Wanindu Hasaranga: ఆ లీగ్‌లో ఆడొద్దు! హసరంగకు అనుమతి నిరాకరణ.. ఎందుకంటే..

SLC Deny NOC To Wanindu Hasaranga For The Hundred 2022 - Sakshi

The Hundred 2022: ది హండ్రెడ్ లీగ్‌ సీజన్‌-2022లో ఆడాలనుకున్న శ్రీలంక స్టార్‌ క్రికెటర్‌ వనిందు హసరంగకు చుక్కెదురైంది. ఈ లీగ్‌లో ఆడేందుకు.. శ్రీలంక క్రికెట్‌ బోర్డు(ఎస్‌ఎల్‌సీ) అతడికి అనుమతినివ్వలేదు. హసరంగకు నో ఆబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు బోర్డు నిరాకరించింది.  దీంతో ఈ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ టోర్నీ నుంచి తప్పుకొనేందుకు సిద్ధమయ్యాడు.

ఆసియా కప్‌-2022, టీ20 ప్రపంచకప్‌-2022 ఈవెంట్‌ సమీపిస్తున్న తరుణంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని శ్రీలంక బోర్డు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆష్లే డి సిల్వ వెల్లడించాడు. కాగా ఐపీఎల్‌కు పోటీ అన్నట్లుగా ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు.. హండ్రెడ్‌ లీగ్‌(ఇన్నింగ్స్‌కు వంద బాల్స్‌) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

లక్ష పౌండ్లు!
మొత్తం 8 జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌లో దేశీ, విదేశీ ఆటగాళ్లు పాల్గొంటారు. ఇందులో భాగంగా వనిందు హసరంగను మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ ఫ్రాంచైజీ లక్ష పౌండ్లు వెచ్చించి సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ సారథిగా వ్యవహరిస్తున్న మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ ఆగష్టు 5న నార్తర్న్‌ సూపర్‌చార్జర్స్‌తో మ్యాచ్‌తో తమ ప్రయాణం ఆరంభించనుంది.

ఈ క్రమంలో హసరంగ వంటి కీలక ప్లేయర్‌ దూరం కావడం ఈ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ లాంటిదే. కాగా శ్రీలంక ప్రీమియర్‌ లీగ్‌ నేపథ్యంలో హసరంగ జట్టుకు దూరమవుతాడని మాంచెస్టర్‌ ముందే ఫిక్సయిపోయినా.. ఆ టోర్నీ వాయిదా పడటంతో ఊపిరి పీల్చుకుంది. 

ఆడటానికి వీల్లేదు.. కారణమిదే!
ఈ నేపథ్యంలో హండ్రెడ్‌ లీగ్‌లో ఆడాలని వనిందు హసరంగ భావించగా.. శ్రీలంక బోర్డు అడ్డుచెప్పింది. ఈ విషయం గురించి ఎస్‌ఎల్‌సీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆష్లే డి సిల్వ ఈఎస్‌పీన్‌క్రిక్‌ఇన్పోతో మాట్లాడుతూ.. ఇందుకు గల కారణాన్ని వెల్లడించాడు. వరుసగా మెగా ఈవెంట్లు ఉన్న నేపథ్యంలో హసరంగకు నో ఆబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వలేదని తెలిపాడు.

కాగా ఆగష్టు 27 నుంచి ఆసియా కప్‌, అక్టోబర్‌ 16 నుంచి టీ20 ప్రపంచకప్‌ టోర్నీలు ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.  మరోవైపు.. ది హండ్రెడ్‌ లీగ్‌ తాజా సీజన్‌ ఆగష్టు 3న ఆరంభమైంది. సెప్టెంబరు 3న ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఇదిలా ఉంటే... హసరంగ స్థానాన్ని మాంచెస్టర్‌ దక్షిణాఫ్రికా యువ సంచలనం ట్రిస్టన్‌ స్టబ్స్‌తో భర్తీ చేసుకుంది. ఇక స్పిన్‌ మాస్ట్రో హసరంగ ఐపీఎల్‌-2022లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.

చదవండి: WC 2022: వరల్డ్‌ నెం.1 బౌలర్‌గా ఎదుగుతాడు! ప్లీజ్‌ చేతన్‌ అతడిని సెలక్ట్‌ చేయవా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top