కరోనా పరీక్షలు.. బీసీసీఐకి పెద్ద ఊరట

Team India Players And Staff Tested Coronavirus Negative - Sakshi

మెల్‌బోర్న్‌: సిడ్నీ వేదికగా జరగబోయే మూడో టెస్టుకు ముందు బీసీసీఐకి పెద్ద ఊరట లభించింది. భారత క్రికెటర్లు, సిబ్బందికి ఆదివారం ఆర్టీ-పీసీఆర్‌ పద్ధతిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. అందరికీ నెగటివ్‌గా తేలిందని బీసీసీఐ ఒక ప్రకటలో తెలిపింది. పరీక్షలు చేయించుకున్నవారిలో ఐసోలేషన్‌లో ఉన్న రోహిత్‌ శర్మ, పృథ్వీ షా, రిషభ్‌ పంత్‌, శుభ్‌మన్‌ గిల్‌, నవదీప్‌ సైనీ ఉన్నారని వెల్లడించింది. కాగా, పింక్‌బాల్‌ టెస్టులో విజయం అనంతరం ఈ ఐదుగురు కొత్త సంవత్సరం రోజున బయటకు వెళ్లి అల్పాహారం చేసిన సంగతి తెలిసిందే. అయితే, వారిపై అభిమానంతో నవల్‌దీప్‌ సింగ్‌ అనే వ్యక్తి చాటుగా బిల్లు చెల్లిచడం, ఆ విషయాన్ని ట్విటర్‌లో పేర్కొనడంతో వైరల్‌గా మారింది. 
(చదవండి: రోహిత్‌ బీఫ్‌ ఆర్డర్‌ చేశాడా.. హిట్‌మ్యాన్‌పై ట్రోలింగ్‌!)

దాంతోపాటు తను బిల్లు కట్టిన విషయం తెలుసుకుని రోహిత్‌ శర్మ తనను వారించినట్లు, రిషభ్‌ పంత్‌ తనను ఆలింగనం చేసుకున్నట్లు, ఆ తర్వాత క్రికెటర్లతో కలిసి ఫొటో తీసుకున్నానని నవల్‌దీప్‌ ట్విట్టర్‌ వేదికగా పంచుకోవడంతో ఈ సంగతి క్రికెట్‌ ఆస్ట్రేలియా దృష్టికి వచ్చింది.  బయో బబుల్‌ దాటి వచ్చారనే ఆరోపణలతో తాజాగా సీఏ ఈ ఐదుగురిని ఐసోలేషన్‌లో ఉంచింది. ఆటగాళ్లు బయో బబుల్‌ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారా లేదా అని తెలుసుకునేందుకు బీసీసీఐ, సీఏ సంయుక్తంగా దర్యాప్తు చేపడుతున్నాయి. దీంతో వీరు ప్రయాణాల్లో, ప్రాక్టీస్‌ సమయాల్లో... మిగతా భారత జట్టుతో పాటు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. 7 నుంచి జరుగనున్న మూడో టెస్టు కోసం ఇరు జట్లు 2 రోజుల ముందుగా సిడ్నీకి బయల్దేరుతాయి.
(చదవండి: మళ్లీ ఆంక్షలా... మా వల్ల కాదు!)

మూడో టెస్టుకు పాటిన్సన్‌ దూరం
భారత్‌తో జరగనున్న మూడో టెస్టుకు ఆస్ట్రేలియా ఫాస్ట్‌‌ బౌలర్‌ జేమ్స్‌ పాటిన్సన్‌ దూరమయ్యాడు. పక్కటెముకల గాయం కారణంగా పాటిన్సన్‌ మూడో టెస్టుకు అందుబాటులో ఉండడం లేదని క్రికెట​ ఆస్ట్రేలియా ట్విటర్‌లో తెలిపింది. అతని స్థానంలో మరొక ఆటగాడిని రీప్లేస్‌ చేయడం లేదని, నాలుగో టెస్టుకు పాటిన్సన్‌ అందుబాటులో ఉంటాడని పేర్కొంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top