PSL 2023: మున్రో విధ్వంసం.. చెలరేగిన ఆజమ్‌ ఖాన్‌, ఆఖర్లో ఫహీమ్‌ మెరుపులు

PSL 2023: Islamabad United Beat Quetta Gladiators By 2 Wickets - Sakshi

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2023 సీజన్‌లో లాహోర్‌ ఖలందర్స్‌ తర్వాత ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన రెండో జట్టుగా ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ నిలిచింది. క్వెట్టా గ్లాడియేటర్స్‌పై గెలుపుతో ఖలందర్స్‌ ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. నిన్న (మార్చి 5) జరిగిన మ్యాచ్‌లో గ్లాడియేటర్స్‌పై ఇస్లామాబాద్‌ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన గ్లాడియేటర్స్‌.. మహ్మద్‌ నవాజ్‌ (44 బంతుల్లో 52; 6 ఫోర్లు), నజీబుల్లా (34 బంతుల్లో 59; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఆఖర్లో ఉమర్‌ అక్మల్‌ (14 బంతుల్లో 43 నాటౌట్‌; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడం‍తో గ్లాడియేటర్స్‌ ఈ స్కోర్‌ సాధించగలిగింది. ఇస్లామాబాద్‌ బౌలర్లలో ఫజల్‌హక్‌ ఫారూఖీ 3 వికెట్లు పడగొట్టగా.. ఫహీమ్‌ అష్రాఫ్‌ 2, రయీస్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

అనంతరం బరిలోకి దిగిన ఇస్లామాబాద్‌.. 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కొలిన్‌ మున్రో.. 29 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేయగా.. ఆజమ్‌ ఖాన్‌ భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ 25  బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు.

ఆఖర్లో ఫహీమ్‌ అష్రాఫ్‌ (31 బంతుల్లో 39 నాటౌట్‌; 6 ఫోర్లు) హ్యాట్రిక్‌ బౌండరీలు బాది ఇస్లామాబాద్‌ను విజయతీరాలకు చేర్చాడు. గ్లాడియేటర్స్‌ బౌలర్లలో ఉమైద్‌ ఆసిఫ్‌ 3, మహ్మద్‌ నవాజ్‌ 2, నసీం షా, నవీన్‌ ఉల్‌ హక్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌ తలో వికెట్‌ పడగొట్టారు. లీగ్‌లో ఇవాళ జరిగే మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌.. కరాచీ కింగ్స్‌తో తలపడనుంది. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top