Ind Vs WA XI: రాహుల్‌ ఇన్నింగ్స్‌ వృథా.. కుప్పకూలిన మిడిలార్డర్‌.. టీమిండియాకు తప్పని ఓటమి

T20 WC Ind Vs WA XI 2nd Practice Match: India Lose Match By 36 Runs - Sakshi

T20 World Cup 2022- Ind Vs WA XI: వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరిగిన రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలైంది. టీ20 వరల్డ్‌కప్‌-2022 సన్నాహకాల్లో భాగంగా పెర్త్‌ వేదికగా గురువారం (అక్టోబరు 13) జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఆతిథ్య జట్టు బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు చేతులెత్తేశారు.

ఇక ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్‌ రాహుల్‌ అర్ధ శతకం వృథాగా పోయింది. కాగా తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. టీమిండియా స్పిన్నర్‌ అశ్విన్‌ మూడు(3/32), పేసర్లు హర్షల్‌ పటేల్‌ రెండు(2/27), అర్ష్‌దీప్‌ ఒక వికెట్‌ (1/25) దక్కించుకున్నారు. 

రాహుల్‌కు జోడీగా పంత్‌..  ఓపెనర్‌గా విఫలం
ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌లను కట్టడి చేయడంలో సఫలమయ్యారు ప్రత్యర్థి జట్టు బౌలర్లు. దీంతో పవర్‌ ప్లే ముగిసే సరికి భారత్‌ ఒక వికెట్‌ నష్టపోయి 29 పరుగులు మాత్రమే చేసింది. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన దీపక్‌ హుడాతో కలిసి రాహుల్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.

కుప్పకూలిన మిడిలార్డర్‌
కానీ వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా బౌలర్‌ లాన్స్‌ మోరిస్‌ తన తొలి ఓవర్‌లోనే దీపక్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో 7 ఓవర్లలో కేవలం 33 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది టీమిండియా.

ఈ దశలో ఆచితూచి ఆడుతూ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. కానీ పాండ్యా కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. 17 పరుగులకే నిష్క్రమించాడు. దీంతో భారం మొత్తం రాహుల్‌పైనే పడింది. 

పాండ్యా తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్‌ పటేల్‌, దినేశ్‌ కార్తిక్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 55 బంతుల్లో 74 పరుగులతో ఉన్న రాహుల్‌ను ఆండ్రూ టై అవుట్‌ చేయడంతో 132 పరుగుల వద్ద టీమిండియా కథ ముగిసింది. బ్యాటింగ్‌ వైఫల్యం కారణంగా వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ఎలెవన్‌ చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. కాగా మొదటి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో రోహిత్‌ సేన 13 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఇండియా వర్సెస్‌ వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ఎలెవన్‌ రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌:
వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా స్కోరు:168/8
ఇండియా స్కోరు: 132/8

కుప్పకూలిన టీమిండియా మిడిలార్డర్‌
కేఎల్‌ రాహుల్‌- 74
రిషభ్‌ పంత్‌- 9
దీపక్‌ హుడా- 6
హార్దిక్‌ పాండ్యా- 17
అక్షర్‌ పటేల్‌- 2
దినేశ్‌ కార్తిక్‌- 10
ఈ మ్యాచ్‌లో భాగంగా తుదిజట్టులో ఉన్న రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌కు రాలేదు.

చదవండి: T20 WC- Semi Finalists Prediction: సెమీస్‌ చేరేది ఆ నాలుగు జట్లే: పాకిస్తాన్‌ దిగ్గజ బౌలర్‌
BCCI Next Boss Roger Binny: అధ్యక్షుడిగా రోజర్‌ బిన్నీనే ఎందుకు?.. ఆసక్తికర విషయాలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top