‘అదే జరిగితే.. టీమిండియా సెలక్టర్లు పట్టించుకోరు’ | Scrutiny Around Pant Is Justified: India Ex Star Blunt Verdict On LSG Captain | Sakshi
Sakshi News home page

‘అతడిని విమర్శించాల్సిందే.. టీమిండియా సెలక్టర్లు పట్టించుకోరు’

Mar 25 2026 3:24 PM | Updated on Mar 25 2026 4:11 PM

Scrutiny Around Pant Is Justified: India Ex Star Blunt Verdict On LSG Captain

రిషభ్‌ పంత్‌ (PC: BCCI)

గతేడాది లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు టీమిండియా స్టార్‌ రిషభ్‌ పంత్‌. మెగా వేలంలో లక్నో ఫ్రాంఛైజీ రికార్డు స్థాయిలో ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్‌ నిలిచాడు.

కెప్టెన్‌గానూ ఫెయిల్‌
అయితే, ఐపీఎల్‌-2025లో పంత్‌ (Rishabh Pant) దారుణంగా విఫలమయ్యాడు. పదమూడు మ్యాచ్‌లలో కలిపి కేవలం 269 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కెప్టెన్‌గానూ పంత్‌ ఫెయిలయ్యాడు. అతడి సారథ్యంలో లక్నో గతేడాది పద్నాలుగింట ఆరు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో పంత్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

టీమిండియా రీఎంట్రీ కష్టమే
ముఖ్యంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్నా రిస్కీ షాట్లతో మూల్యం చెల్లించిన తీరుపై మాజీ క్రికెటర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా పంత్‌ను ఉద్దేశించి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికైనా పంత్‌ ఆట తీరు మారకపోతే.. భారత టీ20 జట్టులో అతడు తిరిగి స్థానం దక్కించుకోవడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు.

‘‘రిషభ్‌ పంత్‌ విషయంలో విమర్శలు రావడం సరైందే. సంప్రదాయ విరుద్ధ, రిస్కీ షాట్లు ఆడటం అనే చట్రంలో అతడు ఇరుక్కుపోయాడు. ఫామ్‌ను తిరిగి పొందే ప్రయత్నమే చేయడం లేదు. గతేడాది మొత్తం రిస్కీ షాట్లతో విమర్శలు మూటగట్టుకున్నాడు.

సెలక్టర్లు అసలు పట్టించుకోవడం లేదు
టీ20 ప్రపంచకప్‌-2024లో భారత్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత టీ20 జట్టుకు అతడు దూరమయ్యాడు. మిడిలార్డర్‌లో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా సేవలు అందించే పంత్‌ గురించి ఇప్పుడు సెలక్టర్లు అసలు పట్టించుకోవడం లేదు.

ఓపెనర్‌-వికెట్‌ కీపర్‌గా ఓ ఆటగాడు రాణిస్తుంటే (సంజూ), ఓపెనర్‌- వికెట్‌ కీపర్‌ లేదంటే వన్‌డౌన్‌లో ఆడే వికెట్‌ కీపర్‌గా మరొకరు (ఇషాన్‌) దుమ్ములేపుతున్నారు. కాబట్టి ఈసారి ఐపీఎల్‌లో సత్తా చాటితేనైనా తిరిగి జాతీయ జట్టులో పునరాగమనం చేసే అవకాశం అయినా పంత్‌కు దక్కుతుంది. 

ఏదేమైనా జాతీయ జట్టుకు ఆడటమే ప్లేయర్‌ అంతిమ లక్ష్యం కదా! యువరాజ్‌ సింగ్‌ మార్గదర్శనంలో పంత్‌ ప్రాక్టీస్‌ చేయడం శుభసూచకం. ఈసారైనా పంత్‌ ఉత్తమంగా రాణించాలి. లేదంటే భవిష్యత్‌ కష్టమే’’ అని ఆకాశ్‌ చోప్రా జియోహాట్‌స్టార్‌ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా మార్చి 28 నుంచి ఐపీఎల్‌-2026 షురూ కానుంది.

చదవండి: రూ. 15 వేల కోట్లకు అమ్మకం.. షేన్‌ వార్న్‌ వాటా ఎంతంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement