Cheteshawar Pujara: తన శైలికి విరుద్ధంగా బ్యాటింగ్‌.. వెంటాడిన దురదృష్టం

Pujara Hits 100-73 Balls But Team Lost Match To-Warwickshire Thriller - Sakshi

73 బంతుల్లోనే శతకం బాదిన పుజారా

టీమిండియా టెస్టు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా తన శైలికి విరుద్ధంగా బ్యాటింగ్‌ చేశాడు. పుజారా అంటేనే నెమ్మదైన బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. తాజాగా ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న రాయల్‌ లండన్‌ వన్డే కప్‌లో గ్రూఫ్‌-ఏలో వార్విక్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ 'నయావాల్‌' 73 బంతుల్లోనే శతకం మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 79 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 107 పరుగులు చేసిన పుజారా తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ససెక్స్‌ జట్టు విజయానికి కేవలం నాలుగు పరుగుల దూరంలో ఆగిపోవడం దురదృష్టకరమనే చెప్పొచ్చు. అయితే ఇన్నింగ్స్‌ 47వ ఓవర్లో పుజారా ప్రత్యర్థి బౌలర్‌కు చుక్కలు చూపించాడు. ఒకే ఓవర్లో 22 పరుగులు బాదాడు. లియామ్‌ నార్వెల్‌ వేసిన ఆ ఓవర్లో పుజారా 4,2,4,2,6,4తో 22 పరుగులు పిండుకున్నాడు. అయితే చివర్లో పుజారా ఔట్‌ కావడం జట్టు కొంపముంచిందనే చెప్పొచ్చు.

ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వార్విక్‌షైర్‌ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఓపెనర్‌ రాబర్ట్‌ యేట్స్‌ 114 పరుగులతో మెరుపు శతకం అందుకోగా.. కెప్టెన్‌ రోడ్స్‌ 76, మైకెల్‌ బర్గెస్‌ 58 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ససెక్స్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసి విజయానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచింది.

పుజారా, అలిస్టర్‌ ఓర్‌(81 పరుగులు) క్రీజులో ఉన్నంత వరకు ససెక్స్‌ విజయం దిశగానే సాగింది. అయితే పుజారా ఔటైన అనంతరం మిగతావారు రాణించడంలో విఫలం కావడంతో గెలుపుకు దగ్గరగా వచ్చి బోల్తా పడింది. ఇక పాయింట్ల పట్టికలో వార్విక్‌షైర్‌ 4 మ్యాచ్‌ల్లో రెండు గెలిచి.. రెండు ఓడి ఆరో స్థానంలో ఉండగా.. వార్విక్‌షైర్‌ 3 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో నాలుగో స్థానంలో ఉంది.

చదవండి: ఆ అవకాశమే లేదు! ఒకవేళ అదే ముఖ్యమైతే.. బీసీసీఐతో బంధాలన్నీ తెంచుకున్న తర్వాతే!

NZ vs WI: మారని ఆటతీరు.. మరో వైట్‌వాష్‌ దిశగా వెస్టిండీస్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top