ఐపీఎల్ ప్రారంభ సీజన్ విజేత రాజస్థాన్ రాయల్స్ తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఇటీవలే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలను అమ్మకాలకు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే రాజస్థాన్ రాయల్స్ కొలంబియా పసిఫిక్ క్యాపిటల్స్ పార్టనర్స్ (సీపీసీసీ) కన్సార్టియం నుంచి వచ్చిన 16 వేల కోట్లు (1.7 బిలియన్ డాలర్ల) బిడ్డింగ్‌ను వదులుకోవడం ఆశ్చర్యపరిచింది.
వాస్తవానికి రాజస్థాన్‌కు ఇప్పుడొచ్చిన బిడ్ మంచి ధరే అని చెప్పొచ్చు. కానీ ఎక్కువ మొత్తాన్ని ఆశిస్తూ పెద్ద మొత్తంలో వచ్చిన బిడ్‌ను కాదనుకొని రాజస్థాన్ చేతులు కాల్చుకుంటుందని పలువురు క్రీడా నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా, కెనడాలో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అయిన సీపీసీసీ రాజస్థాన్ రాయల్స్ కోసం పెద్ద మొత్తంలో బిడ్‌ను దాఖలు చేయడం కొంత ఆశ్చర్యపరిచింది.
రాజస్థాన్ ఫ్రాంచైజీలో ఎమర్జింగ్ మీడియా వెంచర్స్ అధినేత మనోజ్ బదాలె వాటా 65 శాతం కాగా మిగతా వాటా రెడ్‌బర్డ్ క్యాపిటల్‌కు ఉంది. మరోవైపు ఐపీఎల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన జట్లలో ముందు వరుసలో ఉండే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విలువ మాత్రం 20వేల కోట్లు దాటే అవకాశముంది.
ఇప్పటికే ఆర్సీబీని కొనుగోలు చేసేందుకు మణిపాల్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రంజన్ పై సారథ్యంలోని కన్సార్టియం దాదాపు 2 బిలియన్ డాలర్లకు పైగానే బిడ్‌ను దాఖలు చేసింది. ఇక 2008లో ప్రారంభమైన ఐపీఎల్ తొలి సీజన్‌లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టైటిల్ గెలుచుకుంది.
షేన్ వార్న్ సారధ్యంలోని జట్టులో రవీంద్ర జడేజా, షేన్ వాట్సన్, యూసఫ్ పఠాన్ సహా కీలక క్రికెటర్లు ఎందరో ఉన్నారు. ఇక ఆ తర్వాత రాజస్థాన్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతూనే వచ్చింది. అయితే 2013 తర్వాత నుంచి రాజస్థాన్ కాస్త గాడిన పడింది. 2013లో ప్లేఆఫ్స్ చేరిన రాజస్థాన్ ఆ తర్వాత 2015, 2018 సీజన్‌లోనూ ప్లేఆఫ్స్ చేరింది. 2022లో శాంసన్ సారథ్యంలో రన్నరప్‌గా నిలిచింది. 2025 సీజన్‌లో రాజస్థాన్ 9వ స్థానంలో నిలిచి లీగ్ దశకే పరిమితమైంది.
చదవండి: ‘మానసిక వేదన అనుభవిస్తున్నా’


