సన్‌రైజర్స్‌కు వరంలా మారిన సాకిబ్‌ హుస్సేన్‌ | Sakib Hussain is yet to concede a six in IPL | Sakshi
Sakshi News home page

సన్‌రైజర్స్‌కు వరంలా మారిన సాకిబ్‌ హుస్సేన్‌

Apr 22 2026 4:39 PM | Updated on Apr 22 2026 4:43 PM

Sakib Hussain is yet to concede a six in IPL

ఐపీఎల్‌ 2026లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అనూహ్యంగా పుంజుకుంది. ఆరంభ మ్యాచ్‌ల్లో తడబడినా, ఆతర్వాత హ్యాట్రిక్‌ విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఎస్‌ఆర్‌హెచ్‌ జోరు చూస్తేంటే ఈ సీజన్‌ టైటిల్‌ గెలవడం ఖాయంగా కనిపిస్తుంది.

సీజన్‌ ప్రారంభంలో బౌలింగ్‌లో చాలా ఇబ్బంది పడిన ఈ జట్టు యువ పేసర్‌ సాకిబ్‌ హుస్సేన్‌ రాకతో ఒక్కసారిగా టైటిల్‌ ఫేవరెట్‌గా మారిపోయింది. సాకిబ్‌ తొలి మ్యాచ్‌లోనే అబ్బురపరిచే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో సాకిబ్‌ 4 ఓవర్లలో కేవలం 24 పరుగులిచ్చి ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు.

అనంతరం సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లోనూ సాకిబ్‌ సత్తా చాటాడు. 4 ఓవర్లలో 32 పరుగులిచ్చి ఓ వికెట్‌ తీశాడు. తాజాగా (ఏప్రిల్‌ 21) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సాకిబ్‌ మరోసారి జూలు విదిల్చాడు. 4 ఓవర్లలో 29 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్‌ తీశాడు. 

రైట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ మీడియం బౌలింగ్‌ చేసే 21 ఏళ్ల సకీబ్‌ అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతూ ఎస్‌ఆర్‌హెచ్‌ పాలిట వరంలా మారాడు. అతను ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేయడమే కాకుండా 6 వికెట్లు తీసి సన్‌రైజర్స్‌ గెలుపుయాత్రలో ప్రధాన భాగమయ్యాడు. సాకిబ్‌ ఆడిన 3 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌ గెలిచింది. 

అలాగే సాకిబ్‌ 3 మ్యాచ్‌లు ఆడినా ఒక్క సిక్సర్‌ కూడా ఇవ్వలేదు. ఇదే అతన్ని ప్రత్యేకంగా నిలుపుతుంది. సకీబ్‌ ఇప్పటివరకు వేసిన 72 బంతుల్లో కేవలం 85 పరుగులు మాత్రమే ఇచ్చి అత్యంత పిసినారి బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. మొత్తంగా సకీబ్‌ రాక సన్‌రైజర్స్‌ ఫేట్‌ను మార్చేసింది. ఇతను ఇదే జోరును కొనసాగిస్తే, ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ను టైటిల్‌ గెలవకుండా ఆపడం కష్టం.

సకీబ్‌కు మరో యువ పేసర్‌ ప్రఫుల్‌ హింగే కూడా తోడయ్యాడు. అతను కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. అయితే అతను సకీబ్‌ లాగా పొదుపుగా బౌలింగ్‌ చేయలేకపోతున్నాడు. తొలి మ్యాచ్‌లో సకిబ్‌తో పాటు అద్భుత ప్రదర్శన (4-34) చేసిన హింగే ఆతర్వాతి మ్యాచ్‌లో ధారాళంగా (1-60) పరుగులు సమర్పించుకున్నాడు. 

సకీబ్‌, ప్రఫుల్‌ మాత్రమే కాకుండా ఈ సీజన్‌లో మరో ఇద్దరు సన్‌రైజర్స్‌ బౌలర్లు సత్తా చాటుతున్నారు. శ్రీలంకకు చెందిన పేసర్‌ ఎషాన్‌ మలింగ, లెఫ్ట్‌ ఆర్మ్‌ రిస్ట్‌ స్పిన్నర్‌ శివాంగ్‌ కుమార్‌ అద్భుతంగా రాణిస్తూ సన్‌రైజర్స్‌ విజయాల్లో ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. 

వాస్తవానికి సీజన్‌ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్‌కు బౌలింగే ప్రధాన సమస్యగా ఉండేది. రెగ్యులర్‌ కెప్టెన్‌, జట్టు ప్రధాన పేసర్‌ పాట్‌ కమిన్స్‌ గాయం కారణంగా సగం సీజన్‌కు దూరమయ్యాడు. సీనియర్‌ పేసర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. 

ఇలాంటి తరుణంలో ప్రఫుల్‌, సకీబ్‌, శివాంగ్‌ లాంటి దేశీయ బౌలర్లు వచ్చి సన్‌రైజర్స్‌ ఫేట్‌నే మార్చేశారు. త్వరలో కమిన్స్‌ కూడా వీరికి జత కలిస్తే సన్‌రైజర్స్‌ను ఆపడం చాలా కష్టమవుతుంది. ఈ జట్టు బ్యాటింగ్‌ బలం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అత్యంత ప్రమాదకర బ్యాటింగ్‌ లైనప్‌ ఈ జట్టు సొంతం. ఫీల్డింగ్‌లో కాస్త మెరుగుపడితే ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ గెలుపు తధ్యం.

Advertisement
 
Advertisement
Advertisement