రూ. 15 వేల కోట్లు.. షేన్‌ వార్న్‌ వాటా ఎంతంటే? | After Rajasthan Royals Sale, Shane Warne Family To Earn Rs 450 Cr Why? | Sakshi
Sakshi News home page

రూ. 15 వేల కోట్లకు అమ్మకం.. షేన్‌ వార్న్‌ వాటా ఎంతంటే?

Mar 25 2026 10:53 AM | Updated on Mar 25 2026 11:02 AM

After Rajasthan Royals Sale, Shane Warne Family To Earn Rs 450 Cr Why?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 ఆరంభానికి ముందే రెండు ఫ్రాంఛైజీల అమ్మకం జరిగిపోయింది. ఆరంభ సీజన్‌ 2008 విజేత రాజస్తాన్‌ రాయల్స్‌ అనూహ్య రీతిలో 1.63 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ. 15, 341 కోట్లు)కు అమ్ముడుపోగా.. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆర్సీబీ సుమారు రూ. 16,753 కోట్ల ధర పలికినట్లు సమాచారం.

రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టులలో వంద శాతం వాటాను అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కాల్‌ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం కొనుగోలు చేసింది. ఇందులో రాబ్‌ వాల్టన్‌, హ్యాంప్‌ కుటుంబం వాటాదారులు.

షేన్‌ వార్న్‌ కుటుంబానికి భారీ లాభం
ఇక ఈ భారీ ఒప్పందం కారణంగా ఆస్ట్రేలియా దిగ్గజం షేన్‌ వార్న్‌ కుటుంబం కూడా భారీగా లాభపడినట్లు సమాచారం. రాజస్తాన్‌ రాయల్స్‌ తొలి కెప్టెన్‌గా.. అరంగేట్ర సీజన్‌లోనే జట్టును విజేతగా నిలిపిన ఘనత వార్న్‌కు ఉంది. కేవలం బంతితో మాయాజాలం చేయడమే కాకుండా.. పెట్టుబడుల విషయంలోనూ షేన్‌ వార్న్‌ ముందు చూపు వల్లే ఇప్పుడు అతడి ఫ్యామిలీకి వందల కోట్ల ప్రయోజనం చేకూరినట్లు తెలుస్తోంది.

ఆ ఒప్పందం ప్రకారం
ఐపీఎల్‌ ఆరంభ సీజన్‌లో రాజస్తాన్‌ జట్టుతో చేరిన సమయంలోనే వార్న్‌ ఓ కండిషన్‌ పెట్టినట్లు గతంలో వెల్లడించాడు. ‘‘మా మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. వాళ్లు నన్ను కెప్టెన్‌గా, కోచ్‌గా సేవలు అందించమన్నారు. నాకు నచ్చినట్లుగా జట్టును నడిపించమన్నారు. అంతా నన్నే చూసుకోమన్నారు’’ అని వార్న్‌ గతంలో ది హెరాల్డ్‌ సన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

ఇక ఆ ఒప్పందం ప్రకారం జట్టుతో కొనసాగిన కాలంలో ఏడాదికి 0.75 శాతం వాటా వార్న్‌కు దక్కినట్లు తెలుస్తోంది. వార్న్‌ రాజస్తాన్‌తో నాలుగేళ్లు కొనసాగినందున మొత్తంగా అతడి వాటా మూడు శాతానికి చేరినట్లు సమాచారం. 

రూ. 450- రూ. 460 కోట్ల మేర వాటా
ఈ క్రమంలో తాజా ఒప్పందం ప్రకారం.. వార్న్‌ కుటుంబానికి రూ. 450- రూ. 460 కోట్ల మేర వాటా లభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌-2026 తర్వాత వార్న్‌ కుటుంబం తమ వాటా అమ్ముకుని సొమ్ము చేసుకునే అవకాశం ఉంది.

నాడు రూ. 320 కోట్లు మాత్రమే
అయితే, ఇందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI)  ఆమోదం తప్పనిసరి. కాగా 2008లోఎమర్జింగ్‌ మీడియా యజమాని మనోజ్‌ బదాలే  65%, రెడ్‌బర్డ్‌ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌ 15%, లక్‌లాన్‌ మర్డోక్‌ 13%, ఇతరులు 7% వాటాలతో రాజస్తాన్‌ రాయల్స్‌ను సొంతం చేసుకున్నారు. నాడు ఆ జట్టు విలువ రూ. 320 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. 

కాగా తాజా ఎడిషన్‌ ముగిసిన తర్వాత కొత్త యాజమాన్యానికి రాయల్స్‌ హక్కులు లభిస్తాయి. కాగా 2022లో షేన్‌ వార్న్‌ హఠాన్మరణం చెందిన విషయం విదితమే. అయితే, పద్దెమినిదేళ్ల క్రితం ఈ స్పిన్‌ లెజెండ్‌ పెట్టిన పెట్టుబడి అతడి కుటుంబానికి ఈ మేర లాభం చేకూర్చడం విశేషం.

చదవండి: రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం.. జీతం ఎంతంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement