ఆరుసార్లు ఆర్చర్‌కే దొరికేశాడు..!

Six Dismissals In Seven Innings, Warner To Archer - Sakshi

దుబాయ్‌: ఆర్చర్‌ సిద్ధంగా ఉండు.. తాడో పేడో తేల్చుకుందాం.. ఇది ఐపీఎల్‌ ఆరంభ సమయంలో ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నమాట. అంతకుముందు ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌ల్లో ఎక్కువసార్లు ఆర్చర్‌ బౌలింగ్‌లో ఔటైన వార్నర్‌.. దాన్ని ఐపీఎల్‌లో సరిచేయాలని చూశాడు. ఆర్చర్‌పై పైచేయి సాధించేందుకు క్యాష్‌ రిచ్‌ లీగ్‌ టోర్నీని ఉపయోగించుకోవాలనుకున్నాడు. కానీ ఆర్చర్‌పై వార్నర్‌ పైచేయి సాధించలేకపోయాడు. ఈ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆర్చర్‌ బౌలింగ్‌లోనే వార్నర్‌ ఔటయ్యాడు. ఇక్కడ ఒక మ్యాచ్‌లో రాజస్తాన్‌ విజయం సాధిస్తే, రెండో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో వార్నర్‌ 48 పరుగులు సాధించి ఆర్చర్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ కాగా, నిన్నటి మ్యాచ్‌లో వార్నర్‌ నాలుగు పరుగులే చేసి ఆర్చర్‌కు దొరికిపోయాడు.ఎక్స్‌ ట్రా స్వింగ్‌తో వేసిన బంతికి స‍్లిప్‌లో ఉన్న స్టోక్స్‌ కు క్యాచ్‌ ఇచ్చి వార్నర్‌ పెవిలియన్‌ చేరాడు. (బ్రదర్‌ కాస్కో.. నిన్ను టీజ్‌ చేస్తా: రాహుల్‌ చాహర్‌)

కాగా, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భాగంగా దాదాపు నెలన్నర సమయంలో ఆర్చర్‌ బౌలింగ్‌లో వార్నర్‌ ఆరుసార్లు ఔటయ్యాడు. గతనెల్లో ఇంగ్లండ్‌-ఆసీస్‌ జట్ల మధ్య జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో భాగంగా వార్నర్‌ ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లకు గాను నాలుగు ఇన్నింగ్స్‌ల్లో ఆర్చర్‌కే చిక్కేశాడు. సెప్టెంబర్‌ 4వ తేదీ(ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌) నుంచి అక్టోబర్‌ 23వ(ఐపీఎల్‌ మ్యాచ్‌) తేదీ మధ్యలో వీరు ముఖాముఖి పోరులో ఏడుసార్లు తలపడితే ఆరుసార్లు ఆర్చర్‌కే ఔట్‌ కావడం గమనార్హం. వీరిద్దరు ముఖాముఖి పోరులో తలపడే అవకాశం ఇప్పట్లో లేదు. ఎస్‌ఆర్‌హెచ్‌-రాజస్తాన్‌ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరినట్లయితే అప్పుడు మరొకసారి వీరు తలపడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే వార్నర్‌పై ఆర్చర్‌దే పైచేయి అయ్యింది. 

ఓవరాల్‌గా పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో వార్నర్‌కు మంచి రికార్డే ఉంది. 2014లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన వార్నర్‌కు ఆ జట్టు తరపున అద్భుతమైన రికార్డు కల్గి ఉన్నాడు.2014లో సన్‌రైజర్స్‌ తరపున మొదటిసారి ఆడిన వార్నర్‌.. 528 పరుగులతో టాప్‌ 4లో స్థానం సంపాదించాడు. తర్వాత వరుసగా 2015లో 562 పరుగులు, 2016లో 848 పరుగులు, 2017లో 641 పరుగులు, 2019లో 692 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌ సీజన్లలో అత్యధిక పరుగులు మూడు సార్లు సాధించి ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్న ఏకైక విదేశీ ఆటగాడిగా వార్నర్‌ రికార్డు నెలకొల్పాడు. 2015లో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన వార్నర్‌.. మరుసటి ఏడాది 2016లో జట్టుకు టైటిల్‌ అందించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top