
భారత క్రికెట్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్ష పదవికి రోజర్ బిన్నీ రాజీనామా చేశారు. బిన్నీ స్థానంలో ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా జరిగిన బీసీసీఐ ఏపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ మార్పు చోటు చేసుకుంది.
రోజర్ బిన్నీ రాజీనామా వెనుక కారణాలేమీ లేవు. బీసీసీఐ నిబంధనల ప్రకారం 70 ఏళ్లు దాటిన వ్యక్తి అధ్యక్ష పదవిలో కొనసాగడం సాధ్యపడదు. బిన్నీ ఇటీవలే 70వ పడిలోకి అడుగుపెట్టారు. అందుకే అతను స్వచ్ఛందంగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం అధికారికంగా ప్రకటించబడింది.
కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడి హోదాలో కొనసాగుతారు. అధ్యక్ష ఎన్నికలు సెప్టెంబర్‌లో జరిగే అవకాశం ఉంది. కొత్త అధ్యక్షుడి రేసులో రాజీవ్ శుక్లాతో పాటు పలువురు భారత మాజీ క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు ఉన్నారని తెలుస్తుంది.
తాత్కాలిక అధ్యక్షుడు రాజీవ్ శుక్లా క్రికెట్ పరిపాలనలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి. 2015లో అతడు ఐపీఎల్ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2020లో తొలి దఫా బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా.. మధ్యలో ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా వ్యవహరించారు. రాజీవ్ శుక్లాకు రాజకీయ ప్రవేశం కూడా ఉంది. జర్నలిజం రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన శుక్లా.. ప్రస్తుతం ఛత్తీస్‌ఘడ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.