Formula-E Race: హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసింగ్‌.. సెలబ్రిటీల సందడి

Sachin-Chahal-Dhawan Attend Formula-E Racing Necklace Road-Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరం వేదికగా జరుగుతోన్న ప్రతిష్ఠాత్మక ఫార్ములా- ఈ రేస్‌ ఛాంపియన్‌షిప్‌లో శనివారం పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. సినీ, క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీలు హాజరయ్యారు. ఫార్ములా వన్‌ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన ఫార్ములా-ఈ కావడంతో భాగ్యనగరం పూర్తి సందడిగా మారింది. హీరో రామ్‌చరణ్‌తో పాటు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ సహా సీనియర్‌ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌, స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌, దీపక్‌ చహర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపిచంద్‌ కూడా రేసును వీక్షించడానికి వచ్చాడు.

ప్రధాన రేసుకు ముందు నిర్వహించిన ప్రాక్టీస్‌ రేసులను తిలకించిన క్రికెటర్లు సంతోషం వ్యక్తం చేశారు. నెక్లెస్‌ రోడ్డులో రయ్యుమని దూసుకెళ్తున్న రేసింగ్‌ కార్లను చూస్తుంటే ముచ్చటేస్తుందని క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన రేసు ప్రారంభమైంది. మొత్తం 2.8 కిమీ స్ట్రీట్‌ సర్క్యూట్‌లో 11 ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీలకు చెందిన 22 రేసర్లు పోటీల్లో పాల్గొంటున్నారు.

ఫార్ములా-ఈలో ప్రస్తుతం 9వ సీజన్‌ నడుస్తోంది. ఇందులో ఇప్పటికే మూడు రేస్‌లు పూర్తయ్యాయి. మెక్సికో సిటీ మొదటి రేస్‌కు ఆతిథ్యం ఇవ్వగా, సౌదీ అరేబియాలోని దిరియాలో తర్వాతి రెండు రేస్‌లు జరిగాయి. హైదరాబాద్‌లో జరగబోతోంది ఈ సీజన్‌లో నాలుగో రేస్‌. ప్రస్తుతం మూడు రేస్‌ల తర్వాత మొత్తం 76 పాయింట్లతో ఆండ్రెటీ టీమ్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, పోర్‌‡్ష (74) రెండో స్థానంలో ఉంది.  

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top