చెన్నై ఓటమి వెనుక తప్పులెన్నో! | Story-CSK Many Reasons Behind Match Lost Vs Rajasthan IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: చెన్నై ఓటమి వెనుక తప్పులెన్నో!

Mar 31 2026 12:28 PM | Updated on Mar 31 2026 1:15 PM

Story-CSK Many Reasons Behind Match Lost Vs Rajasthan IPL 2026

Photo Courtesy: IPL 2026

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో చెన్నై సూప‌ర్‌కింగ్స్ అత్యంత విజ‌య‌వంత‌మైన జ‌ట్ల‌లో ఒక‌టి. ఐపీఎల్‌లో ఐదు టైటిల్స్ కొట్టిన సీఎస్‌కే ప్ర‌స్తుతం ముంబై ఇండియ‌న్స్‌తో క‌లిసి సంయుక్తంగా అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది. అయితే ఐపీఎల్ 19వ సీజ‌న్‌లో సోమవారం రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పేల‌వ ఆట‌తీరుతో చెన్నై సూప‌ర్‌కింగ్స్ దారుణ ఓట‌మిని ఎదుర్కొంది. 

సౌతాఫ్రికా స్టార్ బ్యాట‌ర్ డెవాల్డ్ బ్రెవిస్ లేక‌పోవ‌డం, అన్నింటికీ మించి ఎంఎస్ ధోని గాయంతో జ‌ట్టుకు దూర‌మ‌వ్వ‌డం సీఎస్‌కేను ఒత్తిడిలోకి నెట్టేసిన‌ట్ల‌యింది. సంజూ శాంస‌న్‌, రుతురాజ్ గైక్వాడ్‌, శివ‌మ్ దూబే వంటి స్టార్ ఆట‌గాళ్లు ఉన్న‌ప్ప‌టికీ అనుభ‌వ‌లేమి స్ప‌ష్టంగా క‌నిపించింది. అయితే ఒక్క మ్యాచ్‌లో ఓట‌మితోనే సీఎస్‌కేను త‌ప్పు బ‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. 

కూర్పు గందరగోళం..
కానీ మ్యాచ్ ఫ‌లితం క్ష‌ణాల్లో మారిపోయే ఐపీఎల్‌లో ఫ‌స్ట్ హాఫ్ సీజ‌న్‌లో వీలైన‌న్ని ఎక్కువ మ్యాచ్‌లు గెల‌వ‌డమే అన్ని జ‌ట్లు టార్గెట్‌గా పెట్టుకుంటాయి. దీంతో సీజ‌న్ తొలి మ్యాచ్ నుంచే అన్ని జ‌ట్లు గెల‌వాల‌నే సంక‌ల్పంతోనే ఆడుతుంటాయి. వాస్త‌వానికి సీఎస్‌కే జ‌ట్టు కూర్పు కొంత గంద‌ర‌గోళంగానే క‌నిపిస్తుంది. డెవాల్డ్ బ్రెవిస్ గాయంతో మ్యాచ్‌కు దూర‌మ‌వ్వ‌డంతో స‌ర్ఫ‌రాజ్‌ఖాన్‌ను ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కాకుండా ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దింపితే వేరుగా ఉండేది. 

స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో స‌ర్ఫ‌రాజ్ ముంబై త‌ర‌ఫున మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఒకవేళ సీఎస్‌కే స‌ర్ఫ‌రాజ్ సేవ‌ల్ని ఉప‌యోగించుకోవాల‌నుకుంటే బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో ప్ర‌మోష‌న్ ఇచ్చి ఓపెనింగ్ లేదా మూడో స్థానంలో ఆడిస్తే బాగుండేది.

మిడిలార్డర్‌ ఫెయిల్‌
సాధార‌ణంగా మ్యాచ్‌లో టాపార్డ‌ర్ విఫ‌ల‌మైన‌ప్పుడు మిడిలార్డ‌ర్ ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దే బాధ్య‌తను తీసుకోవాల్సి ఉంటుంది.కానీ కెప్టెన్ రుతురాజ్ 11 బంతుల్లో ఆరు ప‌రుగుల‌కే ప‌రిమితం కావ‌డం, అండ‌ర్‌-19 టీమిండియా కెప్టెన్ ఆయుష్ మాత్రే డ‌కౌట్ కావడం, మాథ్య షార్ట్ కూడా 2 ప‌రుగుల‌కే పెవిలియ‌న్ చేర‌డం సీఎస్‌కేను మ‌రింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది. జట్టులో రుతురాజ్‌, సంజూ శాంస‌న్‌, దూబే మిన‌హా మిగ‌తావారంతా జూనియ‌ర్లే. 

దూబే విఫలం..
ఈ నేప‌థ్యంలో బాధ్య‌త‌గా ఆడాల్సిన సీనియ‌ర్లు నిర్లక్ష్య ఆట‌తీరుతో వికెట్లు పారేసుకోవ‌డం కూడా సీఎస్‌కే  కొంప‌ముంచింది. ఇటీవ‌లే ముగిసిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో శివ‌మ్ దూబే ఫినిష‌ర్‌గా అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. అదే సీన్‌ను ఇప్పుడు ఐపీఎల్‌లో సీఎస్‌కే త‌ర‌ఫున పున‌రావృతం చేస్తాడ‌ని భావించిన అభిమానుల‌కు నిరాశే ఎదురైంది. 

వ‌చ్చీ రాగానే సిక్స్ కొట్టి దూకుడు ప్ర‌ద‌ర్శించిన‌ప్ప‌టికీ.. అప్పుడున్న ప‌రిస్థితుల్లో సిక్స‌ర్లు బాద‌డం కంటే ఇన్నింగ్స్ నిర్మించ‌డంపై దూబే దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. ఎందుకంటే దూబే త‌ర్వాత బ్యాట‌ర్లు పెద్ద‌గా లేరు. అయితే సీఎస్‌కే త‌ర‌ఫున టాప్ స్కోర‌ర్‌గా నిలిచిన జేమీ ఓవ‌ర్ట‌న్‌కు దూబే నుంచి స‌హ‌కారం అంది ఉంటే ప‌రిస్థితి వేరుగా ఉండేది.

 దూబే బాధ్య‌తాయుతంగా బ్యాటింగ్ చేసి ఉంటే క‌నీసం 170 ప‌రుగులైనా చేసి ఉండేది. ధోని గైర్హాజ‌రీలో దూబే నిల‌బ‌డి సాధికారికంగా బ్యాటింగ్ చేసి ఉంటే అత‌డి విలువ అమాంతం పెరిగిపోయేది. ఇక సీఎస్‌కే లో స్కోరింగ్ మ్యాచ్‌ల‌ను కూడా కాపాడుకున్న సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. 

కనిపించిన ధోని లోటు!
అయితే అప్పుడు ధోని మాస్ట‌ర్ మైండ్‌లా వ్య‌వ‌హ‌రించి వ్యూహాలు ప‌న్ని ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌ను చిత్తు చేయ‌డంలో స‌ల‌హాలు, సూచ‌న‌లు చేసేవాడు.కానీ ఇప్పుడు ధోని దూరం కావ‌డంతో ఆ ప్ర‌భావం క‌నిపించింది. ధోని ఉన్న‌ప్పుడు కూడా సీఎస్‌కే మ్యాచ్‌లు ఓడిపోలేదా అని అభిమానులు సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. ఇది నిజ‌మే కావొచ్చు.

కానీ ధోని కేవ‌ల సీఎస్‌కే ఆట‌గాడు మాత్రమే కాదు. రెండు మూడు సీజ‌న్లుగా చివర్లోనే బ్యాటింగ్‌ వస్తున్నాడు. కాని అత‌డిచ్చి స‌ల‌హాలు సీఎస్‌కే కెప్టెన్లు త‌ప్పకుండా పాటించి ఫ‌లితాలు సాధించేది. కానీ ఈసారి ధోని లేక‌పోవ‌డం జ‌ట్టును దెబ్బ‌తీసింద‌ని చెప్పొచ్చు. చెన్నై సూప‌ర్‌కింగ్స్ ఫీల్డింగ్ విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉంటుంది. 

కానీ నిన్న‌టి రాజ‌స్తాన్ మ్యాచ్‌లో ఆట‌గాళ్ల‌లో నిర్ల‌క్ష్యం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించింది. ప్ర‌మాద‌క‌ర సూర్య‌వంశీ క్యాచ్‌ను కార్తిక్ శ‌ర్మ విడిచి పెట్ట‌డం, ఆ త‌ర్వాత బౌండ‌రీ వెళ్ల‌కుండా బంతిని క‌నీసం ఆపే ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. క‌ర్ణుడి చావుకు స‌వా ల‌క్ష కార‌ణాలు అన్న‌ట్లు రాజ‌స్తాన్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే ఓట‌మికి కూడా కార‌ణాలు చాలానే ఉన్నాయి. 

అయితే ఇది సీజ‌న్‌లో తొలి మ్యాచ్ మాత్ర‌మే కావ‌డంతో రాబోయే మ్యాచ్‌ల్లో త‌ప్పుల‌ను స‌రిదిద్దుకొని ఆడాల్సిన అవ‌స‌రం సీఎస్కేకు ఉంది. ఇక డెవాల్డ్ బ్రెవిస్‌, ధోని ఎప్పుడు ఆడ‌తార‌న్న దానిపై స్ప‌ష్ట‌త లేదు. కాబట్టి వీరిద్ద‌రు జ‌ట్టులోకి వ‌చ్చేలోపూ తొలి హాఫ్‌లో క‌నీసం నాలుగు మ్యాచ్‌లు గెలిస్తే టాప్‌-4లో నిలిచేందుకు అవ‌కాశాలు మెరుగ్గా ఉంటాయ‌ని చెప్పొచ్చు.

చదవండి: రంగుమారిన మరుక్షణం మాట మార్చాడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement