Ind Vs SA: భారత్‌, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లకు వర్షం ముప్పు.. ఇదే జరిగితే సఫారీల ఖేల్‌ ఖతం..!

T20 WC 2022: October 27 Matches - Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022 సూపర్‌-12 గ్రూప్‌-2లో భాగంగా రేపు (అక్టోబర్‌ 27) కీలక మ్యాచ్‌లు జరుగనున్నాయి. సిడ్నీ వేదికగా తొలుత (భారతకాలమానం ప్రకారం ఉదయం 8:30 గంటలకు) సౌతాఫ్రికా-బంగ్లాదేశ్‌ జట్లు, ఆతర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు భారత్‌-నెదర్లాండ్స్‌ జట్లు తలపడనున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి జరిగే ఈ రెండు మ్యాచ్‌లకు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలు అధికంగా ఉన్నాయని సిడ్నీ వాతావరణ శాఖ అలర్ట్‌ జారీ చేసింది.

ముఖ్యంగా ఉదయం మ్యాచ్‌ సమయానికి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో దక్షిణాఫ్రికా జట్టులో కలవరం మొదలైంది. నోటి కాడికి వచ్చిన మ్యాచ్‌ (జింబాబ్వే) చేజారిన బాధలో ఉన్న సఫారీలకు ఈ విషయం అస్సలు మింగుడుపడటం లేదు. ఒకవేళ వర్షం కారణంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ రద్దైతే దక్షిణాఫ్రికా సెమీస్‌ అవకాశాలు దాదాపు గల్లంతయినట్టేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇక తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై గెలుపుతో పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉన్న బంగ్లా జట్టు.. మ్యాచ్‌ సాధ్యాసాధ్యాలపై బెంగ లేకుండా హాయిగా ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దైనా ఆ జట్టు ఖాతాలో మరో పాయింట్‌ చేరి సెమీస్‌ రేసులో ఓ అడుగు ముందుంటుంది.

మరోవైపు భారత్‌-నెదర్లాండ్స్‌ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉం‍దని వెదర్‌ ఫోర్‌కాస్ట్‌లో తెలుస్తోంది. అయితే మ్యాచ్‌ సమయానికి వరుణుడు శాంతించవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మ్యాచ్‌ పూర్తిగా రద్దయే ప్రమాదం లేకపోయినప్పటికీ.. మధ్యమధ్యలో వరుణుడి ఆటంకం తప్పదని భావిస్తున్నారు. భారత అభిమానులు మాత్రం ఈ మ్యాచ్‌ ఎట్టి పరిస్థితుల్లో రద్దు కాకూడదని దేవుళ్లను ప్రార్ధిస్తున్నారు.

వరుణుడి ముప్పు తప్పి మ్యాచ్‌ జరగాలని, ఇందులో భారత్‌ ఘన విజయం సాధించి సెమీస్‌ రేసులో ముందుండాలని వారు కోరుకుంటున్నారు. మరోపక్క సూపర్‌-12 తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో ఓడిన నెదర్లాండ్స్‌కు కూడా ఈ మ్యాచ్‌ అత్యంత కీలకం కానుంది. తమ పూర్తి శక్తిసామర్ధ్యాలు ప్రదర్శించి టీమిండియాకు షాకివ్వాలని డచ్‌ టీమ్‌ యోచిస్తుంది. 

ఈ రెండు మ్యాచ్‌లే కాక రేపు గ్రూప్‌-2లో మరో మ్యాచ్‌ జరుగనుంది. పెర్త్‌ వేదికగా పాకిస్తాన్‌-జింబాబ్వే జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా చేతిలో భంగపడ్డ పాక్‌.. బోణీ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతుండగా, సౌతాఫ్రికాతో మ్యాచ్‌ను వరుణుడి పుణ్యమా కాపాడుకున్న జింబాబ్వే సంచలనం సృష్టించలేమా అన్న ఆశతో బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌కు వరుణుడి నుంచి ఎలాంటి ముప్పు లేదని తెలుస్తోంది. పెర్త్‌లో మ్యాచ్‌ సమయానికి 11 నుంచి 22 డిగ్రీస్‌ సెల్సీయస్‌ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.    
చదవండి: ఎవ్వరికీ రెస్ట్‌ ఇచ్చేది లేదు.. హార్ధిక్‌ సహా అందరూ ఆడతారు..!

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top