Pak Vs Ban: బంగ్లాదేశ్‌ ఇంటికి.. సెమీస్‌లో టీమిండియా, పాకిస్తాన్‌

T20 WC 2022 Pak Vs Ban: Pakistan Beat Bangladesh Enters Semis - Sakshi

ICC Mens T20 World Cup 2022 - Pakistan vs Bangladesh: అనూహ్య పరిస్థితుల నడుమ పాకిస్తాన్‌ వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ సెమీ ఫైనల్‌కు చేరుకుంది. వరల్డ్‌కప్‌-2022 సూపర్‌-12లో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించింది. బంగ్లాపై 5 వికెట్ల తేడాతో గెలుపొంది.. చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో పాటు గ్రూప్‌-2 నుంచి సెమీస్‌కు అర్హత సాధించింది. 

ఒక్కడు మాత్రమే
సెమీస్‌ రేసులో భాగంగా అడిలైడ్‌ వేదికగా ఆదివారం పాకిస్తాన్‌- బంగ్లాదేశ్‌ తలపడ్డాయి. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కు ఓపెనర్‌ షాంటో శుభారంభం అందించాడు. 48 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 54 పరుగులు చేయగలిగాడు.

కానీ మరో ఓపెనర్‌, భారత్‌తో మ్యాచ్‌లో అదరగొట్టిన లిటన్‌ దాస్‌ 10 పరుగులకే పరిమితమయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సౌమ్య సర్కార్‌ 20 పరుగులు చేయగా.. కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ వివాదస్పద రీతిలో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మిగతా బ్యాటర్లలో అఫిఫ్‌ హొసేన్‌ 24 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 127 పరుగులు మాత్రమే చేయగలిగింది బంగ్లాదేశ్‌.

తప్పని ఓటమి
పాక్‌ పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది 4 ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు కూల్చి బంగ్లాదేశ్‌ పతనాన్ని శాసించాడు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు ఓపెనర్లు మహ్మద్‌ రిజ్వాన్‌ 32, బాబర్‌ ఆజం 25 పరుగులతో శుభారంభం అందించారు.

మహ్మద్‌ హారిస్‌ 31 పరుగులు చేయగా.. షాన్‌ మసూద్‌ 24 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ ధారాళంగా పరుగులు(35) సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ విజయం సాధించి సెమీస్‌ చేరుకుంది. షాహిన్‌ ఆఫ్రిదికి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

కాగా నెదర్లాండ్స్‌ చేతిలో ఘోర ఓటమి నేపథ్యంలో సౌతాఫ్రికా ఇంటిబాట పట్టగా చిరకాల ప్రత్యర్థులు భారత్‌- పాక్‌ టోర్నీలో ముందడుగు వేశాయి.

మ్యాచ్‌ స్కోర్లు:
టాస్‌: బంగ్లాదేశ్‌
బంగ్లాదేశ్‌: 127/8 (20)
పాకిస్తాన్‌: 128/5 (18.1)
చదవండి: WC 2022: పాపం.. సౌతాఫ్రికా టోర్నీ నుంచి అవుట్! ఇందుకు కారణం ఆ రెండే! ముఖ్యంగా యూఏఈ!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top