IND vs NZ 1st Test: 52 బంతుల పాటు రచిన్‌, ఎజాజ్‌లు అడ్డుగోడలా

Rachin Ravindra-Ajaz Patel Played 52 Balls Match Drawn IND vs NZ 1st Test - Sakshi

భారత్, న్యూజిలాండ్‌ తొలి టెస్టు ‘డ్రా’

రెండో ఇన్నింగ్స్‌లో కివీస్‌ 165/9

పోరాడిన రచిన్‌ రవీంద్ర, ఎజాజ్‌

శుక్రవారం నుంచి ముంబైలో రెండో టెస్టు

52... తొలి టెస్టును రక్షించుకునేందుకు న్యూజిలాండ్‌ చివరి జోడీ ఆడిన బంతులివి... ముగ్గురు భారత స్పిన్నర్లు అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ తమ అస్త్ర శస్త్రాలన్నీ ప్రయోగించారు... కానీ రచిన్‌ రవీంద్ర, ఎజాజ్‌ పటేల్‌ కనబర్చిన పట్టుదల ముందు అవన్నీ పనికిరాకుండా పోయాయి. ఒక్క మంచి బంతి చాలు ప్రత్యర్థి ఆటకట్టించేందుకు అన్నట్లుగా కనిపించినా... కివీస్‌ జోడీ ప్రతీ బంతిని సమర్థంగా ఎదుర్కొని మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించగలిగింది. చివర్లో కాస్త వెలుతురులేమి వారికి కలిసొచ్చినా... భారత గడ్డపై, చివరి రోజు పిచ్‌పై తీవ్ర ఒత్తిడి మధ్య వీరిద్దరు కనబర్చిన పోరాటపటిమ అసమానం. ‘ప్రపంచ చాంపియన్‌’ను చిత్తు చేసి ఇటీవలి పరాజయాలకు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న భారత్‌కు మాత్రం చివరకు నిరాశే ఎదురైంది. 

కాన్పూర్‌: ఒక్క వికెట్‌... భారత్‌కు, విజయానికి మధ్యలో నిలిచింది! బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై తొలి టెస్టు చివరి రోజు మిగిలిన తొమ్మది న్యూజిలాండ్‌ వికెట్లు తీసి సునాయాసంగా మ్యాచ్‌ గెలుస్తుందనుకున్న భారత్‌ చివరకు ‘డ్రా’తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సోమవారం ఆట ముగిసే సమయానికి కివీస్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. టామ్‌ లాథమ్‌ (146 బంతుల్లో 52; 3 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అయితే రచిన్‌ రవీంద్ర (91 బంతుల్లో 18 నాటౌట్‌; 2 ఫోర్లు), ఎజాజ్‌ పటేల్‌ (23 బంతుల్లో 2 నాటౌట్‌) కలిసి భారత్‌కు చివరి వికెట్‌ ఇవ్వకుండా అడ్డుపడ్డారు. వెలుతురు తగ్గడంతో నిర్ణీత సమయంకంటే 12 నిమిషాల ముందే (కనీసం మరో 3 ఓవర్లు పడేవి) అంపైర్లు ఆటను నిలిపివేశారు. టెస్టులో సెంచరీ, అర్ధ సెంచరీ సాధించిన శ్రేయస్‌ అయ్యర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలవగా... రెండో టెస్టు శుక్రవారం నుంచి ముంబైలో జరుగుతుంది.  

చదవండి: Ind Vs Nz Test Series: డ్రా.. అంపైర్ల నిర్ణయం సరైందే; మరి రెండో టెస్టులో రహానేపై వేటు?!

కీలక భాగస్వామ్యం...
తొలి టెస్టులో న్యూజిలాండ్‌ చివరకు ‘డ్రా’తో బయటపడగలిగిందంటే తొలి సెషన్‌లో ఆ జట్టు బ్యాటర్లు కనబర్చిన పట్టుదలే ప్రధాన కారణం. తొమ్మిది వికెట్లు తీయాల్సిన స్థితిలో బరిలోకి దిగిన భారత్‌ 31 ఓవర్ల సెషన్‌లో ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయింది. లాథమ్‌తో పాటు నైట్‌వాచ్‌మన్‌ సోమర్‌విలే (110 బంతుల్లో 36; 5 ఫోర్లు) కూడా మన బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ గట్టిగా నిలబడ్డాడు. లాథమ్‌ ఎల్బీ కోసం అప్పీల్‌ చేసినా రివ్యూలో ఫలితం ప్రతికూలంగానే వచ్చిం ది. తొలి ఇన్నింగ్స్‌లో చెలరేగిన అక్షర్‌కు 21 ఓవర్ల పాటు బౌలింగ్‌ ఇవ్వకపోవడం కూడా ఒక వ్యూహాత్మక తప్పిదం. ఎట్టకేలకు లంచ్‌ తర్వాత సుదీర్ఘ రెండో వికెట్‌ భాగస్వామ్యానికి (194 బంతుల్లో 76 పరుగులు) తెర పడింది. ఉమేశ్‌ వేసిన తొలి బంతికే గిల్‌ అద్భుత క్యాచ్‌తో సోమర్‌విలే వెనుదిరిగాడు. ఆ తర్వాతి నుంచి గెలుపు ఆలోచన మాని కివీస్‌ ‘డ్రా’ కోసం బంతులు వృథా చేయడంపైనే దృష్టి పెట్టింది. అయితే రెండో సెషన్‌లో 7 పరుగుల వ్యవధిలోనే లాథమ్, టేలర్‌ (2)లను అవుట్‌ చేసిన భారత్‌... ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టింది.  

ఆశలు రేగినా... 
చివరి సెషన్‌లో ఉత్కంఠ పెరిగిపోయింది. భారత్‌ లక్ష్యం 6 వికెట్లు కాగా... కివీస్‌ కనీసం 31.5 ఓవర్లు జాగ్రత్తగా ఆడాల్సిన స్థితిలో నిలిచింది. అయితే ముందుగా నికోల్స్‌ (1), ఆపై కెప్టెన్‌ విలియమ్సన్‌ (112 బంతుల్లో 24; 3 ఫోర్లు) ఆరో వికెట్‌గా వెనుదిరగడంతో భారత్‌ గెలుపుపై ఆశలు పెరిగాయి. తర్వాతి 3 వికెట్లు తీసేందుకు కూడా భారత్‌కు ఇబ్బంది ఎదురు కాలేదు. అయితే చివరి వికెట్‌కు రచిన్, ఎజాజ్‌ చేసిన పోరాటం ప్రపంచ చాంపియన్‌ను గట్టెక్కించింది. ఆఖరి సెషన్‌లో ఇరు జట్ల ఆటగాళ్లలో ఒత్తిడి పెరిగిపోయింది. ఈ సెషన్‌లో ఐదు ఫలితాలు  కూడా అంపైర్‌ ‘రివ్యూ’ కోరాల్సి వచ్చింది. మూడుసార్లు సమీక్ష కోరిన న్యూజిలాండ్‌ ఒకసారి సానుకూల ఫలితం పొందగా, భారత్‌ కోరిన రెండు రివ్యూలు వృథా అయ్యాయి.

చదవండి: Ind Vs Nz 1st Test Draw: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మార్పులు ఇవీ!

స్కోరు వివరాలు  
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 345; న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 296; భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 234/7 డిక్లేర్డ్‌
 న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: లాథమ్‌ (బి) అశ్విన్‌ 52; యంగ్‌ (ఎల్బీ) (బి) అశ్విన్‌ 2; సోమర్‌విలే (సి) గిల్‌ (బి) ఉమేశ్‌ 36; విలియమ్సన్‌ (ఎల్బీ) (బి) జడేజా 24; టేలర్‌ (ఎల్బీ) (బి) జడేజా 2; నికోల్స్‌ (ఎల్బీ) (బి) అక్షర్‌ 1; బ్లన్‌డెల్‌ (బి) అశ్విన్‌ 2; రచిన్‌ రవీంద్ర (నాటౌట్‌) 18; జేమీసన్‌ (ఎల్బీ) (బి) జడేజా 5; సౌతీ (ఎల్బీ) (బి) జడేజా 4; ఎజాజ్‌ పటేల్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (98 ఓవర్లలో 9 వికెట్లకు) 165.  
వికెట్ల పతనం: 1–3, 2–79, 3–118, 4–125, 5–126, 6–128, 7–138, 8–147, 9–155.
బౌలింగ్‌: అశ్విన్‌ 30–12–35–3, అక్షర్‌ పటేల్‌ 21–12–23–1, ఉమేశ్‌ 12–2–34–1, ఇషాంత్‌ 7–1–20–0, జడేజా 28–10–40–4.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top