Shivam Dube: అగ్నికి వాయువు తోడయ్యాడు.. పలు రికార్డులు బద్దలు

Shivam Dube Fastest Fifty Just 20 Balls Vs KKR Some Records Broken - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో సీఎస్‌కే ఆదివారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో తమ అత్యధి స్కోరును నమోదు చేసింది. రహానే, శివమ్‌ దూబేల విధ్వంసానికి తోడు కాన్వే క్లాస్‌ ఇన్నింగ్స్‌తో సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఓవరాల్‌గా సీఎస్‌కేకు ఐపీఎల్‌లో ఇది మూడో అత్యధిక స్కోరు కావడం విశేషం.

మరి మ్యాచ్‌లో సీఎస్‌కే ఇంత పెద్ద స్కోరు చేయడానికి ఇద్దరు ముఖ్య కారణం. ఒకరు అజింక్యా రహానే అయితే.. మరొకరు శివమ్‌ దూబే. అగ్నికి వాయువు తోడైతే ఇక విధ్వంసమే అన్నట్లుగా సాగింది సీఎస్‌కే ఇన్నింగ్స్‌. శివవ్‌ దూబే క్రీజులోకి వచ్చే సమయానికి రహానే 14 బంతుల్లో 19 పరుగులతో ఆడుతున్నాడు. ఈ ఇద్దరు జత కలిశాకా ఇన్నింగ్స్‌ 12.5 ఓవర్లో శివమ్‌ దూబే సిక్సర్‌తో మొదలైన విధ్వంసం ఐదు ఓవర్ల పాటు కొనసాగింది. శివమ్‌ దూబే వాయు వేగంతో పరుగులు సాధించాడు. కేవలం 20 బంతుల్లో ఫిఫ్టీ మార్క్‌ అందుకున్న శివమ్‌ దూబే ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.  ఈ క్రమంలోనే కేకేఆర్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే పలు రికార్డులు బద్దలు కొట్టింది. అవేంటో ఒకసారి చూసేద్దాం.

ఐపీఎల్‌లో సీఎస్‌కే తరపున అత్యంత వేగంగా ఫిఫ్టీ బాదిన ఆరో ఆటగాడిగా.. ధోని, అంబటి రాయుడులతో కలిసి శివమ్‌ దూబే సంయుక్తంగా ఉన్నాడు.

ఇక సీఎస్‌కేకు ఐపీఎల్‌లో చరిత్రలో ఇది మూడో అత్యధిక స్కోరు. ఇంతకముందు 2010లో రాజస్తాన్‌ రాయల్స్‌పై 246/5, 2008లో పంజాబ్‌ కింగ్స్‌పై 240/5 స్కోర్లు నమోదు చేసింది. తాజాగా ఇదే సీజన్‌లో ఆర్‌సీబీపై ఆరు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది.

ఇక కేకేఆర్‌తో మ్యాచ్‌లో రహానే 199.04 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ కొనసాగించడం విశేషం. ఈ సీజన్‌లో మినిమం వంద పరుగులు చేసే క్రమంలో అత్యధిక స్ట్రైక్‌రేట్‌ కలిగిన బ్యాటర్‌గా రహానే తొలిస్థానంలో నిలిచి చరిత్ర సృష్టించాడు. ఇంతకముందు శార్దూల్‌ ఠాకూర్‌(198.03), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌(188.80), నికోలస్‌ పూరన్‌(185.86), సూర్యకుమార్‌ యాదవ్‌(168.49) వరుసగా ఉన్నారు.

ఇక సిక్సర్ల విషయంలో సీఎస్‌కే సరికొత​ రికార్డు నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 18 సిక్సర్లు బాదిన సీఎస్‌కే.. ఒక ఇ‍న్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆరో జట్టుగా సీఎస్‌కే నిలిచింది. ఇంతకముందు 2013లో ఆర్‌సీబీ ఒకే ఇన్నింగ్స్‌లో 21 సిక్సర్లు కొట్టింది. 2017లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 సిక్సర్లు కొట్టింది. ఆ తర్వాత ఆర్‌సీబీ(2016లో 20 సిక్సర్లు), 2020లో రాజస్తాన్‌ రాయల్ష్‌ 20 సిక్సర్లు, 2015లో ఆర్‌సీబీ 18 సిక్సర్లు.. తాజాగా సీఎస్‌కే కేకేఆర్‌తో మ్యాచ్‌లో 18 సిక్సర్లు బాదింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top