8.78 సెకన్లలోనే 100 మీటర్ల పరుగు పూర్తి

Srinivas Gowda Creates New Record In Kambala Race - Sakshi

బెంగళూరు: భారత ఉసేన్‌ బోల్ట్‌గా గుర్తింపు పొందిన కంబాళ వీరుడు శ్రీనివాస గౌడ మరో రికార్డు సృష్టించాడు. గతేడాది కంబాళ పోటీల్లో దున్నలతో పాటు142.4 మీటర్ల దూరాన్ని 13.42 సెకన్లలో(100 మీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకన్లలో పూర్తి)  పూర్తి చేసిన ఆయన.. తాజాగా జరిగిన పోటీల్లో 100 మీటర్ల దూరాన్ని కేవలం 8.78 సెకన్లలోనే పూర్తి చేసి తన రికార్డును తానే తిరగరాశాడు. శ్రీనివాస గౌడ గతేడాది జరిగిన పోటీల్లో జమైకా పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్ 100 మీటర్ల ప్రపంచ రికార్డు(9.58 సెకన్లు) బ్రేక్ చేయగా, తాజాగా జరిగిన పోటీల్లో ఊహకు అందని స్పీడ్‌లో 100 మీటర్ల పరుగును పూర్తి చేసి మరోసారి యావత్‌ ప్రపంచ దృష్టిని ఆకర్శించాడు. కాగా, ఈ అభినవ బోల్ట్‌ను ఒలింపిక్స్‌కు సిద్దం చేయాలని సాయ్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఆహ్వానం పంపినప్పటికీ..  అతను దాన్ని సున్నితంగా తిరస్కరించడం విశేషం. 

వివరాల్లోకి వెళితే.. ఆదివారం కర్ణాటకలోని బంత్వాల్‌ తాలూకా పరిధిలో నిర్వహించిన 125 మీటర్ల పరుగు పోటీలో పాల్గొన్న శ్రీనివాస గౌడ.. 11.21 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకొని ప్రకంపనలు సృష్టించాడు. ఈ పోటీని 100 మీటర్లకు లెక్కకడితే అతను లక్ష్యాన్ని కేవలం 8.78 సెకన్లలోనే పూర్తిచేసినట్లు అధికారులు ధృవీకరించారు. గతవారం వెళ్తాంగండి పరిధిలో నిర్వహించిన కంబళ పోటీల్లో 100 మీటర్ల రేసును 8.96 సెకన్లలో పూర్తి చేసిన ఆయన.. వారం తిరగక ముందే తాను నెలకొల్పిన రికార్డును తానే బద్దలుకొట్టి మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇదిలా ఉండగా.. కంబాళ అనేది దక్షిణ కన్నడ, ఉడిపి, తుళునాడు తీర ప్రాంతాల్లో ప్రతి ఏడాది నిర్వహించే ఒక సాంప్రదాయ క్రీడ. కంబాళ ఆటలో ఎద్దులను ఉసికొల్పుతూ పోటీదారుడు బురద నీటిలో పరుగెత్తాల్సి ఉంటుంది. ఎవరైతే ఎద్దులను వేగంగా పరిగెత్తించి లక్ష్యాన్ని చేరుకుంటారో వారిని విజేతగా ప్రకటిస్తారు. కర్ణాటకలో వ్యవసాయం చేసే గౌడ సామాజిక వర్గం వారు ఈ పోటీల్లో పాల్గొంటారు.
చదవండి: ఆ సమయంలో నట్టూ గుండె ఎంత వేగంగా కొట్టుకుందో..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top