Ranji Quarter Final-4: రికీ భుయ్‌ సూపర్‌ సెంచరీ.. కొనసాగుతున్న ఆంధ్రపద్రేశ్‌ జోరు

Ranji Trophy 2022 23 4th Quarter Final: Ricky Bhui Slams Hundred Vs Madhya Pradesh - Sakshi

Ranji Trophy 2022-23 4th Quarter Final: ఇండోర్‌ వేదికగా మధ్యప్రదేశ్‌తో ఇవాళ (జనవరి 31) ప్రారంభమైన నాలుగో క్వార్టర్‌ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌ పటిష్ట స్థితికి చేరుకుంది. ప్రస్తుత సీజన్‌లో వరస విజయాలు నమోదు చేసి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన ఆంధ్ర టీమ్‌.. కీలకమైన మ్యాచ్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చి జోరును కొనసాగిస్తుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు.. రికీ భుయ్‌ (115 నాటౌట్‌) సూపర్‌ సెంచరీతో చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది.

రికీ భుయ్‌కి జతగా కరణ్‌ షిండే (83 నాటౌట్‌) రాణించాడు. ఓపెనర్లు జ్ఞానేశ్వర్‌ (24), అభిషేక్‌ రెడ్డి (22) తమతమ ఇన్నింగ్స్‌లకు లభించిన శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్‌ హనుమ విహారి (16) రిటైర్డ్‌ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆంధ్రప్రదేశ్‌ కోల్పోయిన రెండు వికెట్లు గౌరవ్‌ యాదవ్‌ ఖాతాలో చేరాయి.   

కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో ఇవాళే (జనవరి 31) ప్రారంభమైన మొదటి క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో బెంగాల్‌-జార్ఖండ్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బెంగాల్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. న్యూజిలాండ్‌ సిరీస్‌లో టీమిండియా సభ్యుడిగా ఉన్న ముకేశ్‌ కుమార్‌ (3/61), ఆకాశ్‌దీప్‌ (4/46), ఇషాన్‌ పోరెల్‌ (1/29), ఆకాశ్‌ ఘాతక్‌ (1/28) బంతితో చెలరేగడంతో జార్ఖండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకు ఆలౌటైంది.

కుమార్‌ సూరజ్‌ (89) అజేయ హాఫ్‌ సెంచరీతో రాణించగా.. పంకజ్‌ కిషోర్‌ కుమార్‌ (21), షాబజ్‌ నదీమ్‌ (10), ఆశిష్‌ కుమార్‌ (12) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. అనంతరం బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించాల్సి ఉండగా.. వెలుతురులేమి కారణంగా అంపైర్లు తొలి రోజు ఆటను ముగించారు.  

బెంగళూరులోని చిన్నిస్వామి స్టేడియం వేదికగా కర్ణాటకతో జరుగుతున్న మూడో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఉత్తరఖండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 116 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన కర్ణాటక.. మురళీధర వెంకటేశ్‌ (5/36), విధ్వత్‌ కావేరప్ప (2/17), కృష్ణప్ప గౌతమ్‌ (2/22), విజయ్‌కుమార్‌ విశఖ్‌ (1/25) చెలరేగడంతో ఉత్తరాఖండ్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేసింది.

ఉత్తరాఖండ్‌ ఇన్నింగ్స్‌లో అవ్నీష్‌ సుధ (17), కునాల్‌ చండీలా (31), ఆదిత్య తారే (14), అఖిల్‌ రావత్‌ (14) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన కర్ణాటక.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 123 పరుగులు చేసింది. రవికుమార్‌ సమర్థ్‌ (54), కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (65) క్రీజ్‌లో ఉన్నారు. రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న రెండో క్వార్టర్‌ ఫైనల్లో సౌరాష్ట్ర-పంజాబ్‌ జట్లు తలపడుతున్నాయి. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top