ఐపీఎల్ 2026లో ఇవాళ (మే 17) మధ్యాహ్నం అత్యంత కీలక సమరం జరుగనుంది. టేబుల్ టాపర్‌గా ఉన్న ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం కొట్టిమిట్టాడుతున్న పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఆర్సీబీకి పెద్దగా కీలకం కాకపోయినా, పంజాబ్‌కు మాత్రం చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఓడిందా ఖేల్ దాదాపు ఖతమైనట్లే.
ఆర్సీబీ విషయానికొస్తే.. ఈ జట్టుకు ఈ మ్యాచ్ అంత ముఖ్యం కాకపోయినా, గెలిస్తే మాత్రం దర్జాగా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఓడినా ఈ జట్టుకు మరో ఛాన్స్ ఉంటుంది. చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై గెలిస్తే అప్పుడైన ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది.
ఒకవేళ అది కూడా ఓడిందా.. ఇతర జట్ల గెలుపోటములపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇంతదాకా తెచ్చుకోకూడదంటే నేటి మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిస్తే సరిపోతుంది. ఈ లెక్కన ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్‌కు కేవలం అడుగుదూరంలో ఉంది.
తెగే దాకా తెచ్చుకున్న పంజాబ్
ఈ సీజన్‌లో పంజాబ్ పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. తొలి 7 మ్యాచ్‌ల్లో 6 గెలిచి జైత్రయాత్ర చేసిన ఈ జట్టు, అనూహ్యంగా పరాజయాల బాట పట్టింది. ఏమైందో ఏమో తెలీదు కానీ, చివరి 5 మ్యాచ్‌ల్లో వరుసగా ఓడి ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
ప్రస్తుతం ఈ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్నా, చివరికొచ్చే సరికి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుందన్న గ్యారెంటీ లేదు. నేటి మ్యాచ్‌లో ఆర్సీబీపై, 23వ తేదీ జరిగే మ్యాచ్‌లో లక్నోపై గెలిస్తే ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండవచ్చు.
ఇప్పటికే తెగే దాకా తెచ్చుకున్న పంజాబ్, ఇకపై జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టుకు ఎదురుకాని అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్సీబీ, లక్నో మ్యాచ్‌లు ఈ జట్టుకు సెమీస్, ఫైనల్స్ లాంటివి.
నేటి మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ ధర్మశాల వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలవుతుంది. ఇరు జట్లు ఈ సీజన్‌లో తలపడటం ఇదే మొదటిసారి. ఆర్సీబీ రెండు వరుస విజయాలతో దూకుడుమీదుంటే.. పంజాబ్ ఐదు వరుస పరాజయాలతో ఢీలా పడిపోయి ఉంది.


