ఓటమితో మొదలు...

PV Sindhu and Kidambi Srikanth suffer losses BWF Tour Finals - Sakshi

తొలి లీగ్‌ మ్యాచ్‌ల్లో పోరాడి ఓడిన సింధు, శ్రీకాంత్‌

మిగతా మ్యాచ్‌ల్లో గెలిస్తేనే సెమీస్‌ ఆశలు సజీవం

వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

బ్యాంకాక్‌: ప్రతిష్టాత్మక వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ క్రీడాకారులు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌లకు శుభారంభం లభించలేదు. బుధవారం మొదలైన ఈ మెగా ఈవెంట్‌లో మహిళల, పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌ల్లో ఇద్దరికీ ఓటమి ఎదురైంది. మహిళల సింగిల్స్‌ గ్రూప్‌ ‘బి’లో ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)తో 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ ఏడో ర్యాంకర్, ప్రస్తుత వరల్డ్‌ చాంపియన్‌ సింధు 21–19, 12–21, 17–21తో పరాజయం పాలైంది.

పురుషుల సింగిల్స్‌ గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ శ్రీకాంత్‌ 21–15, 16–21, 18–21తో 77 నిమిషాల్లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ ఆండెర్స్‌ ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓటమి చవిచూశాడు. తై జు యింగ్‌ చేతిలో సింధుకిది 13వ ఓటమికాగా... ఆంటోన్సెన్‌ చేతిలో శ్రీకాంత్‌కు రెండో పరాజయం. నేడు జరిగే రెండో రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌ల్లో ప్రపంచ మాజీ చాంపియన్‌ ఇంతనోన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌)తో సింధు... వాంగ్‌ జు వె (చైనీస్‌ తైపీ)తో శ్రీకాంత్‌ ఆడతారు. సెమీఫైనల్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌ల్లో సింధు, శ్రీకాంత్‌ గెలవాల్సి ఉంటుంది.  

తై జు యింగ్‌తో జరిగిన మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌ లో గెలిచినా ఆ తర్వాత అదే జోరు కనబర్చలేకపోయింది. రెండో గేమ్‌లో వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయి 0–5 తో వెనుకబడిన సింధు ఆ తర్వాత కోలుకోలేకపోయింది. నిర్ణాయక మూడో గేమ్‌ ఆరంభంలో ఇద్దరు ప్రతి పాయింట్‌ కోసం పోరాడటంతో ఆట హోరాహోరీగా సాగింది. ఒకదశలో సింధు 13–14తో తై జు యింగ్‌ ఆధిక్యాన్ని ఒక పాయింట్‌కు తగ్గించింది. ఈ దశలోనే తై జు వరుసగా మూడు పాయింట్లు సాధించి 17–13తో ఆధిక్యంలోకి వెళ్లింది.

చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న తై జు యింగ్‌ విజయాన్ని ఖాయం చేసుకుంది. ‘మ్యాచ్‌ బాగా జరిగింది. ఏ పాయింట్‌ కూడా సులువుగా రాలేదు. మూడో గేమ్‌లో ఇద్దరి మధ్య పాయింట్ల అంతరం ఒక పాయింట్‌కు చేరుకుంది కూడా. అయితే ర్యాలీల సందర్భంగా రెండుసార్లు నా రాకెట్‌ స్ట్రింగ్స్‌ దెబ్బతినడం తుది ఫలితంపై ప్రభావం చూపింది’ అని సింధు వ్యాఖ్యానించింది. ఆంటోన్సెన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్‌ కీలకదశలో తప్పిదాలు చేశాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో 17–16తో ఆధిక్యంలోకి వెళ్లిన శ్రీకాంత్‌ ఈ దశలో వరుసగా నాలుగు పాయింట్లు సమర్పించుకొని తేరుకోలేకపోయాడు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top