IPL 2026: రోహిత్‌ శర్మ ఉగ్రరూపం​.. సరికొత్త చరిత్ర | Rohit Sharma Creates History Vs KKR In IPL 2026, Shatters Huge Record | Sakshi
Sakshi News home page

IPL 2026: రోహిత్‌ శర్మ ఉగ్రరూపం​.. సరికొత్త చరిత్ర

Mar 29 2026 10:18 PM | Updated on Mar 29 2026 10:18 PM

Rohit Sharma Creates History Vs KKR In IPL 2026, Shatters Huge Record

ఐపీఎల్‌ 2026లో భాగంగా కేకేఆర్‌తో ఇవాళ (మార్చి 29) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ స్టార్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ చెలరేగిపోతున్నాడు. కేవలం 23 బంతుల్లోనే అర్ద సెంచరీ (3 ఫోర్లు, 5 సిక్సర్లు) పూర్తి చేసి ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ భారీ రికార్డు నెలకొల్పి, చరిత్ర సృష్టించాడు.

కేకేఆర్‌తో మ్యాచ్‌ అంటేనే పూనకం వచ్చినట్లు ఊగిపోయే హిట్‌మ్యాన్‌, మరోసారి అదే తరహా ప్రదర్శనతో రెచ్చిపోయి, ఐపీఎల్‌ చరిత్రలో ఈ ఫ్రాంచైజీపై అత్యధిక పరుగులు (36 మ్యాచ్‌ల్లో 1094 పరుగులు, 6 అర్ద సెంచరీలు, ఓ సెంచరీ) చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 

ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఈ రికార్డు డేవిడ్‌ వార్నర్‌ (1093 పరుగులు) పేరిట ఉండేది. ఈ జాబితాలో రోహిత్‌, వార్నర్‌ తర్వాతి స్థానాల్లో విరాట్‌ కోహ్లి (1021), శిఖర్‌ ధవన్‌ (907), సురేశ్‌ రైనా (829) ఉన్నారు.

ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ
ఈ మ్యాచ్‌లో రోహిత్‌ చేసిన 23 బంతుల హాఫ్‌ సెంచరీ, ఐపీఎల్‌లో అతనికి వేగవంతమైందిగా నిలుస్తుంది. అతని గత ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ 25 బంతుల్లో వచ్చింది. 2015 ఎడిషన్‌ ఫైనల్లో సీఎస్‌కేపై ఈ ఫీట్‌ సాధించాడు.

మరో మైలురాయి
ఈ హాఫ్‌ సెంచరీతో రోహిత్‌ ఐపీఎల్‌లో మరో మైలురాయిని తాకాడు. ఈ హాఫ్‌ సెంచరీ అతనికి ఐపీఎల్‌లో 50వది. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక హాఫ్‌ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు. అతని కంటే ముందు విరాట్‌ కోహ్లి (72), డేవిడ్‌ వార్నర్‌ (66), శిఖర్‌ ధవన్‌ (53) ఉన్నారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. కేకేఆర్‌ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్‌ దూసుకుపోతుంది. 9 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 110 పరుగులు చేసి, లక్ష్యానికి మరో 111 పరుగుల దూరంలో ఉంది. రోహిత్‌ శర్మ (59), రికెల్టన్‌ (50) అర్ద సెంచరీలు పూర్తి చేసి ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు.

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. రహానే (67), రఘువంశీ (51) అర్ద సెంచరీలతో రాణించగా.. రింకూ సింగ్‌ (33 నాటౌట్‌) విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆరంభంలో ఫిన్‌ అలెన్‌ (37) సైతం మెరుపులు మెరిపించాడు. 

భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్న కెమరూన్‌ గ్రీన్‌ (18) దారుణంగా విఫలం కాగా.. రమన్‌దీప్‌ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముంబై ఇండియన్స్‌ బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ (4-0-39-3), ట్రెంట్‌ బౌల్ట్‌ (4-0-38-0) అద్భుతంగా బౌలింగ్‌ చేయగా..హార్దిక్‌ పాండ్యా ఓ వికెట్‌ తీశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement