
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు జూలై 23 నుంచి ప్రారంభం కానుంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో అమీతుమీ తెల్చుకోవడానికి ఇరు జట్లు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భారత్ భావిస్తుంటే.. ఇంగ్లండ్ మాత్రం లార్డ్స్ ఫలితాన్ని పునరావృతం చేయాలని ఉవ్విళ్లూరుతోంది.
ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా మెనెజ్‌మెంట్‌కు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కీలక సూచన చేశాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్ ఫ్లాట్‌గా ఉంటుందని, భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడితే సరిపోతుందని అథర్టన్ అన్నారు. కాగా లార్డ్స్ టెస్టులో భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడింది. నితీశ్ కుమార్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు. ఒకవేళ మాంచెస్టర్‌లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడాలని భావిస్తే.. పేసర్ ఆకాష్‌దీప్‌పై వేటు పడే ఛాన్స్ ఉంది.
"మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్ పిచ్ ఫ్లాట్‌గా ఉండే ఛాన్స్ ఉంది. దీంతో ఇటువంటి పరిస్థితుల్లో మణికట్టు స్పిన్నర్లు చక్రం తిప్పుతారు అని అందరికి తెలుసు. కాబట్టి భారత్ బుమ్రా, సిరాజ్‌లతో పాటు ముగ్గురు స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, జడేజా,కుల్దీప్ యాదవ్‌లతో ఆడితే బాగుంటుంది.
ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. అయితే మాంచెస్టర్‌లో వాతావరణ పరిస్థితులపై మనకు అంచనా లేదు. ఒకవేళ వాతావరణం చల్లగా ఉండి, వర్షం పడితే ఫాస్ట్ బౌలర్లకు పిచ్ అనుకూలిస్తోంది. కానీ ముగ్గురు స్పిన్నర్లతో ఆడడం కోసం భారత మెనెజ్‌మెంట్ కచ్చితంగా ఆలోచించాలి" అని స్కై స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మైఖేల్ అథర్టన్ పేర్కొన్నాడు.
చదవండి: ENG vs IND: క్రికెట్ ప్లేయర్లు లంచ్ బ్రేక్‌లో ఏమి తింటారో తెలుసా?