ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా ఎంపికను భారత సెలెక్టర్లు ఇప్పటి నుంచే పరిశీలిస్తున్నారు. జూన్ 6 నుంచి న్యూ చంఢీఘడ్‌లో జరుగబోయే ఈ మ్యాచ్ కోసం సీనియర్లకు విశ్రాంతినివ్వాలని వారు యోచిస్తున్నారు.
సీనియర్ల జాబితాలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగం కాకపోవడంతో సెలెక్టర్లు ఈ మేరకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. వర్క్‌లోడ్ మరో కారణంగా తెలుస్తుంది.
భారత పర్యటనలో ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ మ్యాచ్‌తో పాటు మూడు వన్డేలు కూడా ఆడనుంది. ఆతర్వాత భారత జట్టు రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్‌కు వెళ్లనుంది. అనంతరం భారత్ 5 టీ20లు, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్‌కు వెళ్లనుంది. ఇంగ్లండ్ సిరీస్ నేపథ్యంలో భారత సెలెక్టర్లు గిల్, బుమ్రాకు విశ్రాంతినివ్వాలని అనుకుంటున్నారు. టీమిండియా-ఇంగ్లండ్ సిరీస్ జులై 1 నుంచి ప్రారంభమవుతుంది.
ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ సిరీస్‌లకు గిల్, బుమ్రాకు విశ్రాంతినివ్వడానికి సెలెక్టర్ల వద్ద మరో కారణం కూడా ఉంది. 2027 వన్డే వరల్డ్‌కప్‌కు వీరిద్దరు కీలకం కాబటి, మెగా టోర్నీకి ముందు వీలైనంత విశ్రాంతినివ్వవచ్చు. గిల్, బుమ్రా ఇటీవల తరుచూ గాయాల బారిన పడుతుండటంతో సెలెక్టర్లు వీరి విషయంలో రిస్క్ తీసుకునే సాహసం చేయరు. ఒకవేళ ప్రపంచకప్ దృష్ట్యా వన్డేల్లో ఆడించాలని అనుకుంటే మాత్రం ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు ఎంపిక చేయవచ్చు.
బుమ్రా, గిల్ గైర్హాజరీలో ఆకిబ్ నబీ, దేవదత్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డి తదితర పేర్లను సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. వీరిలో నబీ పేరు ఖరారైందని సమాచారం.


