తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సీఎం కప్-2025 సెకండ్ ఎడిషన్’ పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 26 వరకు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో మొత్తం 44 విభాగాల్లో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. మొట్టమొదటిసారిగా నియోజకవర్గ స్థాయిలో పోటీలు జరగనుండడం విశేషం.
పోటీల షెడ్యూల్ ఇలా:
గ్రామపంచాయతీ స్థాయి: జనవరి 17 నుంచి 22 వరకు
మండల/మున్సిపాలిటీ స్థాయి: జనవరి 28 నుంచి 31 వరకు
అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి: ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు
జిల్లా స్థాయి: ఫిబ్రవరి 9 నుంచి 12 వరకు
రాష్ట్ర స్థాయి: ఫిబ్రవరి 20 నుంచి 23 వరకు
గ్రామ స్థాయిలో విజేతలను మండల స్థాయికి, అక్కడి నుంచి అసెంబ్లీ నియోజకవర్గం, జిల్లా, చివరకు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు.
గత ఏడాది గ్రాండ్ సక్సెస్
2024లో నిర్వహించిన సీఎం కప్ పోటీల్లో దాదాపు మూడు లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈసారి అసెంబ్లీ స్థాయి చేర్చడంతో పాల్గొనే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు లక్షల మంది క్రీడాకారులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు.
క్రీడాజ్యోతి ర్యాలీలతో అవగాహన యువతలో క్రీడలపై అవగాహన పెంచేందుకు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో క్రీడాజ్యోతి ర్యాలీలు నిర్వహించారు. యువ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పల్లె ప్రతిభను గుర్తించడమే లక్ష్యం గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే సీఎం కప్ లక్ష్యమని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.
2036 ఒలింపిక్స్‌లో తెలంగాణకు గర్వకారణంగా నిలిచే క్రీడాకారులను తయారు చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. గత ఏడాది సీఎం కప్ ఘన విజయాన్ని సాధించిందని, అదే స్ఫూర్తితో రెండో విడత నిర్వహిస్తున్నామని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు. గ్రామీణ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
క్రీడా సంఘాలు, పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు, క్రీడాభిమానుల సమన్వయంతో పోటీలు విజయవంతమవుతాయని రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి తెలిపారు.
ఆధునిక సాంకేతిక సహకారం
సీఎం కప్–2025కు ఏఐ కాల్ సెంటర్, వాట్సాప్ బాట్, వెబ్‌సైట్, ఏఐ చాట్‌బాట్ ద్వారా సమగ్ర సమాచారం అందించనున్నట్లు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఎండీ డా. సోనీ బాలాదేవి తెలిపారు. పాల్గొనే ప్రతి క్రీడాకారి వివరాలను కంప్యూటరీకరించి భద్రపరిచే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.


