Temba Bavuma: ఈ ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాం! ప్రధాన కారణం అదే

ICC Mens T20 World Cup 2022 - South Africa vs Netherlands: ‘‘నిరాశకు లోనయ్యాం. ఈ మ్యాచ్ కంటే ముందు మేము చాలా బాగా ఆడాము. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ అని తెలుసు. ఈ ఓటమిని అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. నాకౌట్ దశకు చేరుకుంటామనే నమ్మకంతో ఉన్నాం. కానీ ఇలా జరిగిపోయింది’’ అంటూ దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా విచారం వ్యక్తం చేశాడు.
కాగా టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా.. నెదర్లాండ్స్ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే. 13 పరుగుల తేడాతో పరాజయం చెంది ఈవెంట్ నుంచి నిష్క్రమించింది. ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ప్రొటిస్.. ఇలా పసికూన చేతిలో ఓడిపోవడం గమనార్హం.
స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాం
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కెప్టెన్ బవుమా ఓటమిపై స్పందిస్తూ.. ‘‘ఓడిపోవడానికి కారణాలు అనేకం. ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం.. ఆపై ప్రత్యర్థి జట్టును 158 పరుగుల దాకా స్కోర్ చేయనివ్వడం మా తప్పే.
ఇక బ్యాటింగ్‌లోనూ పాకిస్తాన్‌తో మ్యాచ్ మాదిరే కీలక సమయంలో వికెట్లు కోల్పోయాం. మ్యాచ్ సాగే కొద్దీ వికెట్ మరింత కఠినంగా మారింది. అయితే వాళ్లు మైదానాన్ని ఉపయోగించుకున్నట్లుగా మేము వాడుకోలేకపోయాం. మా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాం’’ అని పేర్కొన్నాడు.
మాటల్లో వర్ణించలేం
ఇక నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్‌వర్డ్స్ సౌతాఫ్రికా వంటి మేటి జట్టుపై గెలుపొందిన అనుభూతిని మాటల్లో వర్ణించలేనంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ‘‘నెదర్లాండ్స్‌లో కూడా ఇలాంటి పిచ్ పరిస్థితులే ఉంటాయి. 160 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోగలుగుతామనే విశ్వాసంతో ఉన్నాం. అదే నిజమైంది. ప్రపంచకప్ టోర్నీలో మాకో గొప్ప అనుభవం ఇది. పెద్ద జట్టును నెదర్లాండ్స్ ఓడించగలిగింది’’ అని ఆనందం వ్యక్తం చేశాడు.
చదవండి: WC 2022: పాపం.. సౌతాఫ్రికా టోర్నీ నుంచి అవుట్! ఇందుకు కారణం ఆ రెండే! ముఖ్యంగా యూఏఈ!
T20 WC 2022: సెమీస్‌కు టీమిండియా.. ఆశల పల్లకీలో పాకిస్తాన్, అనూహ్యంగా రేసులోకి బంగ్లా
మీ అభిప్రాయం చెప్పండి
మరిన్ని వార్తలు :
మరిన్ని వార్తలు