Rajat Patidar: అలా అయితే ఇషాన్‌ కూడా రాంచీలో నన్ను ఆడించు అంటాడు! కానీ..

Rohit Sharma On Patidar Absence: Ishan Also Say Let Me Play In Ranchi - Sakshi

India vs New Zealand ODI Series: ఏ ఆటగాడికైనా తన సొంతమైదానంలో అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి మ్యాచ్‌ ఆడే అవకాశం వస్తే ఆ అనుభూతే వేరు. సొంత ప్రేక్షకుల నడుమ టీమిండియా క్యాప్‌ అందుకుంటే ఆ జ్ఞాపకం జీవితాంతం గుర్తుండిపోతుందనడంలో సందేహం లేదు. ఒక్కోసారి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయనిపించినా.. దురదృష్టం వెక్కిరిస్తే.. భంగపడకతప్పదు.

మధ్యప్రదేశ్‌ క్రికెటర్‌ రజత్‌ పాటిదార్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. టీమిండియా- న్యూజిలాండ్‌ మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో ఓ మ్యాచ్‌ మిగిలి ఉండగానే రోహిత్‌ సేన ట్రోఫీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నామమాత్రపు మూడో వన్డే ఇండోర్‌ వేదికగా జరిగింది.

పాపం రజత్‌
ఈ క్రమంలో శ్రేయస్‌ అయ్యర్‌ గాయం కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో అతడి స్థానాన్ని భర్తీ చేసిన రజత్‌కు ఆఖరి మ్యాచ్‌లో అవకాశం వస్తుందని అభిమానులు భావించారు. అయితే, ఈ ఇండోర్‌ బ్యాటర్‌కు మాత్రం మొండిచేయి ఎదురైంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు రజత్‌ గురించి ప్రశ్న ఎదురైంది.

ఇషాన్‌ కూడా అలా అంటే..
ఇందుకు బదులుగా.. ‘‘నిజమే.. మేము అతడిని ఇండోర్‌ మ్యాచ్‌లో ఆడించాల్సింది. మరి.. ఇషాన్‌ కూడా నాది రాంచి కదా.. నన్ను రాంచి మ్యాచ్‌లో ఆడనివ్వండి అంటాడు. అందరూ అలాగే అంటే కుదరదు కదా! మాకంటూ కొన్ని ప్రణాళికలు ఉంటాయి.

వాటికి అనుగుణంగానే జట్టు కూర్పు ఉంటుంది. ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వడానికే ప్రయత్నిస్తాం. చాలా మంది జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్లందరికి ఛాన్స్‌ ఇస్తామనే చెబుతాం. అయితే, అందుకు పరిస్థితులు కూడా అనుకూలించాలి కదా’’ అని హిట్‌మ్యాన్‌ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. 

క్లీన్‌స్వీప్‌
కాగా చివరి వన్డేలో 90 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. ఇదిలా ఉంటే.. ఇండోర్‌లో జన్మించిన రజత్‌ పాటిదార్‌ ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 29 ఏళ్ల ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌ పలుమార్లు జట్టుకు ఎంపికైనా తుదిజట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోతున్నాడు. 

చదవండి: Shardul Thakur: ప్రపంచకప్‌ జట్టులో అతడికి చోటు ఖాయం! అంతలేదు.. హార్దిక్‌ ఉండగా..
ICC T20 World Cup: ప్రపంచకప్‌ సెమీ ఫైనల్లో టీమిండియా.. కివీస్‌తో పోరుకు సై

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top