
భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ నిన్న (ఆగస్ట్ 27) ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రికెట్ జీనియస్ క్యాష్ రిచ్ లీగ్ నుంచి తప్పుకున్న నేపథ్యంలో అతని పేరిట ఓ భారీ ఐపీఎల్ రికార్డు తెరపైకి వచ్చింది. అదేంటంటే.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక బంతులు వేసిన రికార్డు.
2009లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన అశ్విన్.. తన 221 మ్యాచ్‌ల కెరీర్‌లో 4710 బంతులు వేశాడు. ఐపీఎల్‌లో ఓ బౌలర్ వేసిన అత్యధిక బంతులు ఇవే. అశ్విన్ తర్వాత ఐపీఎల్‌లో అత్యధిక బంతులు వేసిన ఘనత సునీల్ నరైన్‌కు దక్కుతుంది. నరైన్ తన ఐపీఎల్ కెరీర్‌లో 4345 బంతులు సంధించాడు. ఈ విభాగంలో అశ్విన్, నరైన్ తర్వాతి స్థానాల్లో భువనేశ్వర్ కుమార్ (4222), రవీంద్ర జడేజా (4056) ఉన్నారు.
37 ఏళ్ల ఆశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసి, 2025 సీజన్‌లో అదే ఫ్రాంచైజీ తరఫున తన చివరి మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 221 మ్యాచ్‌లు ఆడిన అతను 187 వికెట్లు తీశాడు. అలాగే ఓ హాఫ్ సెంచరీ సాయంతో 833 పరుగులు చేశాడు.
సీఎస్‌కే తరఫున రెండు టైటిళ్లు (2010, 2011) సాధించిన అశ్విన్.. రైజింగ్ పూణే, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్ వంటి జట్లకు సేవలందించారు. రెండు సీజన్లలో (2018, 2019) పంజాబ్‌కు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. 16 సీజన్ల పాటు ఐపీఎల్‌లో తన మాయాజాలాన్ని ప్రదర్శించిన అశ్విన్.. త్వరలో విదేశీ లీగ్‌ల్లో పాల్గొంటాడని తెలుస్తుంది.
ఐపీఎల్‌లో అశ్విన్ పేరిట ఉన్న ప్రత్యేకమైన రికార్డులు
ఐదో అత్యధిక వికెట్లు (187)
సీఎస్‌కే తరఫున మూడో అత్యధిక వికెట్లు (97)
ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఐదో అత్యధిక వికెట్లు (25)
ఐపీఎల్ చరిత్రలో మూడో అత్యధిక డాట్ బాల్స్ (1663)
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక బాల్స్ (4710)
ఇతర గుర్తించదగిన ఘట్టాలు
2011 ఎడిషన్ ఫైనల్లో క్రిస్ గేల్‌ను డకౌట్ చేయడం
2019 ఎడిషన్‌లో జోస్ బట్లర్‌ను మన్కడింగ్ చేయడం
ఐపీఎల్‌లో రిటైర్డ్ ఔటైన తొలి ఆటగాడు (2022 ఎడిషన్‌లో)
ఐదు సీజన్లలో ఐదు వేర్వేరు జట్ల తరఫున (CSK, RPS, PBKS, DC, RR) ఆడటం