
డ్రాగా ముగిసిన తొలి టెస్టు.. అంపైర్ల నిర్ణయం సరైందేనన్న రహానే
Ind Vs Nz Ajinkya Rahane: Management Will Make Call Mumbai Test XI: విజయం ఖాయమనుకున్న తరుణంలో న్యూజిలాండ్ టెయిలెండర్లు అజాజ్ పటేల్, రచిన్ రవీంద్ర.. టీమిండియా ఆశలపై నీళ్లు చల్లారు. ఒక్క వికెట్.. ఒక్కటంటే ఒక్క వికెట్.. గెలుపు మనదే అంటూ అభిమానులు ఆతురతగా ఎదురుచూస్తున్న వేళ కివీస్‌ను ఓటమి బారి నుంచి తప్పించి డ్రాగా ముగిసేలా చేశారు. దీంతో రహానే సేనకు నిరాశ తప్పలేదు. ఈ నేపథ్యంలో కెప్టెన్ అజింక్య రహానే స్పందించాడు. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. ‘‘నా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాననే అనుకుంటున్నా. వాళ్లు(కివీస్) చాలా బాగా ఆడారు. తొలి సెషన్ తర్వాత మేము పుంజుకున్నాం. మెరుగైన భాగస్వామ్యాలు నమోదు చేశాం.
ఇంకో 5-6 ఓవర్లు బౌల్ చేయాలని భావించాం. అంపైర్‌తో మాట్లాడాను కూడా. ‘‘ఫీల్డింగ్ టీమ్ కాబట్టి మీరు బౌలింగ్ చేస్తున్నామంటున్నారు. కానీ వెలుతురు లేని కారణంగా బ్యాటింగ్ చేయడానికి వాళ్లు ఇష్టపడటం లేదు’’ అని నాతో అన్నారు. నాకు తెలిసి అంపైర్లు తీసుకున్నది సరైన నిర్ణయమే’’ అని రహానే పేర్కొన్నాడు. ఇక తమ బౌలర్లపై ప్రశంసలు కురిపించిన రహానే... అరంగేట్రంలోనే అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన శ్రేయస్ అయ్యర్‌ను కొనియాడాడు. టెస్టుల్లో అరంగేట్రం చేయడానికి అతడు చాలా కాలం పాటు ఎదురుచూడాల్సి వచ్చిందన్న రహానే.. అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడని ప్రశంసించాడు.
ఇదిలా ఉండగా.. ఈ తొలి టెస్టులో రహానే బ్యాటర్‌గా ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్‌లో 35 పరుగులకే అవుటైన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం ఒకే ఒక్క బౌండరీ బాది పెవిలియన్ చేరాడు. దీంతో కెప్టెన్‌గా ఉన్నాడు కాబట్టే ఇప్పటికీ రహానే జట్టులో కొనసాగుతున్నాడని.. రెండో టెస్టులో అతడిని తప్పించి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. పలువురు క్రీడా విశ్లేషకులు సైతం.. రహానే ఆట తీరుపై పెదవి విరిచారు.
మరోవైపు ముంబై వేదికగా రెండో టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి అందుబాటులోకి రానున్న నేపథ్యంలో రహానేపై వేటు పడే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రహానే స్పందిస్తూ... ‘‘తదుపరి టెస్టుకు విరాట్ తిరిగి వస్తాడు. ముంబై గేమ్‌లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోను. మేనేజ్‌మెంట్ అంతా చూసుకుంటుంది’’ అని పేర్కొన్నాడు.
చదవండి: Ind Vs Nz 1st Test Draw: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మార్పులు ఇవీ!
Ind vs Nz Test- Ravichandran Ashwin: భజ్జీ రికార్డు అధిగమించిన అశూ.. కంగ్రాట్స్ సోదరా!