
భారత అసిస్టెంట్ కోచ్ డస్కటే వ్యాఖ్య
నాలుగో టెస్టుకు టీమిండియా సన్నాహాలు
బెకెన్‌హామ్: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత టాప్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడతాడని టీమ్ మేనేజ్‌మెంట్ ఇప్పటికే ప్రకటించింది. పని భారాన్ని తగ్గించడంలో భాగంగా తొలి మూడు టెస్టుల్లో అతను రెండు మ్యాచ్‌లలో బరిలోకి దిగగా... మిగిలిన రెండు టెస్టుల్లో ఒక మ్యాచ్‌కు దూరం కావచ్చు. అయితే అతను ఏ టెస్టులో ఆడతాడనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. సిరీస్ సమం చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దీనిపై మ్యాచ్ సమయానికే తుది నిర్ణయం తీసుకుంటామని జట్టు అసిస్టెంట్ కోచ్ టెన్ డస్కటే వెల్లడించాడు.
‘బుమ్రా మరో మ్యాచ్‌కే అందుబాటులో ఉంటాడనే విషయం మాకు తెలుసు. మాంచెస్టర్‌లో సిరీస్ సమం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మాకు బుమ్రా కీలకం. కాబట్టి ఆడించే ఆలోచన అయితే ఉంది. అయితే ఇతర ఎన్నో అంశాలు ఇందులో ఉన్నాయి. మిగిలిన రెండు టెస్టులు, వాటిలో మా అవకాశాలను దృష్టిలో పెట్టుకుంటూ తుది జట్టు ఎంపిక చేయాలి. అందుకే ఇప్పుడే ఏమీ చెప్పలేం. మాంచెస్టర్‌లో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాం’ అని డస్కటే స్పష్టం చేశాడు.
మూడో టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సుదీర్ఘ స్పెల్‌లు బౌలింగ్ చేయడాన్ని బుమ్రా ఫిట్‌నెస్‌తో పోలుస్తూ వచ్చిన విమర్శలను డస్కటే కొట్టిపారేశాడు. అందరూ ఒకే తరహాలో బౌలింగ్ చేయరని, మరో బౌలర్‌తో పోల్చుకోవాల్సిన అవసరం లేదన్న డస్కటే... చిన్న చిన్న స్పెల్‌లలో బౌలింగ్ చేయడం బుమ్రా శైలి అని గుర్తు చేశాడు. మరో పేసర్ సిరాజ్ నిర్విరామంగా బౌలింగ్ చేసిన విషయాన్ని మర్చిపోవద్దని కూడా అతను అన్నాడు.
గురువారం భారత జట్టు ప్రాక్టీస్‌లో పాల్గొనగా వికెట్ కీపర్ రిషభ్ పంత్ దీనికి దూరంగా ఉన్నాడు. అయితే పంత్ కోలుకునేందుకు తగినంత విశ్రాంతి ఇస్తున్నామని, తర్వాతి టెస్టులోనూ అతను బ్యాటింగ్ చేస్తాడని కూడా భారత అసిస్టెంట్ కోచ్ స్పష్టం చేశాడు.
ప్రాక్టీస్‌లో ఆటగాళ్లు...
లార్డ్స్ టెస్టులో ఓటమి నుంచి కోలుకున్న భారత జట్టు తర్వాతి టెస్టుపై దృష్టి పెట్టింది. మాంచెస్టర్ టెస్టుకు ముందు అందుబాటులో ఉన్న ఏకైక ప్రాక్టీస్ సెషన్‌లో టీమిండియా ఆటగాళ్లు శ్రమించారు. ఇంకా మాంచెస్టర్‌కు వెళ్లని మన జట్టు లండన్ శివార్లలో బెకెన్‌హామ్‌లో ఉన్న కెంట్ కౌంటీ క్రికెట్ గ్రౌండ్‌లో గురువారం సాధన చేసింది. కేఎల్ రాహుల్ మినహా ఇతర బ్యాటర్లంతా ఇందులో పాల్గొన్నారు. గాయం నుంచి కోలుకుంటున్న రిషభ్ పంత్‌తో పాటు పేసర్లు బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్ కూడా ప్రాక్టీస్ చేయలేదు. వీరంతా స్వల్పంగా వామప్ చేసి ఆపై జిమ్‌కే పరిమితమయ్యారు.
మరోవైపు సుదర్శన్ ఆడిన షాట్‌ను ఆపే క్రమంలో పేసర్ అర్ష్ దీప్ సింగ్ చేతికి బలంగా దెబ్బ తగిలింది. స్వల్ప చికిత్స అనంతరం బ్యాండేజీతో అతను మైదానం వీడాడు. బుమ్రా ఆడకపోతే అతని స్థానంలో అర్ష్ దీప్ తో అరంగేట్రం చేయించాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్న స్థితిలో ఈ గాయం తీవ్రత ఎలాంటిదో చూడాలి. అర్ష్ దీప్ వెనుదిరిగాక టీమ్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్వయంగా బౌలింగ్‌కు దిగి భారత బ్యాటర్లకు సహకరించాడు. లార్డ్స్‌లో పరాజయాన్ని మరచి మళ్లీ ఆత్మవిశ్వాసంతో కనిపించిన జట్టు ఉత్సాహంగా, సరదాగా సాధనలో పాల్గొనడం విశేషం.