పుజారా డబుల్‌ సెంచరీ.. 118 ఏళ్లలో తొలి ఆటగాడిగా

Cheteshwar Pujara Slams 3rd-Double Century For Sussex County Cricket - Sakshi

టీమిండియా టెస్టు స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజరా కౌంటీ క్రికెట్‌లో అదరగొడుతున్నాడు. ససెక్స్‌కు స్టాండింగ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పుజారా డబుల్‌ సెంచరీ సాధించాడు. మిడిలెసెక్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా ఈ ఫీట్‌ అందుకున్నాడు. 368 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో డబుల్‌ సెంచరీ మార్క్‌ అందుకున్న పుజారాకు ససెక్స్‌ తరపున ఈ ఏడాది ఇది మూడో డబుల్‌ సెంచరీ కావడం విశేషం.

ఈ నేపథ్యంలోనే పుజారా ఒక అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు. 118 ఏళ్లలో సింగిల్‌ కౌంటీ డివిజన్‌లో ససెక్స్‌ తరపున మూడు డబుల్‌ సెంచరీలు బాదిన తొలి ఆటగాడిగా పుజారా రికార్డులకెక్కాడు. ఈ ఏడాది ససెక్స్‌ తరపున డెర్బీషైర్‌తో మ్యాచ్‌లో తొలి డబుల్‌ సెంచరీ మార్క్‌ అందుకున్న పుజారా.. ఆ తర్వాత డుర్హమ్‌తో మ్యాచ్‌లో మరో డబుల్‌ సెంచరీ బాదాడు. తాజాగా మిడిలెసెక్స్‌తో మ్యాచ్‌లో ముచ్చటగా మూడో డబుల్‌ శతకం సాధించాడు.

ఇక కౌంటీల్లో మిడిల్‌సెక్స్‌ ప్రత్యర్థిగా అత్యధిక స్కోరు సాధించిన భారత ఆటగాళ్లలో పుజారా(231 పరుగులు, ససెక్స్‌) తొలి స్థానంలో నిలిచాడు. పుజారా తర్వాత వీరేంద్ర సెహ్వాగ్(130 పరుగులు, లీస్టర్‌షైర్‌)‌, రవిశాస్త్రి(127 పరుగులు, గ్లామ్‌), అబ్దుల్‌ ఖాదీర్(112 పరుగులు, వార్విక్‌షైర్‌)‌, పియూష్‌ చావ్లా( 112 పరుగులు, సోమర్‌సెట్‌) ఉన్నారు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే పుజారా 231 పరుగులు చేసి ఔట్‌ కాగానే ససెక్స్‌ ఇన్నింగ్స్‌ 523 పరుగుల వద్ద ముగిసింది. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన మిడిలెసెక్స్‌ వికెట్‌ నష్టపోకుండా 20 పరుగులు చేసింది.

టీమిండియా టెస్టు స్పెషలిస్ట్‌గా ముద్రపడిన పుజారా దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో విఫలం కావడంతో జట్టులో చోటు కోల్పోయాడు. దీంతో పుజారా కౌంటీలు ఆడేందుకు వెళ్లి ససెక్స్‌ తరపున సెంచరీలు, డబుల్‌ సెంచరీలతో చెలరేగాడు. ఇంతకముందు మిడిలెసెక్స్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో 170 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన పుజారాకు ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టుకు టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైనప్పటికి పుజారా రెండో ఇన్నింగ్స్‌లో అర్థశతకం సాధించి తన ఫామ్‌ను కంటిన్యూ చేశాడు.

చదవండి: కౌంటీల్లో వాషింగ్టన్‌ సుందర్‌ అదిరిపోయే అరంగేట్రం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top