
అబుదాబి: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ 132 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. సన్‌రైజర్స్ బౌలర్లు దుమ్మురేపడంతో ఆర్సీబీ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. ప్రధానంగా హోల్డర్, నటరాజన్‌లు తమ పేస్‌తో ఆర్సీబీకి చుక్కలు చూపించారు. ఆరంభంలోనే ఆర్సీబీని హోల్డర్ గట్టి దెబ్బకొట్టాడు. కోహ్లి, పడిక్కల్‌లను తన వరుస ఓవర్లలో పెవిలియన్‌కు పంపి సన్‌రైజర్స్‌కు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఆర్సీబీ జట్టులో ఏబీ డివిలియర్స్((56; 43 బంతుల్లో 5 ఫోర్లు)హాఫ్ సెంచరీకి జతగా అరోన్ ఫించ్(32; 30 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్) మాత్రమే రాణించాడు. మిగతా బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో ఆర్సీబీ సాధారణ స్కోరునే బోర్డుపై ఉంచింది.
టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. దాంతో ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను విరాట్ కోహ్లి, దేవదూత్ పడిక్కల్‌లు ఆరంభించారు. కోహ్లి(6) విఫలం కాగా, పడిక్కల్(1) కూడా నిరాశపరిచాడు. హోల్డర్ వేసిన రెండో ఓవర్ రెండో బంతికి కోహ్లి ఔట్ కాగా, హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ నాల్గో ఓవర్ మూడో బంతికి పడిక్కల్ పెవిలియన్ చేరాడు. దాంతో ఆర్సీబీ 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత ఫించ్, ఏబీ డివిలియర్స్‌లు ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేశారు. ఈ జోడి 41 పరుగులు జత చేసిన తర్వాత ఫించ్(32; 30 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్) ఔటయ్యాడు. నదీమ్ వేసిన 11 ఓవర్ రెండో బంతికి ఫించ్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన మొయిన్ అలీ(0), శివం దూబే(8), సుందర్(5)లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. కానీ డివిలియర్స్ పోరాటం చేయడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో హోల్డర్ మూడు వికెట్లు సాధించగా, నటరాజన్ రెండు వికెట్లు తీశాడు. నదీమ్‌కు వికెట్ దక్కింది.