
కాన్‌బెర్రా: రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్... పూర్తి స్థాయి బౌలర్ కాదు కాబట్టి అతని బౌలింగ్‌కు పరిమితులున్నాయి... కానీ చహల్ రెగ్యులర్ బౌలర్. అందువల్ల జడేజా స్థానంలో ‘కన్‌కషన్ సబ్‌స్టిట్యూట్’గా చహల్‌ను అనుమతించడం సరైంది కాదు అనేది ఒక వాదన. జడేజా కూడా మైదానంలో ఉంటే తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తిగా వేసేవాడు కాబట్టి అందులో తప్పు లేదని మరో వాదన! బహుశా ఆసీస్ కోచ్ లాంగర్ కూడా మ్యాచ్ రిఫరీ బూన్ ముందు ఇదే వాదన వినిపించి ఉంటాడు. అయితే చివరకు రిఫరీ మాత్రం తన విచక్షణాధికారం మేరకు భారత్ విజ్ఞప్తిని అంగీకరించడంతో చహల్ బౌలింగ్‌కు దిగ డం, 3 కీలక వికెట్లతో గెలిపించడం జరిగిపోయాయి. (ఇవాళ అదే వర్కౌట్ అయ్యింది: కోహ్లి)
జడేజా స్థానంలో చహల్ ఆడటంకంటే అందుకు దారి తీసిన పరిస్థితులు ఈ వివాదానికి కారణం. 19వ ఓవర్లో మూడు బంతుల తర్వాత జడేజా కండరాల నొప్పితో బాధపడుతూ చికిత్స తీసుకున్నాడు. తర్వాతి ఓవర్ రెండో బంతికి స్టార్క్ వేసిన బంతి అతని హెల్మెట్‌ను బలంగా తగిలింది. అది గాల్లోకి లేచి బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా వెళ్లగా హెన్రిక్స్ క్యాచ్ వదిలేశాడంటే దాని తీవ్రత ఏమిటో అర్థమవుతుంది. అయితే ఆ సమయంలో భారత ఫిజియో రాకపోగా, జడేజా బ్యాటింగ్ కొనసాగించాడు. ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మాత్రమే జడేజా ‘కాంకషన్’కు గురైనట్లు, తలకు బంతి తగలడంతో మగతగా ఉన్నట్లు భారత వైద్య బృందం తేల్చడంతో సబ్‌స్టిట్యూట్ అవసరం కలిగింది.
ఐసీసీ నిబంధనల ప్రకారం సరిగ్గా జడేజా శైలిలాంటి ‘లైక్ ఫర్ లైక్’ ఆటగాడు మన జట్టులో మరొకరు లేరు. దాంతో బౌలింగ్ చేయగలిగే చహల్‌ను భారత్ ఎంపిక చేసుకుంది. అతను మ్యాచ్‌ను మలుపు తిప్పడంతోనే చర్చ మొదలైంది.
నిబంధనల ప్రకారం బంతి తగలగానే వైద్యులు ఆటగాడిని పరీక్షించాలి. జడేజా విషయంలో ఇలా జరగలేదు. అయితే కన్‌కషన్ ప్రభావం వెంటనే కనబడకపోవడం కూడా సహజం. ‘ఇలాంటి విషయంలో డాక్టర్ నివేదికను మనం నమ్మాలి’ అంటూ ఆసీస్ కెప్టెన్ ఫించ్ చెప్పడం వివాదాన్ని ముగించే సానుకూల వ్యాఖ్యగానే చూడాలి.
కొసమెరుపు: ఈ నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత భారత్ నుంచి బరిలోకి దిగిన తొలి ఆటగాడు చహల్. అతనే మ్యాచ్‌ను గెలిపించాడు కూడా. పైగా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన తొలి ‘కాంకషన్ సబ్‌స్టిట్యూట్’ అతనే కావడం విశేషం. ళీ 2019 ఆగస్టు 1 నుంచి క్రికెట్‌లో ‘కాంకషన్ సబ్‌స్టిట్యూట్’ నిబంధనను అమలు చేశారు. అదే ఏడాది ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన టెస్టులో ఆసీస్ బ్యాట్స్‌మన్ స్మిత్ తలకు గాయమవ్వడంతో స్మిత్ స్థానంలో లబ్‌షేన్ ‘కన్‌కషన్ సబ్‌స్టిట్యూట్’గా వచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇదే తొలి కాంకషన్సబ్‌స్టిట్యూషన్.
టి20 సిరీస్ నుంచి జడేజా అవుట్...
జడేజా తలకు తగిలిన దెబ్బను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. గాయం తీవ్రత దృష్ట్యా టి20 సిరీస్‌లోని మిగిలిన రెండు మ్యాచ్‌లకు జడేజా దూరమయ్యాడు. అతని స్థానంలో శార్దుల్ ఠాకూర్‌ను జట్టులోకి ఎంపిక చేశామని బీసీసీఐ ప్రకటించింది.