T20 World Cup 2021: టాస్‌ గెలిస్తేనే విజయం.. శ్రీలంక లాంటి జట్లకు నష్టం: జయవర్ధనే

T20 World Cup 2021 Jayawardene: Lot Of Pressure On Captains To Win Toss in Dubai - Sakshi

Mahela Jayawardene Comments On Sri Lanka Defeat: టీ20 ప్రపంచకప్‌-2021 టోర్నీలో జట్ల జయాజయాలపై మంచు ప్రభావం స్పష్టంగా కనబడుతోందని శ్రీలంక మాజీ కెప్టెన్‌ మహేళ జయవర్దనే అన్నాడు. అదే విధంగా టాస్‌... గెలుపును నిర్దేశించే కీలక అంశంగా పరిణమించిందని వ్యాఖ్యానించాడు. స్పిన్నర్లపై ఎక్కువగా ఆధారపడే శ్రీలంక వంటి జట్లకు ఇది నష్టం చేకూరుస్తుందని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా బౌలర్‌ ఆడం జంపా మెరుగ్గా రాణించిన చోట‌... శ్రీలంక బౌలర్లు అతడి స్థాయిలో ప్రభావం చూపకపోవడానికి మంచు కారణమని జయవర్దనే పేర్కొన్నాడు.

కాగా ఆస్ట్రేలియాతో దుబాయ్‌ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 7 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జయవర్ధనే ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ... ‘‘శ్రీలంక స్పిన్నర్లు ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టడానికి ఎంతగానో ప్రయత్నించారు. కానీ బంతి జారిపోవడం మొదలుపెట్టింది. గ్రిప్‌ అంతగా దొరకలేదు. ఆడం జంపా ప్రభావం చూపగలిగిన పిచ్‌పై.. అందుకే వాళ్లు మెరుగ్గా రాణించలేకపోయారు’’ అని జయవర్దనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.

అదే విధంగా... ‘‘దుబాయ్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో టాస్‌ గెలిచిన కెప్టెన్లనే విజయాలు వరించాయి. రెండో దఫా బౌలింగ్‌ చేసే జట్లకు.. ముఖ్యంగా స్పిన్నర్లకు పిచ్‌ ఏమాత్రం సహకరించడం లేదు. టీ20 వరల్డ్‌కప్‌ వంటి ప్రధాన టోర్నీల్లో ఇలా జరగడం.. కెప్టెన్లను తప్పక టాస్‌ గెలవాల్సిన పరిస్థితుల్లోకి నెడుతోంది’’  అని జయవర్ధనే చెప్పుకొచ్చాడు. ఇక గురువారం నాటి మ్యాచ్‌లో పవర్‌ప్లేలో వనిందు హసరంగ ఆకట్టుకున్నాడని ప్రశంసించాడు.

ఆ‍స్ట్రేలియా వర్సెస్‌ శ్రీలంక.. స్కోర్లు
శ్రీలంక- 154/6 (20)
ఆస్ట్రేలియా-155/3 (17)

చదవండి: T20 World Cup 2021: స్వదేశానికి తిరిగి వచ్చేసిన టీమిండియా నెట్‌ బౌలర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top