జట్లు.. ఈసారైనా!

Published Wed, Mar 20 2024 2:19 AM

Three teams who reached the final but did not win the IPL trophy - Sakshi

ఫైనల్‌ చేరినా ఐపీఎల్‌ ట్రోఫీ గెలవని మూడు జట్లు

ఈ సారైనా బెంగళూరు, ఢిల్లీ, పంజాబ్‌ జట్ల కల నెరవేరేనా!  

మరో 2 రోజుల్లో ఐపీఎల్‌ 

ఐపీఎల్‌లో 16 సీజన్లు గడిచిపోయాయి... రెండు టీమ్‌లు చెన్నై సూపర్‌ కింగ్స్, ముంబై  ఇండియన్స్‌ ఐదేసిసార్లు విజేతగా నిలిచి తమ స్థాయిని ప్రదర్శిస్తే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రెండు టైటిల్స్‌తో సత్తా చాటింది. మరో నాలుగు టీమ్‌లు రాజస్తాన్‌ రాయల్స్, దక్కన్‌ చార్జర్స్,  సన్‌రైజర్స్‌ హైదరాబాద్, గుజరాత్‌ టైటాన్స్‌ ఒక్కో ట్రోఫీతో కొంత సంతప్తిని మూటగట్టుకున్నాయి.

కానీ అన్ని సీజన్లలో భాగంగా ఉండి ఒక్కసారి కూడా కప్‌ను ముద్దాడలేకపోయిన దురదష్టకర జట్లూ ఉన్నాయి. సీజన్‌లో తొలి మ్యాచ్‌ నుంచి చెలరేగి అంచనాలు పెంచి అభిమానుల్లో ఆశలు రేపిన తర్వాత చివరి మెట్టుపై చతికిలపడి ఈ టీమ్‌లు తీవ్ర నిరాశను పంచాయి.

మూడుసార్లు ఫైనల్‌ చేరి ఒక్కసారి కూడా గెలవలేకపోయిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ఈ అన్‌ లక్కీ బ్యాచ్‌లో అగ్రస్థానంలో ఉండగా... పంజాబ్‌ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఒక్కోసారి ఫైనల్‌ చేరి పరాజయం పక్షాన నిలిచాయి. కొత్త సీజన్‌లో మరోసారి తమ రాతను పరీక్షించుకునేందుకు సిద్ధమైన ఈ మూడు జట్లకు ఈ సారైనా కలిసి వస్తుందా... ట్రోఫీ చెంత చేరుతుందా అనేది ఆసక్తికరం.   –సాక్షి క్రీడా విభాగం  

‘బెంగ’ళూరు తీరుతుందా... 
తొలి ఐపీఎల్‌ సీజన్‌లో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచిన ఆర్‌సీబీ తర్వాతి సీజన్‌లో కోలుకొని ఫైనల్‌ చేరినా 6 పరుగుల స్వల్ప తేడాతో దక్కన్‌ చార్జర్స్‌ చేతిలో ఓడింది. అనంతరం 2011లోనూ తుది పోరుకు అర్హత సాధించినా... చెన్నై నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది.

ఇక కోహ్లి ఏకంగా 973 పరుగులు సాధించిన 2016 ఐపీఎల్‌లోనూ ఆఖరి సమరంలో సన్‌రైజర్స్‌ చేతిలో 8 పరుగులతో ఓటమి పాలైంది. 209 పరుగుల ఛేదనలో ఒక దశలో 114/0తో ఉండి కూడా టీమ్‌ ఓడింది. ఇక ఆ తర్వాత ఆర్‌సీబీ ఆ స్థాయి ప్రదర్శనను మళ్లీ చూపించలేదు. గత సీజన్‌లో 7 విజయాలు సాధించిన జట్టు ఆరో స్థానంతో ముగించింది. 

బలాబలాలు: తాజా వేలంలో ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ను ఆర్‌సీబీ రూ.17.50 కోట్లకు తీసుకుంది. అతని తాజా ఫామ్‌ను బట్టి చూస్తే అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో జట్టుకు కచ్చితంగా మంచి ప్రయోజనం కలగవచ్చు. ఓపెనర్లుగా డుప్లెసిస్, కోహ్లిలపై బ్యాటింగ్‌ భారం ఉండగా... మ్యాక్స్‌వెల్, గ్రీన్‌ చెలరేగిపోగలరు. గాయంతో గత సీజన్‌కు దూరమైన రజత్‌ పటిదార్‌ ఈసారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.

బౌలింగ్‌లో ఫెర్గూసన్, అల్జారీ జోసెఫ్‌లలో ఒకరికి అవకాశం దక్కుతుంది. అయితే వీరిద్దరికంటే సిరాజ్, ఇటీవలే టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆకాశ్‌దీప్‌లు రాణించడం కీలకం. రంజీల్లో రాణించిన వైశాక్‌ విజయ్‌ కూడా ఉన్నాడు. జట్టు స్పిన్‌ విభాగం బలహీనంగా ఉంది. కరణ్‌ శర్మలో మునుపటి పదును లేదు. జట్టులో ఇతర దేశవాళీ ఆటగాళ్లు ఎవరూ ఎక్కువ ప్రభావం చూపించగల సమర్థులు కాదు. ఓవరాల్‌గా చూస్తే బ్యాటింగ్‌ బలగంతోనే బెంగళూరు మ్యాచ్‌లు గెలవాల్సి ఉంది. 

జట్టు వివరాలు
ఆర్‌సీబీ: డుప్లెసిస్‌ (కెప్టెన్‌), విల్‌ జాక్స్, మ్యాక్స్‌వెల్, గ్రీన్, జోసెఫ్, టాప్లీ, టామ్‌ కరన్, ఫెర్గూసన్‌ (విదేశీ ఆటగాళ్లు); పటిదార్, కోహ్లి, రావత్, కార్తీక్, సుయశ్, సౌరవ్‌ చౌహాన్, లోమ్రో ర్, కరణ్‌ శర్మ, స్వప్నిల్, మయాంక్‌ డాగర్, మనోజ్, ఆకాశ్‌దీప్, సిరాజ్, యశ్‌ దయాళ్, హిమాన్షు, రాజన్, వైశాక్‌ (భారత ఆటగాళ్లు). 

పంజాబ్‌ ‘కింగ్స్‌’ అవుతుందా... 
2014లో ఒకే ఒక్కసారి ఫైనల్‌ చేరిన పంజాబ్‌ తుది పోరులో 199 పరుగులు చేసి కూడా మూడు బంతుల మిగిలి ఉండగానే కోల్‌కతాకు తలవంచింది. ఇతర జట్లతో పోలిస్తే చాలా కాలంగా పంజాబ్‌ ప్రదర్శన ఘోరంగా ఉంది. 2019–2022 వరకు వరుసగా నాలుగు సీజన్ల పాటు ఆరో స్థానంలో నిలిచిన జట్టు గత ఏడాది ఎనిమిదో స్థానంతో ముగించింది. అసలు 2014 తర్వాత ఇన్నేళ్లలో ఐదో స్థానంలో (2017)లో నిలవడమే ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన 

బలాబలాలు: ఎప్పటిలాగే అగ్రశ్రేణి భారత ఆటగాళ్లు లేకపోవడం జట్టు ప్రధాన బలహీనత. ఎప్పుడో భారత జట్టుకు దూరమైనా మరో ప్రత్యామ్నాయం లేక ఆటగాడిగా, కెప్టెన్‌గా కూడా శిఖర్‌ ధావన్‌కు అవకాశం దక్కుతోంది. అతను ఏమాత్రం సమర్థంగా జట్టును నడిపించగలడనేది సందేహమే. చూస్తే జట్టులో చాలా మంది ఆల్‌రౌండర్లు ఉన్నట్లు కనిపిస్తోంది కానీ వీరిలో ఎవరూ గతంలో తమ ఆల్‌రౌండ్‌ నైపుణ్యాన్ని ప్రదర్శించింది లేదు.

బ్యాటింగ్‌లో జితేశ్‌ శర్మ, బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్‌లపైనే భారం ఉంది. అర్ష్ దీప్‌తో పాటు కొత్తగా ఈ జట్టులోకి వచ్చిన హర్షల్‌ పటేల్‌పై బౌలింగ్‌ భారం ఉండగా, రబడ రాణించడం కీలకం.      వోక్స్, స్యామ్‌ కరన్‌ ఎంత ప్రభావం చూపిస్తారో చూడాలి.  

జట్టు వివరాలు
పంజాబ్‌: బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, రోసో, వోక్స్, స్యామ్‌ కరన్, రజా, రబడ, ఎలిస్‌ (విదేశీ ఆటగాళ్లు); శిఖర్‌ ధావన్‌ (కెప్టెన్‌), జితేశ్, ప్రభ్‌సిమ్రన్, హర్‌ప్రీత్, శశాంక్, విశ్వనాథ్, అశుతోష్, తనయ్‌ త్యాగరాజన్, అథర్వ, రిషి ధావన్, శివమ్‌ (భారత ఆటగాళ్లు). 

ఢిల్లీ... పంత్‌ ప్రతాపంపైనే...
సూపర్‌ ఫామ్‌తో అగ్రస్థానం సాధించి 2020లో ఫైనల్‌ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్‌ పేలవ బ్యాటింగ్‌తో ముంబై చేతిలో ఓడింది. 2023లోనైతే మరీ పేలవంగా ఆడి 9వ స్థానానికి పరిమితమైంది.  రిషభ్‌ పంత్‌ పునరాగమనమే ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ ఆసక్తి రేపుతోంది. అయితే తీవ్ర గాయం నుంచి కోలుకొని వస్తున్న అతను ఎలా ఆడతాడు, సారథిగా ఎలా నడిపిస్తాడనేది చర్చనీయాంశం.  

బలాబలాలు: ఢిల్లీ బ్యాటింగ్‌ బలంగా ఉండటం సానుకూలాంశం. వార్నర్, పథ్వీ షా, మిచెల్‌ మార్‌‡్ష టాప్‌–3లో ఆడతారు. దక్షిణాఫ్రికా బ్యాటర్‌ స్టబ్స్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగల సమర్థుడు. లోయర్‌ ఆర్డర్‌లో అక్షర్‌ పటేల్‌ ఆల్‌రౌండర్‌గా ప్రభావం చూపగలడు. కుల్దీప్‌ యాదవ్‌ వల్ల స్పిన్‌ బౌలింగ్‌లో కూడా పదును ఉంది.

అయితే పేస్‌ బలహీనంగా కనిపిస్తోంది. నోర్జే, రిచర్డ్సన్‌ గాయాలతో బాధపడుతుండగా... జట్టు ఆధారపడుతున్న ఖలీల్, ముకేశ్‌ల ప్రదర్శన టి20ల్లో అంతంత మాత్రమే. బ్యాటింగ్‌లో భారీ స్కోర్లు సాధిస్తేనే గెలుపుపై నమ్మకం ఉంచుకోవచ్చు. పంత్‌కు ఫిట్‌నెస్‌ సమస్యలు వస్తే దూకుడైన కీపర్‌ కుమార్‌ కుషాగ్ర ఆడతాడు.  

జట్టు వివరాలు
ఢిల్లీ: వార్నర్, హోప్, స్టబ్స్, మార్‌‡్ష, నోర్జే, జేక్‌ ఫ్రేజర్, రిచర్డ్సన్‌ (విదేశీ ఆటగాళ్లు); పంత్‌ (కెప్టెన్‌), పథ్వీ షా, యష్‌ ధుల్, స్వస్తిక్, పొరేల్, రికీ భుయ్, కుశాగ్ర, అక్షర్, లలిత్, సుమీత్, ప్రవీణ్‌ దూబే, విక్కీ, కుల్దీప్, ఖలీల్, ఇషాంత్, ముకేశ్, రసిక్‌ (భారత ఆటగాళ్లు)  

Advertisement
Advertisement