Farhaan Behardien: అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రొటీస్‌ సీనియర్‌ ఆల్‌రౌండర్‌ గుడ్‌బై

South African Veteran All-Rounder Farhaan Behardien Announce Retirment - Sakshi

దక్షిణాఫ్రికా సీనియర్‌ ఆల్‌రౌండర్‌ ఫర్హాన్‌ బెహర్దీన్‌ మంగళవారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 2008 నుంచి 2018 వరకు వైట్‌బాల్‌ క్రికెట్‌(వన్డే, టి20లు)లో సేవలందించిన బెహర్దీన్‌ 39 ఏళ్ల వయసులో ఆటకు గుడ్‌బై చెప్పాడు. 2004లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన బెహర్దీన్‌.. సౌతాఫ్రికా తరపున తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడేందుకు ఎనిమిదేళ్లు నిరీక్షించాడు.

అయితే 2012లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన బెహర్దీన్‌ ఆ తర్వాత ఆరేళ్ల పాటు దక్షిణాఫ్రికా జట్టులో రెగ్యులర్‌ ఆటగాడిగా కొనసాగాడు. పరిమిత ఓవర్లో స్పెషలిస్ట్‌ క్రికెటర్‌గా ముద్రపడిన బెహర్దీన్‌ ప్రొటీస్‌ తరపున 59 వన్డేలు, 38 టి20 మ్యాచ్‌లు ఆడాడు. బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన బెహర్దీన్‌ వన్డేల్లో 1074 పరుగులతో పాటు 14 వికెట్లు, టి20ల్లో 518 పరుగులతో పాటు మూడు వికెట్లు తీశాడు.

ఇక సౌతాఫ్రికా తరపున బెహర్దీన్‌ నాలుగు మేజర్‌ ఐసీసీ టోర్నీలు ఆడడం విశేషం. అందులో మూడు టి20 వరల్డ్‌కప్‌లు(2012, 2014,2016).. 2015 వన్డే వరల్డ్‌కప్‌ ఉన్నాయి. 2018లో ఆస్ట్రేలియాతో జరిగిన టి20 మ్యాచ్‌ బెహర్దీన్‌ కెరీర్‌లో చివరిది. ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన బెహర్దీన్‌.. అవకాశాలు లేక తాజాగా రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

ఈ సందర్భంగా బెహర్దీన్‌ తన ట్విటర్‌ వేదికగా రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఎమోషనల్‌ అయ్యాడు. ''18 ఏళ్ల లాంగ్‌ కెరీర్‌ ముగిసింది. అన్ని ఫార్మాట్లు కలిపి 560కి పైగా మ్యాచ్‌లు ఆడాను. దేశం తరపున 97 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నా. నా కేబినెట్‌లో 17 ట్రోఫీలు ఉన్నాయి. ఇక సౌతాఫ్రికా తరపున నాలుగు మేజర్‌ ఐసీసీ టోర్నీలు ఆడడం అదృష్టం. ఇన్నాళ్లు నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా'' అంటూ పేర్కొన్నాడు.

చదవండి: ఒలింపిక్‌ మాజీ స్విమ్మర్‌కు 12 ఏళ్ల జైలుశిక్ష

Virat Kohli: కోహ్లి తప్పుకున్నాడు సరే.. రోహిత్‌, రాహుల్‌ సంగతేంటి?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top