హైదరాబాద్‌లో టీమిండియా రెండు మ్యాచ్‌లు | Team India to play two matches in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో టీమిండియా రెండు మ్యాచ్‌లు

Mar 27 2026 3:07 AM | Updated on Mar 27 2026 3:07 AM

Team India to play two matches in Hyderabad

స్వదేశంలో భారత క్రికెట్‌ జట్టు 2026–2027 సీజన్‌ షెడ్యూల్‌ విడుదల

భారత్‌లో పర్యటించనున్న వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా

1979 తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో టీమిండియా ఐదు టెస్టుల సిరీస్‌  

న్యూఢిల్లీ: భారత పురుషుల క్రికెట్‌ జట్టు 2026–2027 సీజన్‌లో హైదరాబాద్‌ వేదికగా రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ ఏడాది అక్టోబర్‌ 14న ఉప్పల్‌ రాజీవ్‌గాంధీ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో భారత్‌ టి20 మ్యాచ్‌ ఆడనుండగా ... వచ్చే ఏడాది జనవరి 6న జింబాబ్వేతో వన్డే మ్యాచ్‌ జరగనుంది. ఈ మేరకు 2026–27 సీజన్‌లో స్వదేశంలో టీమిండియా ఆడనున్న సిరీస్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం విడుదల చేసింది. మొత్తం 17 వేదికల్లో 22 మ్యాచ్‌లు జరగనున్నాయి. 

ఇందులో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల ‘బోర్డర్‌–గావస్కర్‌’ టెస్టు సిరీస్‌ సైతం ఉంది. 1979లో చివరిసారిగా భారత్, ఆ్రస్టేలియా మధ్య భారత్‌లో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ జరగగా... మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఇరు జట్లు మన దేశంలో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనున్నాయి. ఇక గతేడాది చివర్లో దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చిన గువాహటి మైదానానికి... ఈ సిరీస్‌లో మరో టెస్టు మ్యాచ్‌ దక్కడం చర్చనీయాంశంగా మారింది. భారత్‌–ఆ్రస్టేలియా మధ్య వచ్చే ఏడాది జనవరి 21 నుంచి ప్రతిష్టాత్మక ‘బోర్డర్‌ –గావస్కర్‌’ టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది. 

తొలి మ్యాచ్‌కు నాగ్‌పూర్‌ ఆతిథ్యమిస్తుండగా... ఆ తర్వాత వరుసగా చెన్నై (జనవరి 29–ఫిబ్రవరి 2), గువాహటి (ఫిబ్రవరి 11–15), రాంచీ (ఫిబ్రవరి 19–23), అహ్మదాబాద్‌ (ఫిబ్రవరి 27–మార్చి 3)లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ జాబితాలో ముంబై, కోల్‌కతా లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఈ సీజన్‌లో స్వదేశంలో ఆడనున్న 22 మ్యాచ్‌ల్లో 5 టెస్టులు కాగా... 9 వన్డేలు, 8 టి20లు ఉన్నాయి. 

టెస్టు, టి20 ఫార్మాట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ... ఈ సీజన్‌లో స్వదేశంలో తొమ్మిది వన్డేల్లో అభిమానులను అలరించనున్నారు. వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వేతో టీమిండియా వన్డే సిరీస్‌లు ఆడనుంది. జింబాబ్వే జట్టు చివరిసారిగా 2002లో భారత్‌లో పర్యటించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement