Shimron Hetmyer: 'అలసత్వం తెచ్చిన తంటా'.. టి20 ప్రపంచకప్‌కు దూరం

Shimron Hetmyer Dropped West Indies T20 World Cup Squad Missed flight - Sakshi

వెస్టిండీస్‌ స్టార్‌.. హార్డ్‌ హిట్టర్‌ షిమ్రన్‌ హెట్‌మైర్‌ టి20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. అయితే గాయంతో దూరమయ్యాడనుకుంటే పొరపాటే. ఫ్లైట్‌ మిస్‌ అయిన కారణంగా ఆఖరి నిమిషంలో మేనేజ్‌మెంట్‌ హెట్‌మైర్‌ను జట్టు నుంచి తప్పించింది. కాగా హెట్‌మైర్‌ స్థానంలో షమ్రా బ్రూక్స్‌ను ఎంపిక చేసింది. కచ్చితమైన సమాచారం లేకుండా హెట్‌మైర్‌ రీ షెడ్యూల్‌ ఫ్లైట్‌ను కూడా మిస్‌ చేయడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది.

విషయంలోకి వెళితే.. మొన్నటి దాకా కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌ 2022)లో హెట్‌మైర్‌ గయానా అమెజాన్‌ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కెప్టెన్‌గా జట్టును నడిపించాడు. అయితే టి20 ప్రపంచకప్‌ ఆడేందుకు మిగతా జట్టంతా కాస్త ముందుగానే ఆస్ట్రేలియాకు చేరుకుంది. సీపీఎల్‌లో ఫైనల్‌ చేరిన రెండు జట్లలోని ఆటగాళ్లకు(టి20 ప్రపంచకప్‌కు ఎంపికైన వాళ్లు) మాత్రం అక్టోబర్‌ 1న ఆస్ట్రేలియా వెళ్లేలా ఏర్పాట్లు చేసింది. టి20 ప్రపంచకప్‌కు ముందు వెస్టిండీస్‌ జట్టు ఆస్ట్రేలియాతో రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ ఆడనుంది. అక్టోబర్‌ 5, 7 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

హెట్‌మైర్‌ మాత్రం వ్యక్తిగత కారణాల రిత్యా అక్టోబర్‌ 1న వెళ్లలేనని విండీస్‌ బోర్డుకు తెలిపాడు. దీంతో విండీస్‌ బోర్డు అక్టోబర్‌ 3న హెట్‌మైర్‌కు ఫ్లైట్‌ను రీషెడ్యూల్‌ చేసింది. ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టి20కి కూడా హెట్‌మైర్‌ అందుబాటులో ఉండడని క్రికెట్‌ వెస్టిండీస్‌ డైరెక్టర్‌ జిమ్మీ ఆడమ్స్‌ పేర్కొన్నాడు. అంతేకాదు ఈసారి ఫ్లైట్‌ మిస్‌ అయితే మాత్రం టి20 ప్రపంచకప్‌కు దూరమవ్వాల్సి ఉంటుందని హెట్‌మైర్‌ను బోర్డు హెచ్చరించింది. అయితే హెట్‌మైర్‌ మాత్రం రీషెడ్యూల్‌ ఫ్లైట్‌ ఎక్కలేకపోయాడు. ''కొన్ని కారణాల రిత్యా ఎయిర్‌పోర్ట్‌కు రాలేకపోయాను.. సారీ ఫర్‌ డిలే'' అంటూ బోర్డుకు సమాచారమిచ్చాడు.

కాగా హెట్‌మైర్‌ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బోర్డు.. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ముందుగా హెచ్చరించిన ప్రకారం రీషెడ్యూల్‌ ఫ్లైట్‌ ఎక్కకపోతే హెట్‌మైర్‌ను టి20 ప్రపంచకప్‌ జట్టు నుంచి తొలగించాలనే నిర్ణయానికే ప్యానెల్‌ కట్టుబడింది. ఇందుకు ప్యానెల్‌ సభ్యులు కూడా యునానిమస్‌గా ఒప్పుకోవడంతో హెట్‌మైర్‌ను జట్టు నుంచి తప్పించి అతని స్థానంలో షమ్రా బ్రూక్స్‌ను ఎంపిక చేసింది.

''హెట్‌మైర్‌ విషయంలో మేం క్లారిటీగా ఉన్నాం. రీషెడ్యూల్‌ ఫ్లైట్‌ కూడా మిస్‌ అయితే జట్టు నుంచి తప్పిస్తామని ముందే హెచ్చరించాం. వ్యక్తిగత కారణాల రిత్యా హెట్‌మైర్‌ మరోసారి ఫ్లైట్‌ మిస్‌ అయ్యాడు. దీంతో రూల్‌ ప్రకారం అతన్ని జట్టు నుంచి తప్పించాం. అతని స్థానంలో బ్రూక్స్‌ను ఆస్ట్రేలియాకు పంపించాం'' అంటూ డైరెక్టర్‌ జిమ్మీ ఆడమ్స్‌ పేర్కొన్నాడు.

ఇక సీపీఎల్‌ 2022లో షమ్రా బ్రూక్స్‌ సెంచరీతో చెలరేగి తన జట్టు జమైకా తలైవాస్‌ ఫైనల్‌ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత ఫైనల్లో బార్బడోస్‌ రాయల్స్‌ను ఓడించిన జమైకా తలైవాస్‌ సీపీఎల్‌ చాంపియన్‌గా అవతరించింది. ఇక అక్టోబర్ 17న స్కాట్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో వెస్టిండీస్ తమ ప్రపంచకప్ ఆటను షురూ చేయనుంది.

వెస్టిండీస్ ప్రపంచకప్ జట్టు: నికోలస్ పూరన్(కెప్టెన్), రోవమన్ పోవెల్, యన్నిక్ కరై, జాన్సన్ చార్లెస్, షెల్డన్ కాట్రెల్, షమారా బ్రూక్స్, జాసన్ హోల్డర్, అకీల్ హోస్సెన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, కైల్ మేయర్స్, ఓబెడ్ మెక్‌కామ్, రేమన్ రీఫర్, ఓడియన్ స్మిత్

చదవండి: 'చదువును చంపకండి'.. రషీద్‌ ఖాన్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top