Harmilan Kaur: మహిళల 1500 మీటర్ల రేసులో 19 ఏళ్ల రికార్డు బద్దలు

Punjab Harmilan Kaur Bains Breaks 19 Year Old Record Win 1500m Title - Sakshi

ఢిల్లీ: మహిళల 1500 మీటర్ల రేసులో పంజాబ్‌కు చెందిన 20 ఏళ్ల హర్మిలన్‌ కౌర్‌ బైన్స్‌ 19 ఏళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. హర్మిలన్‌ 4ని:05.39 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో 2002 ఆసియా క్రీడల్లో 4ని:06.03 సెకన్లతో సునీతా రాణి నెలకొల్పిన రికార్డును హర్మిలన్‌ తిరగరాసింది. గత ఏడాదిన్నర కాలంలో హర్మిలన్‌ ఎనిమిది జాతీయస్థాయి రేసుల్లో పాల్గొనగా అన్నింటా విజేతగా నిలువడం విశేషం.

తెలంగాణ మహిళల బృందానికి కాంస్యం


 జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో మహిళల 4X100 మీటర్ల రిలేలో తెలంగాణ బృందం కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. జీవంజి దీప్తి, నిత్య, మాయావతి నకిరేకంటి, అగసార నందినిలతో కూడిన తెలంగాణ రిలే జట్టు 47.18 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. రైల్వేస్‌కు స్వర్ణం, తమిళనాడుకు రజతం లభించాయి. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో తెలంగాణకు చెందిన అగసార నందిని ఫైనల్‌కు చేరింది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top