ఇదెక్కడి బాదుడు రా బాబు.. 34 బౌండరీలు, 28 సిక్సర్లు..!

PSL 2023: Fakhar Zaman Blasting 50, Shaheen Afridi Fifer Helps Lahore Qalandars Win Over Peshawar Zalmi - Sakshi

PSL 2023: పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2023లో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. దాదాపు ప్రతి మ్యాచ్‌లో బ్యాటర్లు.. బౌలర్లను చీల్చిచండాతూ భారీ స్కోర్‌లు చేస్తున్నారు. లీగ్‌లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 26) లాహోర్‌ ఖలందర్స్‌-పెషావర్‌ జల్మీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్లు మరోసారి శివాలెత్తడంతో పరుగుల వరద పారింది. ఇరు జట్లకు చెందిన బ్యాటర్లు బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి మ్యాచ్‌కు వేదిక అయిన గడాఫీ స్టేడియంను హోరెత్తించారు.

బ్యాటర్ల విధ్వంసం ధాటికి ఈ మ్యాచ్‌లో ఏకంగా 34 బౌండరీలు, 28 సిక్సర్లు నమోదయ్యాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన లాహోర్‌ ఖలందర్స్‌.. ఫకర్‌ జమాన్‌ (45 బంతుల్లో 96; 3 ఫోర్లు, 10 సిక్సర్లు), షఫీక్‌ (41 బంతుల్లో 75; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), సామ్‌ బిల్లింగ్స్‌ (23 బంతుల్లో 47 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంకర ఇన్నింగ్స్‌ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. 

అనంతరం బరిలోకి దిగిన పెషావర్‌ జల్మీ కూడా ఏమాత్రం తగ్గకుండా విజృంభించి ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదినప్పటికీ టార్గెట్‌ కొండంతలా ఉండటంతో 40 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పెషావర్‌ బ్యాటర్లు సైమ్‌ అయూబ్‌ (34 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), టామ్‌ కొహ్లెర్‌ కాడ్‌మోర్‌ (23 బంతుల్లో 55; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), భానుక రాజపక్ష (14 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్‌), రోవమన్‌ పావెల్‌ (15 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్‌), జేమ్స్‌ నీషమ్‌ (8 బంతుల్లో 12; సిక్స్‌), సాద్‌ మసూద్‌ (8 బంతుల్లో 16; 2 ఫోర్లు) పోరాడినప్పటికీ ఫలితం​ లేకుండా పోయింది.

పెషావర్‌ టీమ్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేయగలిగింది. షాహీన్‌ అఫ్రిది (5/40) పెషావర్‌ పతనాన్ని శాసించగా.. జమాన్‌ ఖాన్‌ 2, హరీస్‌ రౌఫ్‌, రషీద్‌ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. లీగ్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 27) లాహోర్‌ ఖలందర్స్‌-ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ జట్లు తలపడనున్నాయి. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top