పంత్‌.. సిక్సర్ల మోత!

Rishabh Pant Hits Sixes At Will In Sharjah - Sakshi

షార్జా:  గతేడాది చివర్లో గాయం కారణంగా భారత జట్టులో చోటు కోల్పోయి తనను మరోసారి నిరూపించుకోవడం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఐపీఎల్‌లో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. పంత్‌ స్థానాన్ని కేఎల్‌ రాహుల్‌తో భర్తీ చేయడంతో అనూహ్యంగా చోటు కోల్పోయిన పంత్‌.. ఇప్పుడు కసి మీద కనిపిస్తున్నాడు. యూఏఈ వేదికగా జరుగనున్న ఐపీఎల్‌ తాజా సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పంత్‌ సీరియస్‌గా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. ఐపీఎల్‌తో తన టీమిండియా రీఎంట్రీ ఉండాలనే ఏకైక లక్ష్యంతో పంత్‌ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం అతను ప్రాక్టీస్‌ చేస్తున్న తీరే ఇందుకు ఉదాహరణ.  వరుసగా మూడు సిక్సర్లతో ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఆనందాన్ని రెట్టింపు జేశాడు. ‍ (చదవండి: అజహరుద్దీన్, అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యుల మధ్య వివాదం!)

షార్జాలో  ప్రాక్టీస్‌ సెషన్‌లో వెటరన్‌ లెగ్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా బౌలింగ్‌లో పంత్‌ హ్యాట్రిక్‌ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. తొలి బంతిని లాంగాన్‌ సిక్స్‌ కొట్టిన పంత్‌.. రెండో బంతిని డీప్‌ ఫైన్‌లెగ్‌ మీదుగా సిక్స్‌ బాదేశాడు. ఇక మూడో బంతిని లాంగాఫ్‌ వైపు బౌండరీ దాటించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్‌ షేర్‌ చేయగా, అది వైరల్‌గా మారింది. మరో పది రోజుల్లో ఆరంభమయ్యే ఐపీఎల్‌లో ఢిల్లీకి పంత్‌ కీలక ఆటగాడు. ప్రస్తుతం ఢిల్లీ మెంటార్‌ సౌరవ్‌ గంగూలీ అందుబాటులో లేకపోవడంతో, హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ పర్యవేక్షణలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రాక్టీస్‌ ముమ‍్మరం చేసింది.

ఇటీవలే ప్రాక్టీస్‌ కోసం లెక్కకు మించి శ్రమించాల్సిన అవసరం లేదని క్యాపిటల్స్‌ బృందానికి తెలియజేశాడు. ఒకవేళ ఇప్పుడు విరామం​ లేకుండా ప్రాక్టీస్‌ చేస్తే ఆ సమయానికి అలసిపోతామని పాంటింగ్‌ పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ డైలీ ప్రాక్టీస్‌ను గంటలకే పరిమితం చేసింది. పంత్‌ కొట్టిన సిక్సర్లకు 1998లో కోకాకోలా కప్‌ ఫైనల్‌లో భాగంగా జిం‍బాబ్వేపై భారత మాజీ కెప్టెన్‌, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ వరుసగా కొట్టిన మూడు సిక్సర్లను ఒక అభిమాని జత చేశాడు. (చదవండి: తన కోపమే తన శత్రువు)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top