ఎక్కుపెట్టండి బాణం! | The second season of Archery Premier League begins in Hyderabad today | Sakshi
Sakshi News home page

ఎక్కుపెట్టండి బాణం!

Oct 8 2026 4:09 AM | Updated on Oct 8 2026 4:09 AM

The second season of Archery Premier League begins in Hyderabad today

నేటి నుంచి హైదరాబాద్‌లో ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌

నెక్లెస్‌ రోడ్‌ పీపుల్స్‌ ప్లాజా వేదికగా పోటీలు

అక్టోబర్‌ 18న ఫైనల్‌ 

బరిలో టాప్‌ ఆర్చర్లు  

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవలే ముగిసిన ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్లు అత్యుత్తమ ప్రదర్శనతో సత్తా చాటారు. 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలతో మొత్తం 9 పతకాలు మన ఆటగాళ్లు భారత్‌కు అందించారు. ఇప్పుడు ఈ ఆర్చర్ల ప్రదర్శనను సొంతగడ్డపై అభిమానులకు ప్రత్యక్షంగా చూసే అవకాశం దక్కనుంది. భారత టాప్‌ ఆర్చర్లతో పాటు ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆటగాళ్లు కూడా పాల్గొంటున్న ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) రెండో సీజన్‌కు నేడు తెర లేవనుంది. 

2025లో నిర్వహించిన తొలి సీజన్‌ విజయవంతం కావడంతో సీజన్‌–2 కోసం భారత ఆర్చరీ సమాఖ్య సన్నద్ధమైంది. భాగ్యనగరంలోని నెక్లెస్‌ రోడ్‌ పీపుల్స్‌ ప్లాజాలో రాత్రి లైట్ల వెలుగులో ఆకర్షణీయంగా పోటీలను నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 18 వరకు జరిగే ఈ ఈవెంట్‌లో మొత్తం 48 మంది ఆర్చర్లు పాల్గొంటున్నారు.   

తెలంగాణ ప్లేయర్‌ తానిపర్తి చికిత, ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ, బొమ్మదేవర ధీరజ్, గణేశ్‌ మణిరత్నంలతో పాటు కుంకుమ్‌ మొహొద్, దీపికా కుమారి, అతాను దాస్, ఓజస్‌ ప్రవీణ్‌ తదితర భారత ఆర్చర్లు ఈ లీగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. విదేశీ ఆటగాళ్లలో ఒలింపిక్‌ విజేతలు మీటీ గెజాజ్‌ (టర్కీ), అలెజాండ్రా వెలెన్సియా (మెక్సికో), మార్కర్‌ అల్‌మీడా (బ్రెజిల్‌), మైక్‌ స్కోలెసర్‌ (నెదర్లాండ్స్‌), ఎలా గిబ్సన్‌ (గ్రేట్‌ బ్రిటన్‌) కూడా ఈ లీగ్‌లో ఆడుతుండటం విశేషం.  

ఒక్కో జట్టులో ఎనిమిది మంది ఆర్చర్లతో మొత్తం ఆరు జట్లు ఉంటాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌ రాజ్‌పుతానా రాయల్స్, కాకతీయ నైట్స్, పృథ్వీరాజ్‌ యోధాస్, మైటీ మరాఠాస్, చోళా చీఫ్స్, చెరో ఆర్చర్స్‌ పేరుతో జట్లు బరిలోకి దిగుతున్నాయి. డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో టోర్నీ జరుగుతుంది. అంతర్జాతీయ టోర్నీలతో పోలిస్తే నిబంధనల్లో స్వల్ప మార్పులతో లీగ్‌ను నిర్వహిస్తున్నారు. ఒక్కో బాణం సంధించేందుకు అంతర్జాతీయ పోటీల్లో 20 సెకన్ల సమయం ఉంటుంది. 

కానీ లీగ్‌లో 15 సెకన్లకే పరిమితం చేయడం ఆసక్తికరంగా మారనుంది. లీగ్‌ దశలో టాప్‌–4లో నిలిచిన టీమ్‌లు సెమీస్‌కు చేరతాయి. ఈ ఆర్చరీ లీగ్‌ సోనీ లివ్‌ యాప్‌లో, దూరదర్శన్‌లో ప్రసారం అవుతుంది. ఈ అగ్రశ్రేణి ఆర్చర్ల ఆటను అభిమానులు టికెట్‌ కొని ప్రత్యక్షంగా చూడవచ్చు.https://www. district.in/events/archery&premier&league&buy&tickets లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. టికెట్ల ధరను రూ. 250గా నిర్ణయించారు. రాత్రి 7.30 నుంచి రాత్రి 9.30 వరకు ప్రతీ రోజూ మూడు మ్యాచ్‌ల చొప్పున జరుగుతాయి.

భారత ఆర్చర్లు ఏ జట్టులో... 
చోళా చీఫ్స్‌: చికిత, దీపిక, రిషభ్‌ యాదవ్, యుక్తశ్రీ.  
రాజ్‌పుతానా రాయల్స్‌: ఓజస్‌ ప్రవీణ్, సంగీత. 
కాకతీయ నైట్స్‌: జ్యోతి సురేఖ, నీరజ్‌ చౌహాన్, రోహిత్‌ కుమార్‌. 
పృథ్వీరాజ్‌ యోధాస్‌: గణేశ్‌ మణిరత్నం, అభిషేక్‌ వర్మ.  
చేరో ఆర్చర్స్‌: కుంకుమ్‌ మొహొద్, సాహిల్‌ జాదవ్, అతాను దాస్‌. 
మైటీ మరాఠాస్‌: బొమ్మదేవర ధీరజ్, పర్నీత్‌ కౌర్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement